సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి
సాక్షి, మంత్రాలయం: బూత్ కమిటీలే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలని, కావున కీలకంగా వ్యవహరించాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సూచించారు. బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామ కల్యాణమండపంలో నియోజకవర్గంలోని 230 బూత్ కమిటీల కన్వీనర్లు, సభ్యుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి బూత్ కమిటీ సభ్యుడు పార్టీకి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్‌ల్లో ఓట్ల గల్లంతుపై పరిశీలించుకుని జాబితాలో నమోదు చేయించాలన్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు వైఎస్‌ఆర్‌సీపీ బూత్ కమిటీ సభ్యుల పేర్లు తొలగించే యత్నంలో ఉన్నారని, ఎప్పటికప్పుడు జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని సూచించారు.
నియోజకవర్గంలో మీ కృషి, ప్రజల ఆశీర్వాదాలు తనకు మెండుగా ఉన్నాయన్నారు. రెండు పర్యాయాలు తనపై నమ్మకంతో ప్రజలు గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈసారి ఎన్నికల్లోనూ కచ్చితంగా గెలుపొంది..వారి రుణం తీర్చుకుంటానన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర శ్రమతో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీడీపీ నాయకుడు తిక్కారెడ్డి ఎన్ని కుతంత్రాలు పన్నినా తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నూరు మంది తిక్కారెడ్డిలు తనపై పోటీకి నిలబడినా వారికి ఓటమి తప్పదన్నారు. గ్రామాల్లో చిచ్చు రేగేలా ఆయన ప్రసంగాలు చేయడం మానుకోవాలన్నారు.
నిజాయితీకి నిలువుటద్దం జగనన్న
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీకి నెలువెత్తు సాక్ష్యమని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. సమావేశానికి అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ప్రసంగించారు. అబద్ధపు మాటలు మాట్లాడటం జగనన్న జీవిత చరిత్రలో లేదన్నారు. వైఎస్‌ఆర్ కుటుంబంపై ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. జగనన్న పాదయాత్రలో ప్రభంజనాన్ని చూసి చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ల జాబితాలను తెప్పించుకుని ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు చేసే నీచపు పనికి దిగజారారని మండిపడ్డారు.
ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముకలా అండగా నిలవాలన్నారు. జగనన్న హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, మంత్రాలయం, కౌతాళం, కోసిగి మండలాల కన్వీనర్లు భీమిరెడ్డి, నాగరాజుగౌడ్, యిల్లూరి ఆదినారాయణశెట్టి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి, సలహాదారుడు మద్దిలేటి, జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, బూత్ కమిటీ మేనేజర్ బెట్టనగౌడ్, నియోజకవర్గ నాయకులు మురళీరెడ్డి, అత్రితనయగౌడ్, విరుపాక్షయ్యస్వామి, నాడిగేని నరసింహులు, నరసన్న, చిన్నతుంబళం సింగిల్‌విండో అధ్యక్షుడు రవీంద్ర, సర్పంచు రాజేంద్ర, ఎంపీటీసీ యల్లప్ప, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment