సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,059 జబ్బులను చేర్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న పథకం సత్ఫలితాలిస్తోంది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఆరోగ్యశ్రీ విస్తరణ పథకం పేదల జీవితాల్లో కొత్త ఉషస్సులు నింపుతోంది. రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఈ ఒక్క జిల్లాలోనే జనవరి 3 నుంచి 14వ తేదీ వరకూ రూ.వెయ్యి బిల్లు దాటిన 1,100 మందికి పైగా పేదలు నమోదయ్యారు. విస్తరించిన పథకం ప్రారంభమైన నాటినుంచి రోజు రోజుకూ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. రూ.వెయ్యి బిల్లు దాటిన వారంతా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రికి వెళుతున్నారు.
అక్కడ ఆరోగ్యమిత్ర రోగుల జబ్బులు నమోదు చేసుకుని ఆ జబ్బు జాబితాలో ఉంటే తక్షణమే అనుమతుల నిమిత్తం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపిస్తున్నారు. వీలైనంత త్వరగా అనుమతులు వస్తుండటంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ పరిధిలో 54 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు 54 వరకూ ఉండగా.. వాటిలోని 34 ఆస్పత్రుల్లో గడచిన 12 రోజుల్లో రూ.వెయ్యి బిల్లు దాటిన వారు ఉచితంగా చికిత్స పొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకుని ఏప్రిల్ 1నుంచి ప్రతినెలా ఒక జిల్లాలో 2,059 జబ్బులకు చికిత్సలను అందుబాటులోకి తెస్తారు.
ప్రతి రోగి వివరాలూ నమోదు చేయాలని చెప్పాం
ప్రతి రోగి వివరాలను నమోదు చేయాలని చెప్పాం. 2,059 రకాల జబ్బులు కాకుండా కొత్తగా ఏమైనా నమోదవుతున్నాయా, అలాంటి వారెవరైనా వైద్యం కోసం వచ్చి వెనక్కి వెళుతున్నారా, జాబితాలో చేర్చిన జబ్బుల్లో వైద్యం కోసం రోగులు రావడం లేదనే వివరాలనూ నమోదు చేయిస్తున్నాం. జాబితాలో లేని జబ్బులు ఏవైనా నమోదైతే వాటిని గుర్తించటం, ఎవరూ వైద్యానికి రాని జబ్బులు ఉంటే వాటిని తీసెయ్యడం వంటి వివరాల కోసం రిజిస్ట్రీని నిర్వహిస్తున్నాం. జబ్బుల సరళిని గుర్తించి వాటి నియంత్రణకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
–డాక్టర్ ఎ.మల్లికార్జున, సీఈఓ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్
Comments
Please login to add a commentAdd a comment