వివేకానందరెడ్డి మృతికి నివాళులర్పిస్తున్న అప్పిరెడ్డి, మోదుగుల, ముస్తఫా, ఆర్కే, మర్రి రాజశేఖర్, పాదర్తి, ఏసురత్నం తదితరులు
తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యేనని, అది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దారుణమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోలేక నిన్నమొన్నటి వరకు తమ పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు పాల్పడిన టీడీపీ నేతలు ఇప్పుడు వ్యక్తులను అడ్డు తొలగించేందుకు హత్యలకు తెగబడటం దారుణమని పేర్కొంటున్నారు. ఓ వైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తమ అధినేత వైఎస్ జగన్ కుటుంబం విషాదంలో మునిగిపోతే సానుభూతి తెలపాల్సిన ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడితో ప్రతిపక్షంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు.
పట్నంబజారు(గుంటూరు): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కచ్చితంగా టీడీపీ నేతల పనే అని, అధికారం కోసం మొన్నటివరకు అక్రమంగా ఓట్లు తొలగించారు. ఇప్పుడు ఏకంగా వ్యక్తులనే తొలగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నంలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని, పార్టీ నేతలు, కార్యకర్తలను భయాందోళనలు నెట్టాలనే ఉద్దేశంతో వివేకానందరెడ్డిని హత్య చేసి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు.
దీనిపై పూర్తిస్థాయిలో సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య టీడీపీ, చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు చేయించిందేనని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయర్త చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే కుట్రలను చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వివేకానందరెడ్డి సంతాపసభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం రెండు నిమిషాలపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు మౌనం పాటించారు.
సమావేశంలో పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మొహమ్మద్ ముస్తఫా, ఆర్కే, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం తదితరులు మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఆతుకూరి ఆంజనేయులు, ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), యేటిగడ్డ బుజ్జి, అత్తోట జోసఫ్, రాచకొండ జాన్‌బాబు, కొలకలూరు కోటేశ్వరరావు, అంగడి శ్రీనివాస్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, మేరాజోతు హనుమంత్‌నాయక్, కొత్తా చినప్పరెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి, చల్లా శేషిరెడ్డి, గనిక ఝాన్సీ, మేరిగ విజయలక్ష్మి, దేవరాజు, వాసిరెడ్డి విజయమాధవి, మేరువ నర్సిరెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ కుట్ర : మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి
తెనాలి: వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య దారుణమని మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్‌రాజారెడ్డి హత్య, జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం, ఇప్పుడు వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ కుట్ర ఉందన్న అనుమానాన్ని శివరామకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు.
సీబీఐ విచారణ చేపట్టాలి :కాసు మహేష్‌రెడ్డి
పిడుగురాళ్ల(గురజాల): వైఎస్ వివేకానందరెడ్డిని హత్యపై సీబీఐ విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వానే విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 16న ౖపిడుగురాళ్లలో ఎన్నికల శంఖారావం వివేకానందరెడ్డి మృతి చెందడంతో వాయిదా పడిందని కాసు వెల్లడించారు.
దిగ్భ్రాంతి కలిగించింది : గోపిరెడ్డి
నరసరావుపేట రూరల్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య పట్ల ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరికీ హాని తలపెట్టని మంచి వ్యక్తి, నెమ్మదస్తుడైన వివేకానందరెడ్డితో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని తెలిపారు.
చంద్రబాబు కనుసన్నల్లోనే..
రాష్ట్రంలో అభ్యర్థులు దొరకని టీడీపీ నేతలు ఓటమి తప్పదని భయపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక హత్యా రాజకీయాలకు తెరతీశారు. మా అధినేత వైఎస్ జగన్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే వివేకానందరెడ్డిని హత్యచేసి, ఆపై ఎదురుదాడితో నీచ రాజకీయాలకు తెగబడుతున్నారు. వివేకానందరెడ్డి హత్య సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగింది.– షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment