
'రాజన్న పాలన రావాలంటే జగన్ సీఎం కావాలి'
దివంగత మహానేత రాజశేఖరరెడ్డి పాలనలోని సువర్ణయుగం మళ్లీ రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సీఎం చేసుకుందామని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖపట్నం లోక్సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం జిల్లా ఎస్. రాయవరంలో విజయమ్మ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాజశేఖర్ రెడ్డి లేని లోటును జగన్ తీరుస్తాడని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. రాజన్నను ప్రేమించే ప్రతి ఒక్క గుండె ఒక్కటి కావాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
గురజాడతోపాటు ఎందరో మహామహులు పుట్టిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా ఆమె ప్రజలకు వివరించారు. సమైక్యరాష్ట్రం కోసం మనమందరం పోరాటం చేశామని కానీ కాంగ్రెస్ చేతుల్లో మన పోరాటాలు నీరుగారిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో ఎవరు ఏం చేశారో అందరికి తెలుసని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆమె ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలో ప్రజలు ఎన్నో అగచాట్లు పడ్డారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అలాంటి పాలన తీసుకువస్తానని మళ్లీ ప్రజల్లోకి వెళ్లగలరా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవశ్యకతను విజయమ్మ ఈ సందర్బంగా విశదీకరించారు. అందుకే వైఎస్ఆర్ సీపీ అన్ని ఎంపీ స్థానాల్లో గెలిచి తీరాలని అన్నారు. అప్పుడే మనం అనుకున్న రాజధాని మనం నిర్మించుకోగలుతామన్నారు. జగన్పై మీరు చూపిన అభిమాన్ని కాంగ్రెస్ అధిష్టానం తట్టుకోలేకపోయిందని విజయమ్మ ఆపార్టీని విమర్శించారు.