సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఎన్నుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను పక్కనపెట్టి, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆయా నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తుండటంపై హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్, కర్నూలు జిల్లా కలెక్టర్, మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న తనను సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి కోరిన విధంగా ఇష్టారాజ్యంగా నిధులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి శుక్రవారం విచారణ జరిపారు.
ఎమ్మెల్యేలను సంప్రదించరా?
పిటిషనర్ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా పిటిషనర్‌పై ఉందన్నారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించడం తప్పనిసరని తెలిపారు. టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న తిక్కారెడ్డి పలు పనుల నిమిత్తం ప్రభుత్వాన్ని రూ.25 కోట్ల మేర నిధులు కోరారని, ఇందుకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చిందని కోర్టుకు నివేదించారు. ఇలా పార్టీకి చెందిన వ్యక్తులు కోరితే నిధులు ఇవ్వడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమన్నారు.
ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేను సంప్రదించకుండా ప్రభుత్వం, అధికారులు ఇష్టారాజ్యంగా ప్రైవేటు వ్యక్తులకు నిధులు ఇస్తున్నారని వివరించారు. ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులను ప్రజల దృష్టిలో చులకన చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడాన్ని పిటిషనర్ తప్పుపట్టడం లేదని, అయితే ప్రజాప్రతినిధితో సంబంధం లేకుండా ఇలా ప్రైవేటు వ్యక్తులకు నిధులు ఇవ్వడంపైనే అభ్యంతరం చెబుతున్నామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
ఎమ్మెల్యేలను కాదని ప్రైవేటు వ్యక్తులకు నిధులా?
Published Sat, Sep 8 2018 3:54 AM | Last Updated on Sat, Sep 8 2018 3:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment