వైఎస్‌ వివేకా హత్య కేసులో వింత పోకడ | YS Viveka murder case:Direction from Amravati, Kadapa DPO Action | Sakshi
Sakshi News home page

బంధువులు, సన్నిహితులే టార్గెట్‌!

Published Sat, Mar 23 2019 8:50 AM | Last Updated on Sat, Mar 23 2019 12:50 PM

YS Viveka murder case:Direction from Amravati, Kadapa DPO Action - Sakshi

సాక్షి ప్రతినిధి కడప: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్కార్‌ వింత పోకడలను అవలంబిస్తోంది. నిందితులెవరన్న దానిపై దృష్టి పెట్టకుండా కేసులో బంధువులు, సన్నిహితులను ఎలా ఇరికించాలన్న దానిపైనే ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు. హత్య తర్వాత తమ కుయుక్తుల ద్వారా ఆశించనంతగా రాజకీయ ప్రయోజనాలు లభించకపోవడంతో బంధువులు, సన్నిహితులే లక్ష్యంగా తెరవెనుక మంత్రాంగం చేస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి....(కేంద్ర హోంశాఖకు సునీతారెడ్డి ఫిర్యాదు)

హత్య జరిగి ఇప్పటికి ఎనిమిది రోజులు పూర్తయినా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోగా.. బాధిత కుటుంబ సభ్యులపై చంద్రబాబు నేరుగా దాడి చేస్తున్నారు. వ్యూహాత్మకంగా ఆరోపణలు గుప్పిస్తూ పోలీసుల చర్యలు అటు దిశగా ఉండేలా పథక రచన చేశారు. ఆ మేరకే టీడీపీ నేతలు సైతం ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు.. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీంతో వీరు అనుకుంటున్న కోణంలోనే పోలీసు దర్యాప్తు కూడా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతలు మీడియా సమావేశంలో వైఎస్‌ కుటుంబం సన్నిహితులను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతుండగా.. పోలీసులు కూడా విచారణ పేరుతో వారినే అదుపులోకి తీసుకుంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. చదవండి...(మా నాన్న హత్యపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు)

ఎదురు లేకుండా చేసుకునేందుకే కిరాతకం..
‘రాజకీయాలంటే పిల్లాటలు కాదు.. కడప జిల్లా రాజకీయాలను తిరగరాస్తాం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నియంత్రిస్తాం. రాష్ట్రంలో తిరక్కుండా కట్టడి చేస్తాం. పులివెందులకే పరిమితం చేస్తాం..’ అంటూ ఈ మధ్య ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అదే తరహాలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో అడ్డు లేకుండా చేసుకోవడంతో పాటు, భయోత్పాతం సృష్టించి.. పులివెందులలో వైఎస్సార్‌సీపీ కేడర్‌ను నియంత్రించడం, పోలింగ్‌కు ఎదురులేకుండా చేసుకునే వ్యూహంలో భాగంగానే వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా అంతమొందించారనే అందరూ చర్చించుకుంటున్నారు.

సింహాద్రిపురం, తొండూరు మండలాలల్లో టీడీపీకి మెజార్టీ తీసుకువస్తాం.. పులివెందుల టౌన్‌లో ఓటింగ్‌ను నియంత్రిస్తాం, మెజార్టీని గణనీయంగా తగ్గిస్తామనే దిశగా నాయకులు మంతనాలు సాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్ననే హత్యచేస్తే ఇక ఎదురుండదనే భావనలో భాగమే దారుణానికి ఒడిగట్టినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కానీ, ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు సాగడంలేదని వారంటున్నారు. కాగా, ఇప్పటివరకూ సన్నిహితులు, బంధువులనే విచారిస్తున్న పోలీసులు.. వైరిపక్ష నేతల్ని విచారించలేదన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

అమరావతి డైరెక్షన్‌ మేరకే..
ఇదిలా ఉంటే.. వివేకానందరెడ్డి హత్య కేసును నిగ్గుతేల్చే వ్యవహారంలో అమరావతి డైరెక్షన్‌ మేరకు కడప డీపీఓ (డిస్ట్రిక్ట్‌ పోలీసు ఆఫీసర్‌) యాక్షన్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుర్ఘటన జరిగి ఎనిమిది రోజులు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. పైగా సాక్ష్యాలు చెరిపేశారని సన్నిహితులపై ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి వివేకా మృతదేహాం పడిఉన్న బాత్‌రూమ్‌ పూర్తిగా పోలీసుల అదుపులో ఉంది. పలు పర్యాయాలు వారు పర్యవేక్షించారు కూడా. మంచం పక్కన పడి ఉన్న రక్తాన్ని మాత్రమే ఎర్ర గంగిరెడ్డి అనే వ్యక్తితో పోలీసుల సమక్షంలో కడిగించారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ అతను పోలీసుల అదుపులోనే ఉన్నాడు. కాగా, ఇదే సాకుతో బంధువులు, వైఎస్‌ కుటంబ సన్నిహితులను ఇరుకున పెట్టే ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర స్థాయిలో ఓ అత్యున్నతాధికారి ఈ కేసుపై దిశా నిర్దేశ్యం చేస్తూ సిట్‌తో నిమిత్తం లేకుండా విచారణ చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement