పామర్రు/చల్లపల్లి/మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలుగు ప్రజల ప్రయోజనాలను, ఆత్మాభిమానాన్ని కాపాడాలని అసెంబ్లీలో కోరడమే నేరంగా భావించి వైఎస్సార్‌సీపీ, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, నేతలను అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా ప్రజాప్రతినిధులందరినీ శాసనసభనుంచి సస్పెండ్‌చేసి ఆపై అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వారు పేర్కొన్నారు.
ఈ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చల్లపల్లి, పామర్రులో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ ఓ ప్రజాస్వామ్య దేశంలో తమ అభీష్టాన్ని తెలిపే హక్కును కాలరాయడం దారుణమన్నారు.
కాంగ్రెస్, టీడీపీలు కలిసి టీ బిల్లును గట్టెక్కించే వ్యూహంలో భాగంగానే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయించి బయటకు పంపారన్నారు. ఇదేమి ప్రజాస్వామ్యమని అసెంబ్లీ బయట మాట్లాడుతున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మను నిరంకుశత్వంగా అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన పామర్రులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కుమ్మక్కు రాజకీయాలతో పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడం అన్యాయమన్నారు.
మైలవరంలో జోగి రమేష్ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలు దేరి వెళ్లి స్థానిక బోసుబొమ్మసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం పదవి కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి తిప్పలు పడుతున్నారని, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నానంటూ సమైక్య ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
చల్లపల్లిలో జరిగిన రాస్తారోకోలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్సార్‌సీపీని అణగదొక్కేందుకు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని పార్టీ మచిలీపట్నం పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా అన్నారు.
కార్యక్రమాల్లో పార్టీ తోట్లవల్లూరు మండల కన్వీనర్ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, పామర్రు మండల ప్రచార కన్వీనర్ కూసం పెద వెంకటరెడ్డి, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు ముత్తేవి ప్రసాద్, పార్టీ నాయకులు ఆర్.వెంకటేశ్వరరావు, మోరా రాజరెడ్డి,టౌన్ యూత్ కన్వీనర్ కూసం సుబ్బారెడ్డి, నందిపాటి సాంబిరెడ్డి, చల్లపల్లి, మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
సమైక్యమంటేనే నేరమా ?
Published Fri, Jan 10 2014 1:38 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement