టూరిజం పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైఎస్సార్(ఫైల్)
ఇచ్ఛాపురం: సమర్థత కలిగిన ఓ నాయకుడు పరిపూర్ణ మహానాయకుడిగా రూపాంతరం చెందిన రోజులవి. అప్పటి అధికార పక్షాన్ని దునుమాడుతూ స్వరంలో భాస్వరాన్ని మండించిన కాలమది. ఊరి మధ్య నిలబడి ధిక్కార పతాకాన్ని ధైర్యంగా ఎగరేసిన నేతను జనాలకు చూపిన సమయమది. ఇప్పటికి పంతొమ్మిదేళ్ల కిందట అంటే 2003లో.. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర పుటలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది.
మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఆయన చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర సరిగ్గా జూన్ 15వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసింది. పాదయాత్ర ముగిశాక ఆయన ప్రస్థానం చరిత్ర చెప్పుకునేలా సాగింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించడానికి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9 తేదీ రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టారు. తన పాదయాత్రలో ప్రజలను కలిసి వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు.
వైఎస్సార్ ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన విజయ స్థూపం
మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యారు. అయినా ఆ యజ్ఞాన్ని ఆపలేదు. ఇలా సుమారు 68 రోజుల పాటు 11 జిల్లాలు 56 నియోజక వర్గాల గుండా 1470 కిలోమీటర్ల దూరం అలుపెరుగకుండా నడిచి జూన్ 15 తేదీన ఇచ్ఛాపురం పట్టణంలో ప్రజాప్రస్థాన పాదయాత్రకు ముగింపు పలికారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రజాప్రస్థాన విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఇక్కడ పర్యాటకంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment