MLA Balanagi Reddy
-
ఎమ్మెల్యేలను కాదని ప్రైవేటు వ్యక్తులకు నిధులా?
సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఎన్నుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను పక్కనపెట్టి, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆయా నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తుండటంపై హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్, కర్నూలు జిల్లా కలెక్టర్, మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి తిక్కారెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న తనను సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి తిక్కారెడ్డి కోరిన విధంగా ఇష్టారాజ్యంగా నిధులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి శుక్రవారం విచారణ జరిపారు. ఎమ్మెల్యేలను సంప్రదించరా? పిటిషనర్ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా పిటిషనర్‌పై ఉందన్నారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించడం తప్పనిసరని తెలిపారు. టీడీపీ మంత్రాలయం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న తిక్కారెడ్డి పలు పనుల నిమిత్తం ప్రభుత్వాన్ని రూ.25 కోట్ల మేర నిధులు కోరారని, ఇందుకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చిందని కోర్టుకు నివేదించారు. ఇలా పార్టీకి చెందిన వ్యక్తులు కోరితే నిధులు ఇవ్వడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేను సంప్రదించకుండా ప్రభుత్వం, అధికారులు ఇష్టారాజ్యంగా ప్రైవేటు వ్యక్తులకు నిధులు ఇస్తున్నారని వివరించారు. ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులను ప్రజల దృష్టిలో చులకన చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడాన్ని పిటిషనర్ తప్పుపట్టడం లేదని, అయితే ప్రజాప్రతినిధితో సంబంధం లేకుండా ఇలా ప్రైవేటు వ్యక్తులకు నిధులు ఇవ్వడంపైనే అభ్యంతరం చెబుతున్నామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. -
బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించాలి
సాక్షి, మంత్రాలయం: బూత్ కమిటీలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలని, కావున కీలకంగా వ్యవహరించాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సూచించారు. బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామ కల్యాణమండపంలో నియోజకవర్గంలోని 230 బూత్ కమిటీల కన్వీనర్లు, సభ్యుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి బూత్ కమిటీ సభ్యుడు పార్టీకి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్‌ల్లో ఓట్ల గల్లంతుపై పరిశీలించుకుని జాబితాలో నమోదు చేయించాలన్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ సభ్యుల పేర్లు తొలగించే యత్నంలో ఉన్నారని, ఎప్పటికప్పుడు జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో మీ కృషి, ప్రజల ఆశీర్వాదాలు తనకు మెండుగా ఉన్నాయన్నారు. రెండు పర్యాయాలు తనపై నమ్మకంతో ప్రజలు గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈసారి ఎన్నికల్లోనూ కచ్చితంగా గెలుపొంది..వారి రుణం తీర్చుకుంటానన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర శ్రమతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీడీపీ నాయకుడు తిక్కారెడ్డి ఎన్ని కుతంత్రాలు పన్నినా తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నూరు మంది తిక్కారెడ్డిలు తనపై పోటీకి నిలబడినా వారికి ఓటమి తప్పదన్నారు. గ్రామాల్లో చిచ్చు రేగేలా ఆయన ప్రసంగాలు చేయడం మానుకోవాలన్నారు. నిజాయితీకి నిలువుటద్దం జగనన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీకి నెలువెత్తు సాక్ష్యమని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. సమావేశానికి అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ప్రసంగించారు. అబద్ధపు మాటలు మాట్లాడటం జగనన్న జీవిత చరిత్రలో లేదన్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. జగనన్న పాదయాత్రలో ప్రభంజనాన్ని చూసి చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ల జాబితాలను తెప్పించుకుని ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు చేసే నీచపు పనికి దిగజారారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముకలా అండగా నిలవాలన్నారు. జగనన్న హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, మంత్రాలయం, కౌతాళం, కోసిగి మండలాల కన్వీనర్లు భీమిరెడ్డి, నాగరాజుగౌడ్, యిల్లూరి ఆదినారాయణశెట్టి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి, సలహాదారుడు మద్దిలేటి, జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, బూత్ కమిటీ మేనేజర్ బెట్టనగౌడ్, నియోజకవర్గ నాయకులు మురళీరెడ్డి, అత్రితనయగౌడ్, విరుపాక్షయ్యస్వామి, నాడిగేని నరసింహులు, నరసన్న, చిన్నతుంబళం సింగిల్‌విండో అధ్యక్షుడు రవీంద్ర, సర్పంచు రాజేంద్ర, ఎంపీటీసీ యల్లప్ప, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు ద్రోహి
మంత్రాలయం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ద్రోహి అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి విమర్శించారు. శనివారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో కౌతాళం మండలం ఉప్పరహల్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గాదలింగప్ప, శేఖన్న, ఉసేని, లింగప్ప, మర్రిస్వామి, అయ్యప్ప, టీడీపీ నాయకులు ఈరన్న, మహదేవ, వెంకన్నలతో పాటు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అధికారంలోకి రాగానే గాలికొదిలారన్నారు. ప్రభుత్వ ఫలాలు కూడా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు కట్టబెడుతూ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతిఒక్కరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏకాంభ్రం రెడ్డి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరిన కార్యకర్తలు -
అభివృద్ధి చేతల్లో చూపించాలి
పెద్దకడబూరు: అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కల్లుకుంట గ్రామంలో పంచాయతీ నిధులతో చేపట్టిన వాటర్ ట్యాంక్, సీసీ రోడ్లును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రూ. 1.25 కోట్లు పంచాయతీ నిధులు, రూ. 5లక్షలు ఎంపీపీ నిధులతో పాటు తమ సొంత నిధులు రూ. 5 లక్షలతో డ్రెయినేజి, సీసీరోడ్లు, మంచినీటి పైప్‌లైన్, నీటి తొట్టెలు నిర్మించామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ. 200కోట్లు ఖర్చు పెట్టినట్లు టీడీపీ నాయకులు మాటల్లో చెబుతున్నారని, వాస్తవం అయితే వాటికి ఆధారాలు చూపించాలన్నారు. అభివృద్ధిని తాము మాటల్లో కాదని చేతల్లో చూపించే రకమన్నారు. రాబోయేది రాజన్న రాజ్యమే.. రాబోయే ఎన్నికల్లో ప్రజల అభిమానంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. రోబోయే ఎన్నికల్లో ప్రజలే టీడీపీకి గుణపాఠం చెబుతారన్నారు. ప్రజల తీర్పుపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో తాము ముందున్నామన్నారు. ఆరు నెలలు ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని, సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలముని, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ నాయకులు వై. ప్రదీప్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి పురుషోత్తంరెడ్డి, మండల అధ్యక్షుడు రాంమోహన్‌రెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యుడు విజయేంద్ర రెడ్డి, జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ వరప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగమల్లయ్య, మాజీ సర్పంచ్ సత్యనారాణగౌడ్, మండల నాయకులు రామాంజనేయులు పాల్గొన్నారు. -
చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
కోస్గి (కర్నూలు) : కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్పవాలకు మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.