నావికా దళంలో ఉద్యోగం సాధించిన శ్రీనిధి
డిగ్రీ చదువుతూనే ఏడాదిగా నేవీ పరీక్షలకు సన్నద్ధం
పేదరికాన్ని అధిగమించి ఉద్యోగం సాధించిన గొర్రెల కాపరి కుమార్తె
వజ్రపుకొత్తూరు: తండ్రి గొర్రెల కాపరి.. కుటుంబానిది అతి సామాన్య నేపథ్యం.. అయినా ఆమె కల లు కనడం మానలేదు. ఎన్ని అడ్డు గోడలు ఉన్నా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టింది. అన్నింటినీ దాటుకుని 19 ఏళ్ల వయసులోనే నేవీ ఉద్యోగం సాధించింది వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన బందాపు శ్రీనిధి. ఆమె సాధించిన ఈ విజయం స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.
ఇదీ నేపథ్యం..
శ్రీనిధి తండ్రి బందాపు తేజేశ్వరరావు గొర్రెల కాపరి(పెద్ద కోనారి). తల్లి గౌరి గృహిణి. చెల్లి శ్రీజ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదు వుతోంది. శ్రీనిధి మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. ఆమె పెదనాన్న బందాపు గణపతిరావు ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా విధులు నిర్వహించడం చూసి ఆయనను స్ఫూర్తిగా తీసుకుంది. బాబాయ్ బందాపు తిరుమలరావు ప్రోత్సాహంతో నేవీలో కొలువు సాధించాలని కలలు కన్నది.
నేవీ కొలువు అంటే చదువులోనే కాదు శారీరకంగా కూడా చురుగ్గా ఉండాలి. ప్రతి రోజూవెంకటాపురం – పర్లాకిమిడి రహదారిపై పరుగులో సాధన చేసేది. పుష్‌అప్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ఇతర ఎక్స్‌ర్‌సైజ్‌లు చేసేది. ఏదైనా సాధిస్తేనే సమాజంలో గౌరవం అని గమనించి పట్టుదలలో ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందింది. ఇటీవల విడుదలైన ఆలిండియా మెరిట్ జాబితాలో ఎంపికై నవంబరు 11న ఒడిశాలోని చిలకలో శిక్షణ తీసుకోనుంది.
మరో ఉద్యోగానికి చేరువలో...
జూలై 2024లో సీబీటీ పరీక్షలో అర్హత సాధించిన శ్రీనిధి విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్ శాతవాహనలో ఆగస్టు 2024లో జరిగిన ఫిజికల్, మెడికల్ పరీక్షల్లో విజేతగా నిలిచింది. పరీక్షల ఫలితాలు ఈ నెలలో విడుదలై నేవీలో జీడీ (ఎస్‌ఎస్‌ఆర్) ఉద్యోగానికి ఎంపికైంది. మరో పక్క ఏప్రిల్ 30, 2024న విశాఖపట్నంలోనే జరిగిన ఉమెన్ మిటరీ పోలీస్ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ ఉద్యోగానికి కూడా చేరువైంది.
నా కాళ్లపై నేను నిలబడాలి
నా కాళ్లపై నేను నిలబడాలి. దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో నేవీ ఉద్యోగం సాధించాను. మాది చాలా సాధారణ కుటుంబం. ఏదైనా సాధిస్తేనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అలాగే ఒకే చోట ఉండిపోకూడదు. లక్ష్యం ఏర్పాటు చేసు కుని ప్రతి రోజూ సాధన చేయాలి. మా పెదనాన్న భారత సైన్యంలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఆయన నిత్యం ప్రోత్సహించే వారు. మా బాబాయ్ తిరుమల నిత్యం నా వెన్ను తట్టి లక్ష్యం వైపు పయనించేలా సహకరించారు. ఈ విజయం వారికే అంకితం.
– బందాపు శ్రీనిధి
Comments
Please login to add a commentAdd a comment