వసప బిర్యానీకి జనం ఫిదా
ఒడిశా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రాక
గ్రామంలో 8 బిర్యానీ పాయింట్లు
రోజుకు వందల్లో బిర్యానీ ప్యాకెట్ల విక్రయం
ఆ వంశధార తీరానికి చేరుతూనే బిర్యానీ సువాసన స్వాగతమంటూ పిలుస్తుంది. ఊరి పొలిమేరలోనే ఆ వాసనకు కడుపులో జఠరాగ్ని రాజుకుంటుంది. ఒక్కో వీధి దాటుకుంటూ వెళ్తుంటే ఆకలి అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. ఎర్రగా కారం పట్టిన మాంసం ముక్కను మధ్యలో దాచుకున్న ఓ బిర్యానీ ముద్ద నాలిక కొసన తగలగానే కడుపు, మనసు రెండూ ఆనందాన్ని ప్రకటించేస్తాయి. వసప బిర్యానీ చేసే మాయ ఇది. 200 గడపలుండే ఈ చిన్న ఊరు బిర్యానీకి పెట్టింది పేరు.
కొత్తూరు: కొత్తూరు నుంచి నివగాం వెళ్లే పాలకొండ–హడ్డుబంగి రోడ్డుకు ఆనుకుని ఉండే చిన్న గ్రామం పేరే వసప. కొత్తూరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. ఊరు చిన్నదే అయినా నిత్యం ఒడిశా రాష్ట్రంలోని గుణుపూర్, హడ్డుబంగి, కాశీనగర్, పర్లాఖిమిడితో పాటు ఉమ్మడి జిల్లాలోని కొత్తూరు, పాతపట్నం, పలాస, పాలకొండ, సీతంపేట, హిరమండలం, భామినితో పాటు జిల్లా కేంద్రం శ్రీకాకుళం వాసులు కూడా నిత్యం ఇక్కడకు వస్తుంటారు.
ఇక్కడి బిర్యానీ రుచి అలాంటిది మరి. శ్రీకాకుళానికి వీఐపీలు ఎవరు వచ్చినా ఇక్కడి నుంచి పొట్లాలు పట్టుకెళ్లాల్సిందే. నాణ్యమైన బియ్యం, మసాలా ది నుసుల వాడకమే ఇక్కడి రుచికి కారణమని తయారీ దారులు చెబుతుంటారు. వసప గ్రామంలో మొదటి సారిగా బిర్యానీ పెట్టిన కొయిలాపు వెంకటరావు దగ్గర రుచి భలేగా ఉంటుందని తిన్నవారు చెబుతుంటారు. ఆ రోడ్డుపక్కగా వెళ్తూ బిర్యానీ కొనని వారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉదయం 10 గంటలు నుంచి రాత్రి వరకు అక్కడ బిర్యానీ ఘుమఘుమలాడుతూనే ఉంటుంది. కార్తీకం వచ్చిదంటే చాలు ఇక్కడ ఖాళీ ఉండదు. శుభకార్యాల భోజనాలు, యువకులు పార్టీల కోసం వసపనే ఆశ్రయిస్తారు. అక్కడ మొత్తం 8 బిర్యానీ పాయింట్లు ఉన్నాయిప్పుడు.
హైదరాబాద్‌లో నేర్చుకున్నా..
దమ్ బిర్యానీ కోసం ముందుగా వేడి చేసిన నీటిలో బియ్యం ఎసరు పెడతాను. మసాలా దినుసులు మంచి కంపెనీలవి తీసుకుంటాను. నాణ్యమైన బియ్యం కొనుగోలు చేస్తాను. వీటితో నా శైలిలో దమ్ బిర్యానీ తయారు చేస్తాను. నేనూ హైదరాబాద్‌లోనే ఈ విద్య నేర్చుకున్నాను. – కొయిలాపు వెంకటరావు
రుచి అమోఘం
వసప బిర్యానీ చాలా బాగుంటుంది. ఒడిశా నుంచి వచ్చి కొంటూ ఉంటాను. వెంకటరావు దగ్గర బిర్యానీ మరింత రుచికరంగా ఉంటుంది.
– పి.రవి, హడ్డుబంగి, ఒడిశా
Comments
Please login to add a commentAdd a comment