* వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్
* పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారమివ్వాలి
* ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలి
* ఆదుకోవాలని సీఎంకు, కేంద్ర వ్యవసాయమంత్రికి లేఖలు రాస్తా
* జగన్ అధికారంలోకి వచ్చాక మంచిరోజులొస్తాయి
* కృష్ణా జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు
సాక్షి, విజయవాడ: భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సహజంగా ఇటువంటి నష్టాలు జరిగినప్పుడు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇచ్చే పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. అలాగే ఇన్‌పుట్ సబ్సిడీని అందజేయాలన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు. తడిసిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలన్నారు. కౌలు రైతులకు, పంట నష్టపోయిన రైతులకు బ్యాంకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రికి, కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరదలొచ్చి పంట నష్టపోయిన కృష్ణా జిల్లాలో ఆదివారం విజయమ్మ పర్యటించారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని అనుమంచిపల్లి, షేర్‌మహ్మద్‌పేట, గౌరవరం, చిల్లకల్లు, ముండ్లపాడు, నవాబుపేట, రాఘవాపురం గ్రామాల్లో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలించారు. పత్తి, మొక్కజొన్న, వరి, కాలిఫ్లవర్, మిరప పంటలు పూర్తిగా పాడైపోవడాన్ని చూసి చలించిపోయారు. మహిళా కౌలు రైతులు కన్నీటి పర్యంతమవుతూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతోను, పంటలను పరిశీలించాక పెనుగంచిప్రోలు మండలంలోని ముండ్లపాడు క్రాస్‌రోడ్స్ వద్ద విలేకరులతోను, ఆ తర్వాత చిల్లకల్లులో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలోనూ విజయమ్మ మాట్లాడారు.
రైతులు వేలకు వేలు పెట్టుబడి పెట్టి వేసిన పంటంతా సర్వనాశనమై పోయిందని, వారికి ఒక్కపైసా కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టంపై తమ పార్టీ ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే అందులో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించి రైతులకు న్యాయం చేసేలా పోరాడుతామని భరోసా ఇచ్చారు. అధికారులు పంటల నష్టంపై సరైన అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు.
ఇది మొద్దు ప్రభుత్వం
రైతుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది మొద్దు ప్రభుత్వమని విమర్శించారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాలు బయటపెట్టలేదని, కనీసం అధికారులు కూడా రాలేదని విమర్శించారు. మహానేత వైఎస్సార్ ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. రైతులు ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టి పత్తి, మిరప, మొక్కజొన్న, వరి, కాలిఫ్లవర్ వంటి పంటలు సాగు చేశారని తెలిపారు.
తుపానుతో పంటంతా నాశనమైపోయిందని, నీలం తుపాను కంటే కూడా ఇప్పుడు ఎక్కువ నష్టం జరిగినట్లు కనిపిస్తోందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అందరికీ మంచి రోజులు వస్తాయని విజయమ్మ భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమ ప్రభుత్వం వస్తుందని, కౌలుదార్లకు రుణాలు వచ్చేలా చేస్తారని చెప్పారు. విపత్తులు వచ్చినప్పుడు వైఎస్‌ఆర్ ఢిల్లీకి వెళ్లి నిధులు వచ్చేలా చేసేవారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం మాత్రం ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. విజయమ్మకు సమస్యలు వివరించేందుకు, పాడైపోయిన పంటలు చూపించేందుకు రైతులు ఆసక్తి చూపారు. చిల్లకల్లులో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలోనూ పలువురు రైతులు దెబ్బతిన్న పంటలను ఆమెకు చూపించి గోడు వెళ్లబోసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని నాని, జోగి రమేష్, వంగవీటి రాధా, జ్యేష్ఠ రమేష్‌బాబు, విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు వెంటనే పరిహారం ఇవ్వండి
Published Mon, Oct 28 2013 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement