సాక్షి, గుంటూరు :దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడంతోపాటు రాష్ట్రానికి సుపరిపాలన అందించే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు. రాజన్న మరణం తరువాత ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూసి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని, ఆయన చుట్టూ సైన్యంలా ఏర్పడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తండ్రిలాగే క్రమశిక్షణతో, ధైర్యంతో కష్టపడి పనిచేసే జగన్ గుండెనిబ్బరాన్ని చూసి స్ఫూర్తి పొంది రాజకీయాల్లోకి అడుగుపెట్టానని తెలిపారు. ఆయన నాయకత్వంలో ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో గురువారం నరసరావుపేట పట్టణంలో జరిగే జగన్ జనభేరి సభలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని చెప్పారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన తన మన
సులోని ఆలోచనలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే....
సాక్షి: రాష్ట్రంలో గొప్ప పారిశ్రామికవేత్తగా పేరొందిన మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఇందులో మీరు ఇమడగలరా?
అయోధ్య: వ్యాపారాలన్నింటినీ వదిలివేసి బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను. జగన్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు. రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ మందికి సేవ చేయవచ్చని మా నాన్న దశరథరామిరెడ్డి చెప్పిన మాటలు గుర్తొచ్చి రాజకీయాల్లోకి వచ్చాను.
సాక్షి: విలువలు గల, పాజిటివ్ రాజకీయాలు చేస్తామని చెబుతున్నారు? ఎలా చేస్తారు?
అయోధ్య: ఒక క్లారిటితో రాజకీయాల్లోకి వచ్చాను. నేను, నా కుటుంబం వంశపారంపర్యంగా రాజకీయాల్లో ఉండాలనే ఆశ లేదు. అతి తక్కువ సమయంలో అనుకున్నది చేసి చూపాలనేది నా ఉద్దేశం. నా ప్రణాళికను త్వరలో అందరికీ వివరిస్తాను. నేను, మా పార్టీ ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తామో చెబుతానే తప్ప ఇతరులపై అనవసరమైన విమర్శలు చేయను.
సాక్షి: నరసరావుపేట పార్లమెంటుపరిధిలోని పల్నాడు, వినుకొండ ప్రాంతంలో ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. వారికోసం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు కాకుండా
మీ సొంత ప్రణాళికతో ఏం చేయాలనుకుంటున్నారు?
అయోధ్య: ఇక్కడి ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి వచ్చే ఐదేళ్ళల్లో వార్షిక ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తా. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసి పాల ఉత్పత్తి పెంచే ఏర్పాటు చేస్తా. మహిళలు సొంత గ్రామాల్లో పనిచేస్తూ ఆదాయం ఎలా పొందాలనే అంశంపై ప్రణాళిక రూపొందిస్తా. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని నా సొంత ఇల్లులా భావించి అభివృద్ధి చేస్తాను.
సాక్షి: వ్యాపారానికి, రాజకీయాలు పూర్తిగా విరుద్ధం కదా? వ్యాపారంలో విజయం సాధించిన మీరు రాజకీయాల్లో సక్సెస్ అవుతానని భావిస్తున్నారా?
అయోధ్య: రాజకీయాలు మా కుటుంబానికి కొత్త కాదు. చిన్నతనం నుంచే మా నాన్న సంక్షేమం విషయంలో పేదలకు దగ్గరయ్యేలా చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను అరక దున్నాను. పాలు పితికాను. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులుంటాయో నాకు తెలుసు. ఆళ్ళ ద శరథరామిరెడ్డి(ఏడిబి) ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తా. రాజకీయాల్లో కష్టాలు, నష్టాలు ఉంటాయి. అయితే మా అమ్మ నాకు ఓపిక, త్యాగం రెండు బలంగా నేర్పింది. వ్యాపారంలో ఏ విధంగా సక్సెస్ అయ్యానో అంతకంటే రాజకీయాల్లో మరింత సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది.
సాక్షి : వైఎస్సార్‌తో పాటు జగన్‌ను మీరు దగ్గరగా చూశారు. వీరిద్దరి మధ్య ఎలాంటి తేడా ఉంది?
అయోధ్య: వైఎస్సార్ ఆలోచనలు ఎంతో గొప్పగా ముందుచూపుతో ఉంటాయి. అవి ఎప్పుడూ రైతు, బడుగు, బలహీనవర్గాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఆయన్ను చూస్తే ధైర్యంగా ఎలా ఉండాలి, పెద్ద ఆలోచన ఎలా చేయాలి, అవసరానికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలనేది తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నేనున్నానంటూ ఆయనిచ్చే భరోసా నాకెంతో నచ్చింది. జగన్‌లో తండ్రికి తగ్గ తనయుడిలా ఆయన కంటే ఎక్కువ ధైర్యం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉన్నాయి. ఇలాంటి తెగువ, ధైర్యం ఉన్న నాయకుడిని నేనెక్కడా చూడలేదు. అనుక్షణం ప్రజల్లో ఉంటూ వారి కష్టాలను తెలుసుకుని స్పందించే హృదయం ఉన్న నాయకుడు జగన్.
సాక్షి: కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. మీరు కార్యకర్తలకు ఎలాంటి ధైర్యాన్ని, భరోసాను ఇస్తారు?
అయోధ్య: ఆ పార్టీలన్నీ కుమ్మక్కై జగన్‌ను టార్గెట్ చేసినప్పటికీ ప్రజలంతా జగన్‌వైపే ఉన్నారు. కార్యకర్తలకు పూర్తిగా అండగా నిలుస్తాను. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, దాని ద్వారా అన్ని విధాల కార్యకర్తలను ఆదుకుంటా. పోలీసు, రెవెన్యూ కేసులు పెట్టి కార్యకర్తలను వేధిస్తున్నారు. పూర్తిగా వీటిని అడ్డుకొని అండగా నిలుస్తా. ప్రమాదవశాత్తు గాయపడిన, మరణించిన కార్యకర్తల కుటుంబాలను, వారి పిల్లలను ఆదుకుంటా.
సుపరిపాలన జగన్‌కే సాధ్యం
Published Thu, Mar 6 2014 2:28 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement