వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాలు, ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయ సాధనకు వైఎస్సార్‌సీపీని స్థాపించడం జరిగిందని.. అందుకు అనుగుణంగా కృషి చేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాను ఎన్నికల తరువాత పాలకులు మర్చిపోయారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ..ఏడేళ్లుగా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలకు పాదాభివందనమన్నారు. చిరంజీవి లాంటి వాళ్ళు పార్టీ పెట్టి నడపలేక చేతులు ఎత్తేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీని పురిటిలోనే తొక్కేయాలని ప్రయత్నాలు చేశారని తెలిపారు. రావడం లేటు కావొచ్చు కానీ.. 2019 లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్ చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ వేడుకల్లో భూమన కరుణాకర్ రెడ్డి, లక్ష్మీ పార్వతి, వాసిరెడ్డి పద్మ, తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఒంగోలు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలు నిర్వహించిన వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోమవారం ఉదయం ఈపురుపాలెంలో భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు విలువలతో కూడిన రాజకీయాలను అందించేందుకు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కుల సాధన కోసం అండగా నిలుస్తూ పోరాడుతూనే.. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తాం’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఢిల్లీ : వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, మిధున్ రెడ్డి కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని, పోరాట పటిమ కలిగిన వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.
తూర్పు గోదావరి : జిల్లాలో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాజమండ్రిలో పార్టీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో, రాజోలులో కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో, పి.గన్నవరం నియోజకవర్గంలో కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.
అనంతపురం: జిల్లాలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, అనంతపురం సమన్వయకర్త నదీం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాగేపరశురాం, కృష్ణప్ప, అనంతపురం,హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బోయరంగయ్యలు తదితరలు ఈ వేడుకల్లో పాల్గాన్నారు. వైఎస్సార్ సీపీలో పనిచేయడం గర్వంగా ఉందని.. ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని అనంత వెంకట్రామి రెడ్డి తెలిపారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను ధీటుగా ఎదుర్కొన్న నేత వైఎస్ జగన్ అని, ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాటాలు ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ జిల్లా : పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన కార్యకర్తలు కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాయచోటి కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ నసీబున్ ఖానం, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వేంపల్లిలోని నాలుగు రోడ్ల కూడలిలో పార్టీ నేతలు జెండాను ఆవిష్కరించారు.
విజయవాడ: పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి, జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమలో నేతలు పార్థసారధి, ఉదయభాను, మాల్లాది విష్ణు, జోగి రమేష్, తోట శ్రీనివాస్, వెల్లంపల్లిలతో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన ముందుండి పోరాడుతుందని పార్థసారథి తెలిపారు. జగన్ చేస్తున్న ఉద్యమాలు, కార్యక్రమాలు ఏ ఒక్కరూ చేయలేదని, ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి జగన్ అని మరో నేత ఉదయభాను తెలిపారు.
కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య నేతలు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో బి.వై.రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ హాఫీజ్ ఖాన్, అన్నీ కులసంఘాలు నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో విశ్వసనీయత, విలువల పునాదులపై ఏర్పడిన పార్టీ వైఎస్సార్ సీపీ అని బి.వై.రామయ్య పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం ప్రతిక్షణం పోరాడుతున్న ఒకే ఒక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. ఆత్మకూరులో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శిల్ప చక్రపాణి రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖ: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరు మోద కొండమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టె, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమిలి అసెంబ్లీ పరిధిలో వాడవాడలా వేడుకలు జరిపారు. పార్టీ నాయకులు అక్కరమాని వెంకటరావు అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, బైక్ ర్యాలీ నిర్వహించారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగాయి. చంద్రగిరిలో పార్టీ కన్వీనర్ చిలకూరి యుగందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. రామచంద్రాపురం మండలం సూరావారిపల్లిలో పార్టీ కన్వీనర్ బ్రహ్మనందరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎర్రవారిపాళెంలో పార్టీ కన్వీనర్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. సంతపేటలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తంరెడ్డి జెండా ఆవిష్కరించారు.
మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మరియమ్మ వైఎస్సార్ విగ్రహనికి పులమాల వేసి, పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment