కదనోత్సాహంతో..
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదనోత్సాహంతో ముందుకు కదులుతోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) సారథ్యంలో గురువారం నుంచి క్షేత్రస్థాయి కార్యాచరణకు రూపకల్పన చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆళ్ల నాని, పార్టీ ముఖ్య నేతలు పర్యటించనున్నారు. గురువారం పోలవరంలో పర్యటించడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. గతంలో అనేక ఉద్యమాలు చేసిన నేపథ్యం ఉన్న ఆళ్ల నాని గతంలోనూ ఏలూరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. తాజా పర్యటనలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇబ్బందులను తెలుసుకుని వారిలో ధైర్యం నింపనున్నారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి త్వరలో ఏర్పాటు చేసే అనుబంధ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించనున్నారు.
కార్యకర్తలకు అండగా నిలబడటంతోపాటు, ప్రభుత్వం అనుసరి స్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబట్టేం దుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా క్షేత్రస్థాయి పర్యటనల్ని మలుస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే ప్రజా ఉద్యమాలు ఏ విధంగా ఉండాలనే దానిపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించి సూచనలు, అభిప్రాయాలు సేకరించేందుకు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలసి పోలవరం నియోజకవర్గ పరిధిలోని బుట్టాయ గూడెంలో చేపట్టబోయే పాదయాత్రలో పాల్గొనేందుకు ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ మంత్రి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ వస్తున్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. జిల్లా ముఖ్య నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆళ్ల నానితో ఘంటా ప్రసాదరావు భేటీ
చివరివరకూ పార్టీ కోసమే పనిచేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఘంటా ప్రసాదరావు స్పష్టం చేశారు. కొన్ని అపార్థాల కారణంగా కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్న ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు అళ్ల నానితో బుధవారం భేటీ అయ్యారు. పార్టీని నడిపించే బాధ్యత నాని తీసుకోవడంతో ఆయన సారథ్యంలో పార్టీ మరింత పటిష్టమవుతుందన్న నమ్మకం ఏర్పడిందని ప్రసాదరావు పేర్కొన్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడితో కలసి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు.