సాక్షి, అమరావతి: ఐదేళ్లు అధికారంలో ఉండి పరిపాలన చేసిన ఏ పార్టీ అయినా చేసిన అభివృద్ధిని చెప్పి ఓటు అడగడం సంప్రదాయం. కానీ, అభివృద్ధి నినాదం లేకుండా కేవలం వ్యక్తిగత అంశాలనే
ప్రచారాస్త్రాలుగా మలచుకుని వాటినే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పదేపదే చెబుతుంటే.. దానర్థం అభివృద్ధి ఏమీ చేయలేదనేగా..!
దేశంలో ఏ రాష్ట్రం చేయనంతటి అభివృద్ధిని ఐదేళ్లలో తాను చేశానని గొప్పలు చెప్పిన చంద్రబాబు ఎన్నికల్లో మాత్రం దాని గురించి నోరు మెదపకుండా కేవలం ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలకే ప్రాధాన్యత ఇచ్చి వాటినే ప్రచారం చేస్తున్నారు. ఆయనకు రక్షణ కవచంగా ఉన్న ఎల్లో మీడియా కూడా చంద్రబాబు ఆరోపణలను భూతద్దంలో చూపిస్తూ, గోరంతని కొండంతలుగా చేసి ప్రజల్ని గందరగోళపరిచేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
ప్రచారంలోనే అభివృద్ధి..
కొద్ది రోజుల క్రితం వరకూ రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించామని, ప్రజల ఆదాయాన్ని పెంచామని, అన్ని వర్గాలకు చెప్పలేనంతటి మేలు చేశామని, చరిత్రలో తాము చేసిన అభివృద్ధి మరెవ్వరూ చేయలేదని అందుకే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు ఊదరగొట్టారు. కేంద్రం నిధులివ్వకపోయినా పోలవరం ప్రాజెక్టును 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి గేట్లు పెట్టినప్పుడు, కాంక్రీటు వేసినప్పుడు తెగ హడావుడి చేశారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన రాజధానిని నిర్మిస్తున్నామని, ప్రపంచంలోని ఐదు ప్రపంచస్థాయి రాజధానుల్లో అమరావతి ఒకటని ప్రచారం చేశారు.
ఇలా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గొప్పలు చెప్పుకున్న సందర్భాలు అనేకం. ఇంత గొప్పగా తన పాలన గురించి ప్రచారం చేసుకున్న ఆయన.. ఎన్నికల్లో మాత్రం వాటిని చూసి తనకు ఓటేయాలని మాత్రం అడగడంలేదు. అభివృద్ధి నిజంగా జరిగితే దాన్ని చూపించి ఓటు ఎందుకు అడగడంలేదనే ప్రశ్నకు టీడీపీలో సమాధానం కరువైంది. అభివృద్ధి నినాదం ఎత్తుకుంటే ప్రజలు ఛీకొడతారని తెలిసే ఎన్నికల ప్రచారంలో దాని గురించి ఎక్కడా చెప్పడంలేదు.
గందరగోళపర్చేందుకు జగన్‌పై ఆరోపణలు
వైఎస్ జగన్‌పై విషం చిమ్మి లబ్ధి పొందాలనే పాత ఎత్తుగడనే చంద్రబాబు అనుసరిస్తున్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై తాను పెట్టించిన కేసులనే చెబుతూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. ఐదేళ్ల తర్వాత ఈ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలుచేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
వివేకా హత్యలోనూ రాజకీయమే
వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా రాజకీయం చేసి లబ్ధిపొందేందుకు చంద్రబాబు పదేపదే ఆ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెబుతుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 40 ఏళ్ల అనుభవముందని చెప్పుకుంటున్న రాజకీయ నాయకుడు పోలీసులు చేయాల్సిన పనిని తానే చేస్తున్నట్లు చెబుతూ, ఈ కేసు గురించి ప్రశ్నలు లేవనెత్తుతూ బహిరంగ సభల్లో మాట్లాడుతుండడంపై ఆ పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు ఆత్మాభిమానం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందేందుకు కూడా చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుండడం సొంత పార్టీ నేతలకే మింగుడుపడడంలేదు. కేసీఆర్, కేటీఆర్‌లు ఆంధ్రా ద్వేషులని చెబుతూ వారితో జగన్‌కు లింకుపెట్టి ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి లాభపడటమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇదే తన ఎన్నికల ప్రచారాంశమని ఇటీవల జరిగిన మీడియా సమవేశంలోనూ చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. విద్వేషాలను తాను, తన పరివారం రగల్చడమే కాకుండా తన రహస్య మిత్రుడు పవన్‌కళ్యాణ్‌తోనూ అదే పని చేయిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment