సడలని వైఎస్సార్ సీపీ దీక్షలు
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దీక్షలు మూడో రోజుకు చేరాయి. సడలని సంకల్పంతో గురువారం నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేశారు. రాజకీయ లబ్ధికోసమే సీఎం కిరణ్, చంద్రబాబునాయుడు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య తీర్మానం చేయకుండా చర్చలతో కాలయాపన చేసి సీమాంధ్ర ప్రజల్ని మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోరిన వైఎస్ విజయమ్మతోపాటు పార్టీ ఎమ్మెల్యేల్ని అరెస్టు చేసిన తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకుడు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) ఆధ్వర్యంలో అనకాపల్లి జోనల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహరదీక్షలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా మందపాటి జానకిరామరాజు (జానీ) ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ధర్నా చేశారు.
యలమంచిలి నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు మూడో రోజూ రిలే దీక్షలు పాటించారు. మళ్ల సంజీవరావు నేతృత్వంలో మునగపాకలో రాస్తారోకో నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
పాయకరావుపేటలో నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకట్రావు ఆధ్వర్యంలో సమైక్యం కోసం పట్టణంలో దీక్షలతో పాటు విజయమ్మ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో చేశారు. సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
చోడవరంలో పార్టీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర రిలే దీక్షలో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు పీవీఎస్‌ఎన్ రాజు పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయం ఎదుట బిఎన్‌రోడ్డుపై కార్యకర్తలు బైఠాయించారు. రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పాడేరు పాత బస్టాండ్ ఆవరణలో నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలోనిరాహార దీక్షలు జరిగాయి. జి.మాడుగులలో వైఎస్‌ఆర్‌సీపీ నేత వెంకటగంగరాజు(బుజ్జి) ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
నర్సీపట్నంలో సమన్వయకర్త ఉమాశంకర్‌గణేష్ ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. సమన్వయకర్తతో పాటు కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.