
రైతులకు ఎకరా లెక్కన నష్టపరిహారం ఇవ్వాలి : విజయమ్మ
శ్రీకాకుళం: పై-లీన్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరా లెక్కన నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు. తుపాను ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధ్వంసం అయిన తోటలను చూసిన తరువాత రైతులను ఏ విధంగా ఓదార్చాలో అర్ధం కావడంలేదన్నారు. తుపాను బాధిత మత్య్సకారుల రుణాలు మాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
రైతులు, మత్య్సకారుల సమస్యలన్నీ జగన్ బాబుకు వివరిస్తానని చెప్పారు. మత్య్సకారులకు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
కొన్ని రోజులుగా విజయనగరంలో జరిగిన ఘటనలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం కలుగుతోందన్నారు. సమైక్యరాష్ట్రాన్ని కాంక్షిస్తూ ఉద్యమం చేస్తున్నవారిపై కక్ష సాధింపులు చేస్తున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకు ముందు ఇచ్చాపురం నియోజవర్గంలో ఫై-లిన్ తుపాను బాధితులను ఆమె పరామర్శించారు. పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న విజయమ్మ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దాడిపూడి, పెద్ద కొజ్జీరియా, చిన్న కొజ్జీరియాలో జీడిపంట రైతులను పంటనష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ బాధలను విజయమ్మకు చెప్పుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని గోడు వెల్లబోసుకున్నారు. ఇడ్డివాణిపాలెం గ్రామ ప్రజలు తమ కష్టాలను చెప్పుకున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలమంతా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాయం అందేలా చూస్తామని బాధితులకు విజయమ్మ హమీ ఇచ్చారు.