
ప్రజాపోరాటాలే శ్వాసగా.. తిరుగులేని ప్రత్యామ్నాయంగా..
ఏడో వసంతంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగిడుతోంది. సమాజంలోని అన్ని వర్గాలతోపాటు ఆంధ్రనాట సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘పేరు’ ప్రతిష్టలను కూడా పొదువుకున్న పార్టీ అది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని మాత్రమే కాదు ఆయన ఆశయాలను, ప్రతి పేదవాడి కళ్లలో ఆనందం చూడాలన్న ఆకాంక్షను కూడా వారసత్వంగా స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓ మహోన్నత ఆశయంతో స్థాపించిన పార్టీ. పదవులు, సీట్ల ‘లెక్క’ కోసం దిగజారే రాజకీయాలకు అది దూరం. గెలుపు కోసం రకరకాల ఎత్తుగడలతో కూడిన సాంప్రదాయ రాజకీయాలు ఆ పార్టీలో కనబడవు.
నిరంతరం ప్రజలతో మమేకమవుతూ... శాసనసభలోనైనా, వెలుపలైనా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పోరాడుతూ ఒక దృఢమైన రాజకీయ పార్టీగా అవతరించింది. ఆరేళ్లుగా పార్టీ అనేక నిర్బంధాలను తట్టుకుని నిలబడింది. ఇద్దరి రాజీనామాతో మొదలైన ఆ పార్టీ ప్రస్థానం.. మూడేళ్లలోనే 67 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో బలమైన ఏకైక అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఎదిగింది. అధికారానికి చేరువగా వచ్చి అత్యంత ప్రజాదరణ గలిగిన పార్టీగా నిరూపించుకుంది. ఎన్నికల ముందుగానీ, ఆతర్వాతగానీ నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పోరాడుతూ ఇపుడు రాష్ట్రంలో తిరుగులేని ఏకైక ప్రత్యామ్నాయంగా నిలబడింది.
పార్టీ అంటే ఎత్తుగడలు కాదు..
రాజకీయ పార్టీ అంటే ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టడానికి ఎంతకైనా దిగజారడం... ఇలాంటివన్నీ కనిపిస్తాయి. అలాంటి సాంప్రదాయ పద్ధతులన్నిటినీ వైఎస్‌ఎస్‌ఆర్‌సీపీ బద్దలుకొట్టింది. నైతిక విలువలకు పెద్దపీట వేసింది. రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత అనే కొత్త ఒరవడికి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తను కాంగ్రెస్ పార్టీని వీడినపుడు రాజీనామా చేసి తిరిగి గెలిచారు. అలాగే తన వెంట నడవాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో నిలబడి ప్రజల తీర్పు కోరేలా చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు పార్టీ మారితే పదవులకు రాజీనామా చేసి తిరిగి ప్రజా తీర్పు కోరాలనే ఉన్నతమైన విధానానికి ఎప్పుడూ కట్టుబడి ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.
ప్రజల మనసులో స్థానం సంపాదించాలే తప్ప దుర్మార్గపు ఎత్తుగడలకు పాల్పడరాదన్నది జగన్ అభిమతమని, అదే తమ పార్టీ విధానమని ఆయన వివరించారు. ఒక ప్రాంతీయ పార్టీ.. దేశంలోనే ఇలా సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా రాజకీయాలు నడపగలదని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రజలతో మమేకం కావడం, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయడం తప్ప రాజకీయ పార్టీకి ఇతర షార్ట్‌కట్‌లు ఏవీ ఉండరాదన్నది వైఎస్‌ఆర్‌సీపీ విధానం. అదే దాని సిద్ధాంతం. అందుకే ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకు చేరువలో ఉండేలా, ప్రజలతో మమేకమయ్యేలా ఉంటాయని, జగన్‌మోహన్‌రెడ్డి అనునిత్యం ప్రజలకు దగ్గరగా ఉండడానికి, ప్రజా సమస్యలపై పోరాడడానికే ప్రాధాన్యతనిస్తుంటారని వైఎస్సార్సీపీకి చెందిన మరో సీనియర్ నేత పేర్కొన్నారు.
విలువలే ప్రాణం..
రాజకీయ విలువలకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుసుకోవడానికి అనేక ఉదంతాలు చూడవచ్చని ఆ పార్టీ నాయకులంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ సంఘటనను పార్టీ సీనియర్ నాయకుడొకరు వివరిస్తూ ‘‘వైఎస్‌ఆర్‌సీపీలో చేరడానికి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి తన పదవికి రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు గనుక ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీని చేస్తానని జగన్ మాట ఇచ్చారు. వీరభద్రస్వామి ఓడిపోయారు. అయితే అప్పటికి ఆయన ఎమ్మెల్సీ రాజీనామా సాంకేతిక కారణాల రీత్యా ఆమోదం పొందలేదు. ఎమ్మెల్సీగా కొనసాగుతారా అని మండలి నుంచి ఆయనకు పిలుపు కూడా వచ్చింది. అయినా ఆ రాజీనామా ఆమోదం పొందాల్సిందేనని వైఎస్‌ఆర్‌సీపీ తేల్చిచెప్పింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్సీ పదవి అది. ఆ తర్వాత జగన్ ఇచ్చిన మాట ప్రకారం వీరభద్రస్వామిని వైఎస్‌ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్సీని చేశారు. ఆరోజు విలువలదేముందిలే.. అని అనుకుని ఉంటే వైఎస్సార్సీపీకి ఓ ఎమ్మెల్సీ పదవి మిగిలేది.’’ అని గుర్తు చేశారు.
‘‘ఆనాడు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన 17 మంది ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను ఆమోదించి ప్రజల తీర్పు కోరే ధైర్యం లేక అధికారపార్టీ మిన్నకుండిపోయింది. పదేపదే స్పీకర్‌ను కలసి మా రాజీనామాలను ఆమోదించండి అని ఆ ఎమ్మెల్యేలు కోరడం చూసి దేశమే ఆశ్చర్యపోయింది. చివరకు సభలో అవిశ్వాస తీర్మానం పెడితే నాటి ప్రతిపక్ష తెలుగుదేశం విప్ జారీ చేసి మరీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడింది. కానీ ఆ 17మంది పదవులు పోతాయని తెలిసి కూడా విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం వైఎస్‌ఆర్‌సీపీ విలువలతో కూడిన రాజకీయాలకు అద్దం పడుతుంది.’’ అని ఆ నేత వివరించారు.
చట్టసభల్లోనూ, వెలుపలా అదే నిబద్ధత
ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో వ్యవహరించాలి.. ఒక కమిట్‌మెంట్‌తో పనిచేయాలి తప్ప ఆషామాషీగా వ్యవహరించరాదన్నది వైఎస్సార్సీపీ విధానం. అందుకోసం అది చట్టసభలోనూ, వెలుపలా అదే నిబద్ధతతో కృషి చేస్తోంది. అధికారపక్షం మంద బలంతో ప్రతిపక్షానికి తగిన సమయం ఇవ్వకపోయినా, సస్పెన్షన్లతో బెదిరింపు రాజకీయాలు చేస్తున్నా.. ప్రజా సమస్యల పరిష్కారానికి సభావేదికను సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటున్నది. ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి ఏ అంశంపైనైనా సమగ్రమైన సమాచారంతో, పూర్తి అవగాహనతో సభకు వచ్చి అధికారపక్షాన్ని నిలదీయడం, పరిష్కార మార్గాలను సూచించడంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలందుతున్నాయి.
బాధ్యత గలిగిన ప్రతిపక్షనేతగా సభలోనూ, వెలుపలా ప్రజా సమస్యలపై జగన్ స్పందిస్తున్న తీరును విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారని, పార్లమెంటులోనూ తమ పార్టీ ఇదే విధంగా ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తోందని వైఎస్సార్‌సీపీకి చెందిన మరో సీనియర్ నేత తెలిపారు. పార్లమెంటు సాక్షిగా లభించిన హోదా హామీని సమాధి చేసేందుకు అధికార పార్టీ రకరకాల కుట్రలు సాగిస్తున్నా మూడేళ్లుగా పార్టీ సాగించిన పోరాటాల వల్లే అది ఇంకా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఏడో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వైఎస్సార్ స్వర్ణ యుగాన్ని సాధించాలని, సంక్షేమం కోసం పాటుపడాలన్న తమ కర్తవ్యాలకు పునరంకితమవుతున్నామని ఆ నేత వెల్లడించారు.