‘బాండ్ల’తో బకాయిల చెల్లింపు! | Arrears with bonds | Sakshi
Sakshi News home page

‘బాండ్ల’తో బకాయిల చెల్లింపు!

Published Sat, Oct 29 2016 3:08 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

‘బాండ్ల’తో బకాయిల చెల్లింపు! - Sakshi

‘బాండ్ల’తో బకాయిల చెల్లింపు!

- ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీలకు నిధులపై ప్రభుత్వం దృష్టి
- పెరిగిన ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితితో వెసులుబాటు
- మార్కెట్లో బాండ్ల వేలానికి ప్రణాళిక సిద్ధం
- రూ.4 వేల కోట్లకుపైగా బడ్జెట్‌కు కోత!
- శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సర్కారు
 
 సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ సహా వివిధ పథకాల కింద బకాయిల చెల్లింపు కోసం బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమీకరించనుంది. కేంద్రం రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) రుణ పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన రుణ పరిమితి మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ.3,122 కోట్ల అదనపు రుణాలు తెచ్చుకునే వెసులుబాటు లభించింది. ఇలా తీసుకునే అదనపు రుణాలను కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్ర వాటా సమకూర్చేందుకు వినియోగించాలని కేంద్రం సూచించింది. కానీ తక్షణ అవసరాల దృష్ట్యా అదనపు రుణంతో బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నెల రోజుల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ పథకాల బకాయిలు చెల్లించాలని ఇటీవలి కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

ఇదే సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అమల్లోకి రావడం ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దాదాపు రూ.2,000 కోట్లు బకాయిలున్నాయి. రుణమాఫీ మూడో విడత బకాయిలు రూ.2,020 కోట్లు, ఇన్‌పుట్ సబ్సిడీ రూ.720 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.5,140 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటితో పాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ విభాగాల్లో దాదాపు రెండు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక తక్షణ ప్రాధాన్యమైన ధాన్యం కొనుగోళ్ల కోసం సైతం ఆర్థిక శాఖ ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే బకాయిలకు నిధులు సర్దుబాటు చేసేందుకు నవంబర్‌లో ఆర్‌బీఐ ద్వారా బాండ్లను వేలం వేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. శుక్రవారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ రాజీవ్‌శర్మ సమక్షంలో ఆర్థికశాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిం చినట్లు తెలిసింది. ఇప్పటికే మార్కెట్లో బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.9,900 కోట్లు సమీకరిం చింది. వచ్చే రెండు నెలల్లో మరో రూ.2,600 కోట్లు సమకూర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
 
 బడ్జెట్‌కు కోత
 ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యాలు, పెరిగిన ఖర్చుల దృష్ట్యా 2016-17 బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లకు పైగా కోత వేయాలని ఆర్థిక శాఖ లెక్కలేసుకుంటోంది. ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్‌మిట్టల్ దీనిపై కసరత్తు ప్రారంభించారు. శాఖలవారీగా వాస్తవ ఆదాయ వ్యయాలు, బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు పెట్టిందెంత, రాబోయే ఐదు నెలలకు ఎంత ఖర్చు పెట్టే అవకాశముందనే లెక్కలు తీస్తోంది. స్పెషల్ సీఎస్‌లకు మూడు నాలుగు శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించి... రాబోయే ఐదు నెలల్లో ఎంత ఖర్చు చేయగలిగే వీలుంది, బడ్జెట్ కేటాయింపుల్లో ఎంత మిగులు సాధించే వీలుందనే అంశాలపై అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మొత్తం 1.3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రకటించింది. అందులో మొదటి ఏడు నెలల్లో అంటే అక్టోబర్ నెలాఖరు వరకు దాదాపు రూ.52 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ లెక్కన మిగతా ఐదు నెలల్లో రూ.78 వేల కోట్లు ఖర్చు చేయడం సాధ్యం కాదని, బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యతలు గుర్తించాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సూచించింది. మొత్తంగా కనీసం రూ.4,000 కోట్లకు తగ్గకుండా బడ్జెట్‌లో కోత పెట్టే దిశగా కసరత్తు సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement