పై-లీన్ బాధితులను ఆదుకోండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సంభవించిన పై-లీన్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా రైతులు, మత్స్యకారులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆమె శనివారం ఈ మేరకు ఒక లేఖ రాశారు. ‘శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను ఉత్పాతాన్ని మిగిల్చి వెళ్లింది, అక్కడి ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేయడంతో పాటు వారికి జీవనాధారం లేకుండా చేసింది’ అని విజయమ్మ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ప్రాంతంలో పాలకులు ఏరియల్ సర్వే కూడా ఇంతవరకూ నిర్వహించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
అదే రీతిలో సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టకుండా ప్రజలను దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేశారన్నారు. జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లో తాను విస్తృతంగా పర్యటించి అక్కడి ప్రజల దుర్భర పరిస్థితిని కళ్లారా చూశానని ఆమె ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ‘రైతులు తమ పంటలు నష్టపోయారు, మత్స్యకారులు తమ పడవలను, వలలను కోల్పోయి జీవనోపాధిని పోగొట్టుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని స్థానికులు చెప్పారు’ అని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వ ఘోరవైఫల్యమిది: తుపాను సందర్భంగా పంటలు, జీడిపప్పు, కొబ్బరి తోటలు కోల్పోయిన రైతులను, వలలు, పడవలు కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విజయమ్మ విమర్శించారు. వీరిని తక్షణం ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విజయమ్మ తన లేఖలో ప్రధానిని కోరారు. తుపాను నష్టం అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం పరిశీలక బృందాలను రాష్ట్రానికి పంపాలని, నిధులను విడుదల చేసి సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె పదకొండు డిమాండ్లను లేఖలో పేర్కొన్నారు.
ప్రధానికి రాసిన లేఖలో విజయమ్మ డిమాండ్లు ఇవీ!
1. తుపాను వల్ల నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆలస్యం చేయకుండా తక్షణ సాయం అందించాలి.
2. హుడా కమిటీ సిఫార్సుల ప్రకారం.. చేతికొచ్చిన పంట నష్ట పోయిన వారికి ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.
3. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి.
4. కొబ్బరి తోటలకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఒక చెట్టును యూనిట్‌గా కాకుండా ఎకరాను ఒక యూనిట్‌గా తీసుకోలి.
5. జీడిపప్పు తోటలతో పాటుగా ఇతర ఉద్యాన పంటలకు కూడా పరిహారం చెల్లించాలి.
6. పంట నష్టపరిహారాన్ని అన్ని రకాల పంటపొలాలకు వర్తింప జేస్తూ, అవి ఏ దశలో ఉన్నా పరిగణనలోకి తీసుకోవాలి.
7. మత్స్యకారులకు ఈ రోజు వరకూ ఎలాంటి సాయం అందలేదు. బియ్యం, ఇతర సామగ్రి కొనుగోలు చేయడానికి తగినంత సాయం అందజేయాలి.
8. తుపానులో పడవలు పోగొట్టుకున్న మత్స్యకారులందరికీ పరిహారం ఇచ్చి తీరాలి.
9. జీవనోపాధి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాలి.
10. తుపాను భీభత్సం వల్ల ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి, వాటన్నింటికీ వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి.
11. మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. అక్కడ తక్షణం మంచినీరు అందేలా చూడాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.