prajaprasthanam
-
YS Sharmila: ఆ హామీలేవీ నెరవేర్చలేదు
ఖిలా వరంగల్/హనుమకొండ చౌరస్తా: పేదలకు డబుల్బెడ్రూం, ఇంటికో ఉద్యోగం, ఎస్సీలకు మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, ఉచితంగా ఎరువులు, 57 ఏళ్లకే పింఛన్, ముస్లిం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అంటూ సీఎం కేసీఆర్ వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి ప్రజల కోసం పనిచేయండి.. చేసిన తప్పులను సరిదిద్దుకోకుంటే ప్రజలు తరమికొట్టడం ఖాయమని అన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు వరంగల్ నక్కలపెల్లి శివారులో ప్రారంభమైన షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ములుగు రోడ్డు వద్ద హనుమకొండ జిల్లాలోకి ప్రవేశించి హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ వరకు చేరుకుంది. వరంగల్–నెక్కొండ రోడ్డుపై రహమత్‌నగర్ వద్ద షర్మిల విలేకరులతో మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచితవిద్య, ఫీజు రీయింబర్స్మెంట్ ఊసేలేదని, ఆరోగ్యశ్రీ పథకాన్ని కోమాలో పెట్టారని విమర్శించారు. సీఎం కుటుంబంలోని ఐదుగురికి పదవులిచ్చుకోవడమే సంక్షేమ పాలనా అన్ని ఎద్దేవా చేశారు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 65 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన బీఆర్ఎస్ రెండోసారి పగ్గాలు చేపట్టాక 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలను పక్కనబెట్టి నిరుద్యోగం లేదని బుకాయిస్తోందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే యువకుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. -
‘వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైనది’
సాక్షి, వనపర్తి: మహానేత వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు వైఎస్ విజయమ్మ. తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లాలోని కొత్తకోట బస్టాండ్ వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైఎస్ విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. ‘‘వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతం వైఎస్సార్. వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే అంటూ అక్కడి కార్యక్రమానికి హాజరైన ప్రజలను, వైఎస్సార్టీపీ నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ధన్యవాదాలు తెలియజేశారు. బంగారు తెలంగాణ కోసమే షర్మిల అడుగులు వేస్తోందని, అందుకు తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదం కావాలని ఆకాక్షించారు వైఎస్ విజయమ్మ. ఇదిలా ఉంటే.. 148 రోజుల్లో 2వేల కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పూర్తి చేసుకున్నారు వైఎస్ షర్మిల. వనపర్తి జిల్లాలో షర్మిల పాదయాత్ర మైలురాయి దాటగా.. కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఇదీ చదవండి: తెలంగాణలో వెస్ట్ బెంగాల్ వ్యూహమా? -
YSR: గుర్తుందా నాటి విజయ గాథ
ఇచ్ఛాపురం: సమర్థత కలిగిన ఓ నాయకుడు పరిపూర్ణ మహానాయకుడిగా రూపాంతరం చెందిన రోజులవి. అప్పటి అధికార పక్షాన్ని దునుమాడుతూ స్వరంలో భాస్వరాన్ని మండించిన కాలమది. ఊరి మధ్య నిలబడి ధిక్కార పతాకాన్ని ధైర్యంగా ఎగరేసిన నేతను జనాలకు చూపిన సమయమది. ఇప్పటికి పంతొమ్మిదేళ్ల కిందట అంటే 2003లో.. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర పుటలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఆయన చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర సరిగ్గా జూన్ 15వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసింది. పాదయాత్ర ముగిశాక ఆయన ప్రస్థానం చరిత్ర చెప్పుకునేలా సాగింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించడానికి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9 తేదీ రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టారు. తన పాదయాత్రలో ప్రజలను కలిసి వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన విజయ స్థూపం మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యారు. అయినా ఆ యజ్ఞాన్ని ఆపలేదు. ఇలా సుమారు 68 రోజుల పాటు 11 జిల్లాలు 56 నియోజక వర్గాల గుండా 1470 కిలోమీటర్ల దూరం అలుపెరుగకుండా నడిచి జూన్ 15 తేదీన ఇచ్ఛాపురం పట్టణంలో ప్రజాప్రస్థాన పాదయాత్రకు ముగింపు పలికారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రజాప్రస్థాన విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఇక్కడ పర్యాటకంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
టీఆర్ఎస్ అంటే తాగుబోతుల పార్టీ: షర్మిల
వైరా: టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తాగుబోతులు, రేపిస్టుల సమితి అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షరి్మల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 88వ రోజు బుధవారం ఖమ్మం జిల్లా వైరా మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా మండలంలోని గరికపాడులో స్థానికులతో ‘మాట ముచ్చట’కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షరి్మల మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గమంటూ లేదన్నారు. చదువు, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ ఉచితమని ఎన్నికల వేళ ప్రకటించిన ఆయన, ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. పనుల కోసం పోతే మహిళల మానప్రాణాలు అడుగుతున్నారని, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని విమర్శించారు. నిస్వార్థంగా, ప్రజాసమస్యలపై పోరాడేందుకు తాను పార్టీ పెట్టినట్లు షరి్మల వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే దివంగత వైఎస్సార్ మాదిరిగా సంక్షేమ పాలన తీసుకొస్తానని ప్రకటించారు. ‘మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీతోనే వస్తారా’అని స్థానికులు ప్రశ్నించగా.. ‘మంచివాళ్లు మంచి పారీ్టలోనే ఉంటారు. మీ నాయకుడు టీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన మంచి వాడేనా’అని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్రలో భాగంగా పొలంలో పనిచేస్తున్న రైతులతో మాట్లాడిన షరి్మల కాసేపు ట్రాక్టర్ నడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధులు పిట్టా రాంరెడ్డి, సత్యవతి, సంజీవ, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ పాదయాత్రతోనే సంక్షేమ పాలన
⇒ ప్రజాప్రస్థానం 12వ వార్షికోత్సవంలో వైఎస్ జగన్ ⇒ పిల్లల చదువు, వైద్య చికిత్స..పేదలు అప్పుల్లో కూరుకుపోయేవిగా వైఎస్ గుర్తించారు ⇒ ఈ సమస్యలను వారికి లేకుండా చేసేందుకే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు ⇒ ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఆయనదే ⇒ చంద్రబాబు తొమ్మిదేళ్లలో 17 లక్షల పింఛన్లు ఇస్తే.. వైఎస్ 78 లక్షల పింఛన్లు ఇచ్చారు ⇒ మళ్లీ వైఎస్సార్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. ⇒ ఆ పరిపాలన ఇచ్చే దిశగా కలసి కృషిచేద్దాం పార్టీ శ్రేణులకు జగన్మోహన్రెడ్డి పిలుపు సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం వల్లనే ఆ తరువాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక దేశంలోనే ఎవరూ చూడని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ పాలనను అందించారని, ఇప్పటికీ ఆయన పాలన మనందరికీ స్ఫూర్తిగా నిలిచిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదవాడు అప్పుల్లో కూరుకుపోయేది ప్రధానంగా తన పిల్లల చదువులకయ్యే ఖర్చుకోసం, రెండోది ఆరోగ్యం ప్రమాదకరంగా దెబ్బతిన్నప్పుడు చికిత్సకయ్యే ఖర్చుకోసం అనే విషయాలను వైఎస్ గుర్తించారని, ఈ రెండు సమస్యలను ప్రజలకు లేకుండా చేసేందుకే ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టారని జగన్ చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో 1,475 కిలోమీటర్ల మేరకు 11 జిల్లాల్లో పాదయాత్ర చేసి సరిగ్గా 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏడాదికి పేదలకోసం రెండు లక్షల ఇళ్లు నిర్మించడమే గగనమైందని, కానీ వైఎస్ ఏటా పది లక్షల ఇళ్లను నిర్మించారని జగన్ తెలిపారు. మొత్తం ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్‌దేనన్నారు. చంద్రబాబు 17 లక్షల పింఛన్లు ఇస్తే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక 78 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు చేపట్టారు కనుకనే వైఎస్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. మళ్లీ వైఎస్సార్ పాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆ పరిపాలన ఇచ్చే దిశగా అంతా కలసి కృషి చేద్దామని జగన్ అన్నారు. వైఎస్ పాదయాత్ర చరిత్రాత్మకం... దివంగత వైఎస్సార్ 12 ఏళ్ల కిందట చేసిన పాదయాత్ర చరిత్రాత్మకమైందని, మలమల మాడే ఎండల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆయన ఈ సుదీర్ఘమైన యాత్ర చేశారని జగన్ అన్నారు. భయంగొలిపే ఎండల్లో వైఎస్ పాదయాత్ర చేసిన ఫలితంగా ఆయనకు వడదెబ్బ సోకి వారం రోజులపాటు అనారోగ్యానికి గురయ్యారని, ఆ సమయంలో తాను కూడా రాజమండ్రికి వెళ్లి చూశానని జగన్ తన తండ్రి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. ‘‘ఆ రోజుల్లో చంద్రబాబు సర్కారు యూజర్ చార్జీల దగ్గరి నుంచి కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీల వంటివన్నీ పెంచేసి ప్రజలను వరుసగా బాదేస్తూ ఉండేది. ప్రజలపై భారం మోపడానికే ఈ సర్కారు ఉన్నదా! అనేలా బాబు పాలిస్తూ ఉండేవారు. చార్జీల వాతలిలా ఉంటే మరోవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులుండేవి. ఒక హెచ్‌పీ విద్యుత్‌కు అప్పటిదాకా ఉన్న చార్జీని రూ.50 నుంచి 665 రూపాయలకు చంద్రబాబు అప్పట్లో పెంచేశారు’’ అని ఆయన గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ హామీ ఇస్తే... ‘అపుడు కరెంటు తీగలు బట్టలారేసుకోవడానికే పనికి వస్తాయి...’ అని చంద్రబాబు అవ హేళన చేశారన్నారు. ప్రజలు పడుతున్న బాధల్లో వారికి తోడుగా నిలబడి.. మీకు అండగా ఉండటానికి మేమొస్తున్నామని వైఎస్ ఒక భరోసాను పాదయాత్రలో ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ వైద్య విభాగం నేత గోసుల శివభరత్‌రెడ్డి, హిందూపురం లోక్‌సభా నియోజకవర్గం వైసీపీ నేత డి.శ్రీధర్ , తెలంగాణకు చెందిన నేత సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.