రాస్తా దిగ్బంధం
రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆందోళన
రహదారులపై బైఠాయించిన పార్టీ శ్రేణులు
రోడ్లపైనే వంటావార్పు, సహపంక్తి భోజనాలు
స్తంభించిన వాహన రాకపోకలు
రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు గురువారం రహదారుల దిగ్బంధం చేపట్టారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో పెద్దఎత్తున కార్యక్రమాలు జరిగాయి. రోడ్డుపైనే వంటావార్పు చేపట్టడంతోపాటు, అక్కడే భోజనాలు చేశారు, రోడ్ల దిగ్బంధనం కారణంగా అనేక ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. వైఎస్సార్ జిల్లా కడప, పులివెందుల, రాజంపేట, కమలాపురంలలో రోడ్లను దిగ్బంధించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో, చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలో తడుకు జాతీయ రహదారిని నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్‌కె.రోజా నేతృత్వంలో, చంద్రగిరి నియోజకవర్గంలో సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో రహదారులను ముట్టడించారు.
వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యు డు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో కర్నూలు జిల్లా నంద్యాలలో కర్నూలు-కడప రోడ్డును దిగ్బంధించారు. జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి నేతృత్వంలో కర్నూలు శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో కుమ్మరపాలెం సెంటర్‌లో హైవేపై వంటావార్పు చేశారు. వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌హెచ్-5 కనుపర్తిపాడు సెంటర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా గోకవరం పాత బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. కాకినాడ భానుగుడిసెంటర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం చేపట్టారు. జిల్లా నుంచి వెళ్లే 16,216 జాతీయ రహదారులను పలు ప్రాంతాల్లో దిగ్బం ధించారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో ఐ.పంగిడిలో రాష్ట్ర రహదారిని దిగ్బంధించారు. నరసాపురంలో పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బస్టాండ్‌వద్ద రోడ్డును దిగ్బంధించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. శ్రీకాకుళం- ఆమదాలవలస రహదారిపై వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహనరావు ఆధ్వర్యంలో చేపట్టిన బైఠాయింపులో పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, రాష్ట్ర మహిళా విభాగం సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైవే దిగ్బం ధించారు. గురజాల నియోజకవర్గంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిలో పార్టీ సీజీసీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో, రేపల్లె నియోజకవర్గంలో 214 ఏ జాతీయ రహదారిపై మాజీమంత్రి, రేపల్లె ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణరావు ఆధ్వర్యంలో దిగ్బంధనం జరిగింది.