బదిలీపై వెళ్లిపోతున్న అధికారులు
కూటమి నేతల ఆధిపత్య పోరే కారణం
ఎంపీడీఓ, డీఈ, ఏపీఎం, కార్యదర్శుల పోస్టులు ఖాళీ
ఇచ్ఛాపురం రూరల్: జిల్లా శివారు మండలమైన ఇచ్ఛాపురంలో పని చేసేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఇక్కడ పనిచేయడం కత్తిమీద సాములా మారిందని భయపడుతున్నారు. ధైర్యం చేసి వచ్చిన అధికారులు కూడా నెల తిరిగే లోపే ఏదో ఒక వంకతో ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఎన్నికల విధుల నిర్వర్తించడానికి వచ్చిన ఎంపీడీఓ వై.వి.ప్రసాదరావు ఎన్నికల తర్వాత కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకున్నారు. తర్వాత వచ్చిన ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు తొలుత కొనసాగుదామనే వచ్చారు. అయితే స్థానిక కూటమి నేతల ఒత్తిడి తట్టుకోలేక వారం రోజుల్లోనే రణస్థలం మండలానికి వెళ్లిపోయారు. దీంతో నెల రోజుల నుంచి ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉంది.
⇒ ఈఓపీఆర్‌డీగా పనిచేసిన సత్యనారాయణ వారం కిందట అరకు వెళ్లిపోయారు. 20 రోజుల క్రితం సెర్ప్ ఏపీఎంగా విధులు నిర్వహించిన సనపల ప్రసాదరావు కంచిలి మండలానికి వెళ్లిపోగా, ఇంత వరకు ఆ పోస్టులో చేర్పించేందుకు డీఆర్‌డీఏ అధికారులు ఎంత ప్రయత్నం చేసినా.. ఇచ్ఛాపురం వచ్చేందుకు ఏపీఎంలు విముఖత చూపిస్తుండటంతో ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగానే ఉంది.
⇒ ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు సంబంధించి పంచాయతీరాజ్ డీఈగా పనిచేస్తున్న ఏ.సూర్యప్రకాశరావు మూడు నెలలు క్రితం టెక్కలి ఈఈగా డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నిత్యం టెక్కలి పరుగులు తీస్తున్నారు.
⇒ గృహనిర్మాణ శాఖలో కొంత కాలంగా డీఈ పోస్టు ఖాళీగా ఉండగా, ఇక్కడికి వచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇదే శాఖలో జేఈగా పనిచేసిన దిలీప్‌రెడ్డి కంచిలి మండలానికి బదిలీపై వెళ్లిపోగా, ఈ పోస్టులో చేరేందుకు సంబంధిత శాఖకు చెందిన ఉద్యోగులు ఇష్టపడక పోవడంతో కేశుపురం గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథంను ఇన్‌చార్జి ఏఈగా నియమించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
⇒ టి.బరంపురం, మబండపల్లి, తేలుకుంచి, హరిపురం, కేశుపురం, ఈదుపురం, తులసిగాం, కొఠారీ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు బదిలీపై వెళ్లి పోవడంతో ఆ స్థానాల్లో చేరేందుకు ఇతర పంచాయతీ కార్యదర్శులు జంకుతున్నారు.
⇒ వీఆర్వోలది కూడా అదే పరిస్థితి. మండలం, పంచాయతీల్లో ప్రతిపక్షం పార్టీకి చెందిన ఎంపీపీ, జెట్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉండటంతో జీర్ణించుకోలేని కూటమి నేతలు తాము చెప్పినట్లే జరగాలంటూ సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అర్హులైన వారికి సైతం పింఛన్లు తొలగించాలని, గ్రామ స్థాయిలో పనులు జరగాలంటే తాము చెప్పినట్లే జరగాలంటూ ఆదేశాలు జారీ చేస్తుండటం, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌చే సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఇక్కడ పనిచేసేందుకు ఇష్టం లేదని అధికారులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీంతో సంబంధిత ఖాళీ పోస్టుల్లో ఇన్‌చార్జీలే దర్శనమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment