సునీత ఢిల్లీ ప్రెస్‌మీట్‌తో తొలగిన ముసుగు
వివేకా హత్య వెనుక ఉన్నది ఎల్లో గ్యాంగే
మెజార్టీ ఉన్నా వివేకాను ఎమ్మెల్సీఎన్నికల్లో ఓడించిన పచ్చ ముఠా
వివేకా ఉంటే జిల్లాలో రాజకీయమనుగడ ఉండదని టీడీపీ భయం
వివేకా రెండో వివాహంతోనేఆ కుటుంబంలో విభేదాలు
వివేకా మృతితో సునీత కుటుంబానికే ఆర్థికంగా లబ్ధి
వివేకా లేఖను రహస్యంగా ఉంచడం వెనుక ఉద్దేశమూ నిజాలు బయటకు రాకూడదనే
గుండెపోటుతో వివేకా మరణించినట్లు చేసిన ప్రచారమూ వారిదే
వివేకా రెండో వివాహం...కుటుంబ విభేదాలు కప్పిపుచ్చడం ఎందుకో!
తండ్రి హంతకులు, కుట్రదారులనే వెనకేసుకొచ్చిన సునీత
వారితో కొంతకాలంగా సునీతదంపతుల సాన్నిహిత్యం
చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సునీత సానుభూతి డ్రామా
వైఎస్సార్‌సీపీకి ఓటేయద్దంటూ అసలు స్వరూపం బయటపెట్టుకున్న సునీత
సాక్షి, అమరావతి: ‘నాకు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచిన చంద్రబాబు, పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి రాజేష్ మహాసేనలకు కృతజ్ఞతలు’.. అంటూ మూడేళ్లుగా తన వెనుక ఉండి, తనను ఎవరు ఆడిస్తున్నారో, తన నోటి నుంచి వస్తున్న మాటల వెనుక స్క్రిప్ట్ ఎవరిదో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత విస్పష్టంగా వెల్లడించారు. ఇన్నాళ్లూ తాను కప్పుకున్న ముసుగును తొలగించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకు చంద్రబాబు ఆమెను తెరమీదకు తెచ్చారు.
శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుతో ప్రారంభించి, చివరకు ఏపీ ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓటేయొద్దని కోరుతూ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై మరోసారి అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అందుకోసం 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల ఉదంతాన్ని వక్రీకరించారు. ఆమె తండ్రిని కుట్రతో ఓడించిన చంద్రబాబు ముఠాను వెనకేసుకొచ్చారు.
ఆ ముఠా సభ్యులు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో సునీత, ఆమె భర్త సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని దాటవేశారు. ఆమె తండ్రి రెండో వివాహంతో కుటుంబంలో తలెత్తిన విభేదాలను మరుగున పరచడానికి చూశారు. వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరితో మాటామంతీ కొనసాగిస్తున్న విషయం బయటి ప్రపంచం గుర్తించడంలేదనే భ్రమలో ఉన్నారు. వెరసి తాను చంద్రబాబు గూటిలో చిలకనని స్పష్టం చేశారు. చంద్రబాబు నేర్పిన నాలుగు పలుకులనే పలికారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సునీత సానుభూతి డ్రామా ఆడారు.
వివేకాను కుట్రతో ఓడించినందుకా చంద్రబాబు, ఆయన ముఠాకు కృతజ్ఞతలు?
సునీత టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ సభ్యులు బీటెక్ రవి, మహాసేన రాజేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలపడమే విడ్డూరం. వృత్తి రీత్యా డాక్టరైన సునీత ఉద్దేశపూర్వకంగా మతిమరుపు నటిస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డిని 2017లో కుట్రతో రాజకీయంగా అంతమొందించింది చంద్రబాబే. తర్వాత 2019లో ఆయన్ని భౌతికంగా అంతం చేసిందీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి ఓడించారని ఆమె అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరం. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీకి చెందినవారే కావడంతో ఆయన సునాయాసంగా గెలుస్తారని అంతా భావించారు.
వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వారి వైపు లాక్కున్నారు. కుట్రపూరితంగా వివేకాను ఓడించారు. ఈ వ్యవహారంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారు.
హత్య వెనుకా ఎల్లో గ్యాంగే..!
ఇక 2019 సాధారణ ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని వైఎస్ జగన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. నియోజకవర్గం పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. వివేకానందరెడ్డి పార్టీ విజయం కోసం ఎన్నికల వ్యూహాలు పన్నుతూ అందర్నీ కలుపుకొంటూ దూసుకుపోతున్నారు. దాంతో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. వివేకా జీవించి ఉంటే వారితో పాటు బీటెక్ రవికీ రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతారు.
ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. అంటే వివేకా భౌతికంగా లేకపోవడం రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందని టీడీపీ పెద్దలు భావించారన్నది సుస్పష్టం. వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలు కొందరితో రహస్య సమావేశాలు, హత్య తరువాత ఆ నేతలు వ్యవహరించిన తీరే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తిన కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డితో బీటెక్ రవి సాన్నిహిత్యం పెంచుకున్నారు. హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్‌లో రెండుసార్లు సమావేశమయ్యారు.
ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. అంటే వివేకా హత్య వెనుక ఎల్లో గ్యాంగ్ ఉందన్నది స్పష్టమవుతోంది. కానీ ఆ పచ్చ ముఠాలోని చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలను సునీత వెనకేసుకు వస్తుండటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.
కుటుంబ వివాదాల మాటేమిటి?
వివేకానందరెడ్డి రెండో వివాహంతో కుటుంబంలో రేగిన విభేదాలు, ఆస్తుల కోసం ఘర్షణలు సునీత మరుగున పెడుతున్న మరో ప్రధాన అంశం. వివేకా మరణిస్తే ఎవరికి ప్రయోజనం, ఆయనతో వ్యక్తిగతంగా ఆస్తిపరంగా, రాజకీయంగా ఎవరికి విభేదాలు ఉన్నాయన్నది ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం. షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. ఆ మహిళకు పుట్టిన కుమారునికి ఆస్తిలో భాగం ఇవ్వాలని భావించారు. తన రాజకీయ వారసునిగా చేస్తానని కూడా ప్రకటించారు. దాంతో ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి.
వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా గొడవపడి ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటున్నారు. కుటుంబానికి చెందిన కంపెనీల్లో వివేకాకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, సునీత దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్‌ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది.
షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని, ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివించాలని అనుకుంటున్నా అవడంలేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. షమీమ్ కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ ప్రయోజనమన్నది స్పష్టమవుతోంది.
వివేకాను హత్య చేసిన తరువాత ఆయన నివాసంలో కొన్ని ఆస్తి పత్రాలు, రౌండ్ సీల్ కోసం హంతకులు వెదికారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంటే వివేకా తన రెండో భార్యకు రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్లారన్నది స్పష్టం. వివేకా లేకపోతే ఆస్తి మొత్తం దక్కడంతోపాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్న ఉద్దేశం ఆయన బావమరిది, అల్లుడికి ఉందన్నది స్పష్టమైంది.
లేఖను గోప్యంగా ఉంచి.. గుండెపోటు ప్రచారం
వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకు ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పక్కా పన్నాగంతోనే వ్యవహరించారు. శివప్రకాశ్‌రెడ్డి మొదటగా ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఆ ప్రచారాన్ని కొనసాగించేందుకు వివేకా రాసిన లేఖను కుమార్తె, అల్లుడు రహస్యంగా ఉంచారు.
ఆ లేఖను మొదటగా ఆ రోజు ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని సునీత భర్త రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖ, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని రాజశేఖరరెడ్డి ఆయనతో చెప్పారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసిపోయేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఆ లేఖను సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు.
వారు ఆ లేఖను చదివిన వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం.
వివేకా హంతకులతో సఖ్యత.. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో సాన్నిహిత్యం
వివేకాను గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన హంతకుడు దస్తగిరితో సునీత సఖ్యతతో ఉండటం వెనుక గూడుపుఠాణి ఏమిటన్నది మరో కీలకాంశం. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన సిట్, తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, సీబీఐ కూడా వివేకానందరెడ్డిని దస్తగిరితో సహా నలుగురు హత్య చేశారని నిర్ధారించాయి. వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది.
సునీత, ఆమె భర్త దస్తగిరితో పలుసార్లు భేటీ అవుతున్నారు. టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితోనూ సన్నిహితంగా ఉంటున్నారు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్‌గా మారారన్నది సుస్పష్టం. వివేకా హంతకుడితో, రాజకీయ ప్రత్యర్థులతోనూ ఆ కుటుంబం సన్నిహితంగా ఉండటం ఈ హత్య కుట్రలో వారి సామూహిక భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తోంది.
వారంరోజుల్లో తేలిపోయేదే అయితే చంద్రబాబునే ప్రశ్నించాలి
వివేకా హత్య కేసు వారం రోజుల్లోనే తేలిపోవాలి కానీ, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని సునీత ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమే. ఎందుకంటే వివేకా హత్యకు గురైనప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబే. అప్పుడు వారం రోజుల్లోనే ఆ హత్య కేసును ఎందుకు ఛేదించలేదని సునీత ప్రశ్నించాల్సింది చంద్రబాబునే. ఇలా ప్రశ్నించకపోగా, వెనకేసుకు వస్తుండటం వెనుక ఉద్దేశం ఏమిటన్నది నిగ్గు తేలాలి.
అంతేకాదు వివేకా హత్య జరిగిన వెంటనే ఆ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతో, మంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. అయినా సునీత చంద్రబాబును ప్రశ్నించడంలేదు.
ఇప్పుడు కేసు సీబీఐ చేతుల్లో ఉంది...ప్రశ్నించాల్సింది కేంద్రాన్ని కదా...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ ఆ దర్యాప్తును అడ్డుకుంది సునీతే. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు వద్దని, సీబీఐ దర్యాప్తు కావాలని ఆమె న్యాయస్థానంలో కేసు వేశారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న న్యాయస్థానం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కేసును బదిలీ చేసింది. మూడేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు.
ఇప్పుడు సునీత నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్నే. ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిన ఆమె అక్కడే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించాల్సింది. ఆమె అలా చేయలేదు. ఎందుకంటే ఎన్నికల్లో బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్న చంద్రబాబుకు అది ఇష్టం లేదు. బాబుకు ఇష్టంలేని పని సునీత చేయరు. అది ఆమె తండ్రి హత్య కేసు దర్యాప్తు అయినా సరే..
మాటలు మార్చిన సునీత
సునీత వైఖరి ఊసరవెల్లిని తలపిస్తోంది. తన తండ్రి వైఎస్ వివేకా హత్య వెనుక టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపి ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఉన్నారని ఆమె 2019 మార్చిలో చెప్పారు. అంతే కాదు.. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. ఈ మేరకు 2019 మార్చి 21న హైదరాబద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మరీ తన తండ్రి వివేకా, ఎంపీ అవినాష్‌రెడ్డి మధ్య ఉన్న అన్యోన్యతను వివరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర పూరితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ఆమె ప్రజలను కోరారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా కొంతకాలం అదే వైఖరి అవలంబించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ప్లేటు ఫిరాయించారు.
సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి పూర్తిగా చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్ళి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడం మొదలెట్టారు. క్రమంగా మాటలు మారుస్తూ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను విచారించాలంటున్నారు. చివరగా వైఎస్సార్‌సీపీకి ఓటేయొద్దంటూ ముసుగు తొలగించేశారు. తన ఎల్లో విధానాన్ని బహిర్గతం చేశారు.
సునీత టీడీపీ గూటి చిలుకే
ఇన్నాళ్లూ తన తండ్రి వివేకా హంతకులెవరో నిగ్గు తేలాలంటూ వాదించిన సునీత.. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో అసలు స్వరూపం బయటపెట్టారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే తనకు ప్రధానమని తేల్చిచెప్పారు. అందుకోసమే ఢిల్లీ ప్రెస్ మీట్‌లో రాజకీయ ప్రసంగమే చేశారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, రఘురామరాజు, మహాసేన రాజేష్, పట్టాభి... ఇలా ఈ ఎల్లో గ్యాంగ్ కొన్నేళ్లుగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ఆరోపణలనే తాజాగా సునీతా చెప్పారు. అచ్చమైన టీడీపీ నేతగా మారారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓటేయవద్దని చెప్పారు. ఇది నైతికంగా సునీత దిగజారుడుతనమే.
ఇన్నాళ్లూ తండ్రి హత్యకు గురైన బాధితురాలిగా చెప్పుకున్న సునీత.. ప్రస్తుతం చంద్రబాబు కుట్ర రాజకీయంలో పావునని అంగీకరించారు. ఇన్నాళ్లూ తాను కార్చింది మొసలి కన్నీరేనని, చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనమే తన కంట్లో పన్నీరని చెప్పకనే చెప్పారు. వైఎస్సార్‌సీపీకి ఓటేయకూడదని అంటున్నారు. ఎందుకో మాత్రం ఆమె చెప్పనే లేదు. కులం, మతం, రాజకీయం చూడకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేసినందుకా? విద్య, వైద్య సంస్కరణలను ప్రవేశపెట్టినందుకా?
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చినందుకా? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నందుకా.. ఎందుకు ఓటేయకూడదని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం తన తండ్రి రెండో భార్యకు ఆస్తి లేకుండా అన్యాయం చేసినందుకు, తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి హత్యను ఉపయోగించుకోవాలని చూస్తున్నందుకే ఆమెకు ప్రజలు సహకరించాలా అని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment