- రైతుల కోసం 'వైఎస్‌ఆర్ భరోసా' పథకం
- అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ. 50వేలు
- ఏటా 12వేల500 చొప్పున అందజేత
గుంటూరు: ఆరుగాలం శ్రమించి అనేక కష్టనష్టాలకోర్చి అందరి ఆకలి తీరుస్తున్న అన్నదాతను ఆదుకునేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీ వేదికగా అద్భుతమైన పథకాన్ని ప్రకటించారు. ఐదెకరాల్లోపు చిన్న, సన్నకారు రైతులందరికీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 50వేలు ఇస్తామని ఆయన వెల్లడించారు. ఆత్యహత్య చేసుకునే దుర్భర పరిస్థితుల నుంచి రైతులను బయటపడేసేందుకు 'వైఎస్‌ఆర్ భరోసా' పథకాన్ని ఆయన ప్రకటించారు. పార్టీ శ్రేణులు గ్రామగ్రామానికి, ఊరూరికి వెళ్లి అన్న వస్తున్నాడు అంటూ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
'ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 50వేలు ఇస్తాం. ఏటా రూ. 12,500 చొప్పున నాలుగు దఫాలుగా ఈ మొత్తాన్ని నేరుగా రైతుల చేతికే ఇస్తాం. మే నెలలో రైతులు వ్యవసాయ సన్నద్ధమయ్యే సమయానికి అందజేస్తాం. బ్యాంకులు తమ బకాయిలకు జమ చేసుకోకుండా నేరుగా రైతులకే అందిస్తాం' అని వైఎస్ జగన్ అన్నారు.
ఈ పథకంతో ప్రతి రైతన్నకు తోడుగా నిలబడతామని, ఈ డబ్బుతో ఏ పంట వేయాలి, ఎలా ఖర్చు చేయాలనేది రైతుల ఇష్టానికే వదిలేస్తామని ఆయన స్పష్టం చేశారు. 'దివంగత నేత వైఎస్‌ఆర్ ఇచ్చిన మాదిరిగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. కుల, మత, వర్గాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ ఈ పథకాన్ని ఇస్తాం. ఈ పథకం కింద రూ. 33వేల కోట్లు ఖర్చు చేస్తాం. 46శాతం కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తాం' అని వైఎస్ జగన్ వివరించారు. చంద్రబాబు రుణమాఫీ పేరిట కేవలం రూ. 11వేల కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు.
అంతేకాకుండా రైతులకు బ్యాంకు రుణాలను జీరో వడ్డీ లేదా పావులా వడ్డీకి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల కోసం రూ. మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని, రూ. 2వేల కోట్లతో కేలామిటీ రిలీఫ్ నిధి (విపత్తు నిర్వహణ నిధి)ని ఏర్పాటుచేస్తామని, అకాల వర్షాలు, వరదలు వంటి ఆపత్కాలంలో రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 'వైఎస్‌ఆర్ రైతు భరోసా' పథకంతో రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, అంతేకాకుండా ఈ పథకంతో గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ వస్తుందని తెలిపారు. ఊరూరికి, గ్రామగ్రామానికి వెళ్లి.. అన్న వస్తున్నాడంటూ ఈ పథకాన్ని చాటింపు వేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.