సాక్షి, అమరావతి: సంక్షేమ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా వైఎస్సార్ నవశకానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్రంలోని 90 శాతానికి పైగా ప్రజలకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సబ్సిడీ బియ్యం, పెన్షన్లు పొందేందుకు ఆదాయ పరిమితిని భారీగా పెంచారు. ప్రస్తుతం రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ కుటుంబాల వార్షిక ఆదాయం రూ.75 వేలు, పట్టణాల్లో రూ.లక్ష వరకే పరిమితి ఉండేది. దీనిని భారీగా పెంచడం ద్వారా మరింత మందికి ప్రయోజనం కల్పించనున్నారు. ప్రస్తుతం ఏ పథకానికైనా తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా ఉంది. ఇక దాంతో సంబంధం లేకుండా ప్రతి పథకానికి వేర్వేరు కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఎంపిక సంతృప్త స్థాయిలో జరుగుతుంది. అర్హతే ప్రాతిపదికగా ఎంపిక ఉండనుంది. ఈ నెల 20 నుంచి 30వ తేదీలోగా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి లబ్దిదారుల్ని ఎంపిక చేస్తారు. గ్రామాల్లో రోజుకు ఐదు ఇళ్లు, పట్టణాల్లో రోజుకు పది ఇళ్లను మాత్రమే సర్వే చేస్తారు. ఎంపిక పూర్తయ్యాక లబ్దిదారుల ముసాయిదా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచుతారు. సామాజిక తనిఖీ కోసం ఐదు రోజుల గడువు ఇస్తారు. ఆయా గ్రామ, వార్డు పరిధిలోని ప్రజలు ఆ జాబితాలను పరిశీలించి
అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను సూచిస్తారు. సామాజిక తనిఖీలోని అంశాల వాస్తవికత ఆధారంగా లబ్దిదారుల తుది జాబితాలను రూపొందించి గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందుతారు. గ్రామ సభలను ఎంపీడీవోలు, వార్డు సభలను మున్సిపల్ కమిషనర్లు నిర్వహిస్తారు. వీటిలో ఆమోదించిన తుది జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శిస్తారు. ఆయా పథకాలకు కొత్త కార్డుల జారీ ప్రక్రియను డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి నేడో, రేపో మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ కానున్నాయి.
బియ్యం, పెన్షన్ కార్డులు పొందేందుకు అర్హతలు
– బియ్యం కార్డు, పెన్షన్ కార్డు పొందగోరే గ్రామీణులైతే నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో వారైతే నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారంతా అర్హులు
– కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి, 10 ఎకరాల్లోపు మెట్ట భూమి.. లేదా మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు
– నెలకు 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు, పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులు లేదా అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో భవనం ఉన్నవారు కూడా అర్హులే.
– ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు (పారిశుద్ధ్య కార్మికులు మినహా) అనర్హులు.
– నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, అటో, ట్రాక్టర్ మినహాయింపు) గలవారు అనర్హులు. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు.
జగనన్న విద్యాదీవెన.. వసతి దీవెన
– జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు ఇచ్చేందుకు విడివిడిగా కార్డులను జారీ చేయనున్నారు.
– వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల్లోపు గల కుటుంబాలు అర్హులు.
– 10 ఎకరాల్లోపు మాగాణి, 25 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా మాగాణి, మెట్ట కలిసి 25 ఎకరాల్లోపు ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో 1,500లోపు చదరపు అడుగుల సొంత భవనం ఉన్నవారూ అర్హులే
– ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు) అనర్హులు
– నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, అటో, ట్రాక్టర్ మినహాయింపు) ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు
డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద రూ.2,400 కోట్లు
డ్వాక్రా అక్క, చెల్లెమ్మలకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు వైఎస్సార్ నవశకం సున్నా వడ్డీ కింద రూ.2,400 కోట్లను చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మొత్తంలో రూ.1,200 కోట్లను డిసెంబర్ నెలలో వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్సార్ కాపు నేస్తం
వైఎస్సార్ నవశకం కాపు నేస్తం కింద 45 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు కాపు మహిళల జీవనోపాధి కోసం ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చేందుకు విధి, విధానాలను ఖరారు చేశారు.
– గ్రామాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణాల్లో నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు
– కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి, 10 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు
– పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులు, అంత కన్నా తక్కువ విస్తీర్ణంలో భవనం ఉన్నవారూ అర్హులే
– ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అనర్హులు
– నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, అటో, ట్రాక్టర్ ఉంటే మినహాయింపు) ఉన్నవారు అనర్హులు.
– ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు.
– రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ.10 వేలు
దారిద్య్ర రేఖకు దిగువన ఉండి సొంత షాపు గల రజకులు, నాయీ బ్రాహ్మణలు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
మరిన్ని పథకాలు
జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్దిదారులను ఇంటింటా సర్వేలో వలంటీర్లు గుర్తిస్తారు. అలాగే ఇమాం, మౌజన్, పాస్టర్, అర్చకులకు గౌరవ వేతనాలను వర్తింప చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు.
అందరికీ ఆరోగ్యశ్రీ
– రాష్ట్రంలో 95 శాతానికి పైగా ప్రజలకు వర్తింపు
– 35 ఎకరాల్లోపు భూమి, ఏడాదికి రూ.ఐదు లక్షల ఆదాయం ఉన్న వారూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. 35 ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి.. కుటుంబంలో ఒక వ్యక్తిగత కారున్న వారికి సైతం పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకించి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులును జారీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అర్హత, మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను వైద్య, ఆర్యోగ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ మార్గదర్శకాల ఆధారంగా ఈ నెల 20 నుంచి 30వ తేదీలోగా గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ పంపించి సర్వే చేయించటం ద్వారా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తారు.
అర్హతలు ఇవీ..
– ప్రభుత్వం కొత్తగా జారీ చేసే బియ్యం కార్డుదారులు
– వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డుదారులు
– జగనన్న విద్య, వసతి దీవెన కార్డుదారులు
– 12 ఎకరాల్లోపు మాగాణి, 35 ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారు
– మాగాణితోపాటు మెట్ట కలిపి 35 ఎకరాల్లోపు భూమి గలవారు
– వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు (రుజువు కోసం వేతన సరి్టఫికెట్)
– రూ.ఐదు లక్షల లోపు, వరకు ఆదాయం గలవారు (రుజువు కోసం ఆదాయపు పన్ను రిటరŠన్స్)
– పట్టణాల్లో 3 వేల లోపు చదరపు అడుగులకు (334 చదరపు గజాలు) ఆస్తి పన్ను కట్టేవారు
– రూ.ఐదు లక్షల లోపు, రూ.ఐదు లక్షల వరకు వార్షిక ఆదాయం గల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైమ్, పారిశుద్ధ్య కార్మికులు, గౌరవ వేతనం పొందే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులందరూ
– కుటుంబానికి వ్యక్తిగతంగా ఒక కారు ఉన్నా అర్హులే
Comments
Please login to add a commentAdd a comment