ప్రజలతో మమేకం... సమస్యలపై పోరాటం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘అయ్యిందేదో అయ్యింది. భవిష్యత్ మనదే. సమష్టిగా పని చేద్దాం... ప్రజల మధ్యే ఉంటూ....వారి సమస్యలపై పోరాడుతూ మరో వైపు పార్టీని పటిష్టం చేద్దాం. వచ్చే నాలుగేళ్లూ కార్యకర్తలకు అండగా ఉందాం. అన్ని వేళలా పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వద్దాం’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎస్. కోట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
ఆ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై విశాఖపట్నంలోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌లో గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వచ్చిన ఓట్లపై ఆరా తీశారు. ఎక్కడ నష్టం వాటిల్లిందో తెలుసుకున్నారు. పార్టీ నాయకులతో ఫలితాలపై క్షుణ్ణంగా చర్చించారు. ప్రత్యర్థుల గెలుపునకు దోహదపడిన అంశాలపైనా, పార్టీ పరమైన లోటుపాట్లపై లోతుగా విశ్లేషించారు. లోపాలను సరి చేసుకుని ముందుకెళ్దామని సూచించారు. భవిష్యత్‌లో పార్టీని పటిష్ట పరుచుకుని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఉద్యమించి, కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో పార్టీని సమర్థంగా నడుపుకొందామన్నారు.
ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఉంటే మనమే అధికారంలోకి వచ్చేవారమని, అలా చేసి ఉంటే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అప్రతిష్టను మూట గట్టుకునే వాళ్లమన్నారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేద్దామని, ప్రజలకు అండగా నిలిచి, వారి అభిమానంతోనే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వద్దామని శ్రేణుల్లో జోష్ నింపారు. ఇదే సందర్భంలో పార్టీని పటిష్ట పరిచేందుకు కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అత్యధిక మందితో వ్యక్తిగతంగా మాట్లాడి సూచన, సలహాలు తీసుకున్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకులు రొంగలి జగన్నాథం, నెక్కల నాయుడుబాబు, వేచలపు చిన రామునాయుడు, తూర్పాటి కృష్ణస్వామినాయుడు, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్. కోట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నెక్కల నాయుడుబాబు.. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం మేరకు ఎస్.కోట నియోజకవర్గ ఇన్‌చార్జి ్జగా నెక్కల నాయుడుబాబును నియమిస్తున్నట్టు సమీక్ష సమావేశంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా నాయుడుబాబును ప్రత్యేకంగా అభినందించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయుడుబాబు పార్టీని సమర్థంగా నడపగలరన్న అభిప్రాయం మేరకు ఆయన్ని నియమించినట్టు తెలిసింది.