ఒంగోలు, న్యూస్‌లైన్: వంద రోజులకుపైగా సీమాంధ్రులు ఉద్యమిస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సమాయత్తం కావాలని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ స్థానిక కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
రాష్ట్ర విభజనను కేంద్రమంత్రి వర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ వివిధ రకాల ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల పదో తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువతతో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. 11న ట్రాక్టర్లతో ర్యాలీ, 12న రాష్ట్ర, జాతీయ రహదారుల దిగ్భంధంతోపాటు రోడ్లపై వంటావార్పు ఉంటాయని వెల్లడించారు. 14 నుంచి రోజుకో నియోజకవర్గంలో నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ కార్యక్రమాలను జిల్లాకు చెందిన కేంద్రపాలకవర్గ మండలి సభ్యులు, జిల్లా అధికార ప్రతినిధులు, జిల్లా వివిధ అనుబంధ విభాగాల కన్వీనర్లు, నగర, మండల కన్వీనర్లు, జిల్లా కమిటీల సభ్యులు, సమైక్యవాదులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు శృంగభంగమే..
ఢిల్లీ ఫలితాల మాదిరిగానే రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు శృంగభంగం తప్పదని బాలాజీ పేర్కొన్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆల్మట్టి ఎత్తు పెంచితే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీరు రాదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు వచ్చే అన్ని రకాల అప్పీళ్లను పరిశీలిస్తామని జీఓఎం చెప్పిన మాటలు అబద్ధమన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు పాల్గొన్నారు.
నేటి నుంచి వైఎస్‌ఆర్ సీపీ ఆందోళనలు
Published Tue, Dec 10 2013 6:11 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement