దివంగత మహానేత వైఎస్‌ఆర్‌తో వైఎస్ పురుషోత్తమరెడ్డి (ఫైల్)
వైఎస్‌ఆర్ జిల్లా, పులివెందుల : పులివెందుల ప్రజలు ఆప్యాయంగా కంటి చూపు ప్రదాత అని పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి(89) బుధవారం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం కడపలోని తన కుమారుడు విలియమ్స్ సత్యానందరెడ్డి ఇంటికి వెళ్లిన ఆయనకు బుధవారం ఉదయం 6.30గంటల ప్రాంతంలో గుండెపోటు రాగా.. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అక్కడి నుంచి ఆయన భౌతిక కాయాన్ని కుమారుని ఇంటిలో అక్కడి బంధువుల సందర్శనార్థం ఉంచి అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలోని ఆయన నివాసం ఉండే గృహానికి తరలించారు. వైఎస్ కుటుంబంలో వైఎస్ రాజారెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిల మరణం తర్వాత కుటుంబ పెద్దగా ఉంటూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వైఎస్ పురుషోత్తమరెడ్డి దివంగత వైఎస్ రాజారెడ్డికి స్వయాన సోదరుడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు చిన్నాన్న. ఆయన మరణంతో వైఎస్ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం
డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి 1929 డిసెంబర్ 19న సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో వైఎస్ వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు మూడో కుమారునిగా జన్మించారు. ఎలిమెంటరీ విద్యను బలపనూరులో.. హైస్కూలు విద్యను పులివెందులలో, ఇంటర్ అనంతపురం, ఎంబీబీఎస్ ఆంధ్రా యూనివర్సిటీలో, డీఓఎంఎస్ (ఓపీహెచ్) విశాఖపట్టణం, గుంటూరు మెడికల్ కళాశాలల్లో విద్యనభ్యసించారు. 1958లో డాక్టర్ ఫ్లావియతో ఆయనకు వివాహమైంది. ఆయనకు నలుగురు కుమారులు. వారిలో స్టాన్‌లీ సత్యానందరెడ్డి, మైఖేల్ సత్యానందరెడ్డిలు ఇంజినీర్లుగా అమెరికాలో స్థిరపడగా.. విలియమ్స్ సత్యానందరెడ్డి కడపలో, థామస్ సత్యానందరెడ్డి తాడిపత్రిలో వైద్యులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
డాక్టర్‌గా వైద్యసేవలు
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి వైద్యునిగా విశేష సేవలందించారు. 1956 నుంచి 22ఏళ్లుగా ఒంగోలు, జమ్మలమడుగు, కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని చర్చిల ఆసుపత్రుల్లో వైద్యునిగా ప్రజలకు ఉత్తమ సేవలందించారు. పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రితో ఆయనకు విడదీయరాని సంబంధం ఉంది. దాదాపు 36ఏళ్లుగా వైఎస్‌రాజారెడ్డి ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్‌గా, ఐ స్పెషలిస్ట్‌గా తాను మరణించేవరకు జీతం లేకుండా ప్రజలకు సేవలందించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు, సిబ్బందితో ఆత్మీయంగా ఉంటూ వైద్యంలోని మెలకువలను నేర్పించేవారు. రాజారెడ్డి ఆసుపత్రిలో రోటరీ క్లబ్, ప్రభుత్వ అంధ త్వ నివారణ సంస్థ సహకారంతో 70వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి వారికి చూపు ప్రసాదించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన మరణంతో ఆసుపత్రి సిబ్బంది తాము పెద్ద దిక్కును కోల్పోయామని బోరున విలపించారు.
ఎమ్మెల్యేగా సేవలు
వైఎస్ పురుషోత్తమరెడ్డి డాక్టర్‌గానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా పులివెందుల ప్రాంత ప్రజలకు సేవలందించారు. 1991లో అప్పటి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ వివేకానందరెడ్డి అనివార్య కారణా లవల్ల రాజీనామా చేయడంతో పులివెందులలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో పురుషోత్తమరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలస్వామిరెడ్డిపై 97వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పులివెందుల రాజకీయ చరిత్రలో ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన సాధారణ జీవితాన్నే గడిపారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల నుంచి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ రిజర్వాయర్ నిర్మాణంలోనూ, నియోజకవర్గంలోని 177 గ్రామాలకు మంచినీటి వసతి, పులివెందులలో మొట్టమొదటిసారిగా బైపాస్ రోడ్డు నిర్మాణం, టీటీడీ కల్యాణ మండపం ఏర్పాటు, బాలికల జూనియర్ కళాశాల, నియోజకవర్గంలోని ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఆయన హయాంలో జరిగాయి. పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఐఎంఏ ప్రెసిడెంట్‌గా, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, ఆసుపత్రి అసోసియేషన్ కడప బ్రాంచ్ ప్రెసిడెంట్‌గా, పులివెందుల సీఎస్‌ఐ చర్చి ట్రెజరర్‌గా, జీజీఆర్, జీజెడ్‌ఆర్‌ఐ క్యాంప్స్ చైర్మన్‌గా సేవలందించారు. ఆయన డాక్టర్‌గా చేస్తున్న సేవలకు ది ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్ గ్రోత్ సొసైటీ, న్యూఢిల్లీ వారు 1999లో ‘నేషనల్ మెడికల్ ఎక్స్‌లెన్సీ అవార్డు’లో ఆయన పేరును చేర్చారు.
నివాళులర్పించిన వైఎస్ కుటుంబీకులు
వైఎస్ పురుషోత్తమరెడ్డి మరణవార్త తెలుసుకున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి, మున్సి పల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నేత్రదానం
నేత్ర వైద్యుడిగా అమూల్యమైన సేవలు అందించి వేలాది మందికి కంటి చూపును ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన మరణం తర్వాత కూడా మరో ఇద్దరికి చూపును ప్రసాదిం చారు. బుధవారం ఆయన కార్నియాలను కుమారులు స్టాన్‌లీ, మైఖేల్, విలియమ్స్, థామస్ అంగీకారంతో పురుషోత్తమరెడ్డి మనుమరాలు డాక్టర్‌వింధ్య సేకరించి స్నేహ సేవా సమితి సభ్యులు రాజు, మధుసూదన్‌రెడ్డిలకు అందజేశారు.
రేపు అంత్యక్రియలు
వైఎస్ పురుషోత్తమరెడ్డి భౌతిక కాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు థామస్ సత్యానందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 8గంటలకు స్థానిక సీఎస్‌ఐ చర్చి ఆవరణలో ఆయన భౌతిక కాయం ఉంచి అక్కడ బిషప్‌లు, పాస్టర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ ఫ్యామిలీ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment