భూలావాదేవీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి
విజయవాడ : రాజధాని నిర్మాణం పేరుతో నగరంలో, జిల్లాలో జరుగుతున్న భూ లావాదేవీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యునియన్ రాష్ర్ట అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక మాఫీయా, రియల్ ఎస్టేట్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌లు కేటాయిస్తున్నామని ప్రకటనలు చేస్తూ, వాటి చాటున పచ్చచొక్కాలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. కిలో బియ్యం కన్నా కిలో ఇసుక రేటు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక భవన నిర్మాణాలు చేపట్టలేమని బిల్డర్స్ అసోసియేషన్లు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. భవన నిర్మాణ రంగం కుదేలై, దానిపైన ఆధారపడిన లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
నగరం చుట్టు పక్కల ఎయిమ్స్, హైకోర్టు, ఎయిర్ పోర్టు వస్తున్నాయంటూ ముందుగా మంత్రులకు లీకులిచ్చి ఆయా ప్రాంతాల్లో భూములను జీపీ పద్ధతిలో కొని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని విమర్శించారు. జీపీల ద్వారా 60 వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోందన్నారు. మంత్రులే బృందాలుగా తయారై రియల్‌ఎస్టేట్ అరాచకాలక పాల్పడుతన్నారని ఆరోపించారు.
బక బృందానికి సి.ఎం.రమేష్, మరో బృందానికి దేవినేని ఉమ, ఇంకో బృందానికి నారాయణ, సృజనాచౌదరి నేతృత్వం వహిస్తూ రియల్ దందాలతో ప్రభుత్వ ఖజానాకు కోత పెడుతూ వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని వివరించారు. ఎస్సీ నాయకులు కాలే పుల్లారావు, సేవాదళ్ నగర కన్వీనర్ కమ్మిలి రత్నకుమార్ పాల్గొన్నారు.