వందల బైక్‌లు... ఒకటే నినాదం
Published Sun, Jan 5 2014 4:26 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
బొబ్బిలి, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన ప్రక్రియను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీలు నిర్వహించారు. వందలాది మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహిస్తూ పెద్ద ఎత్తున జై సమైక్యాంధ్ర, జై జగన్ నినాదాలు చేశారు. విజయనగరం పట్టణంలో పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సమన్వయకర్త అవనాపు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ మయూరి, కోట, మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకా పరమేశ్వరి, రైల్వే స్టేషను జంక్షన్ల మీదుగా సాగింది. బొబ్బిలిలో అరుకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్‌కేకే రంగారావు ( బేబినాయన) ఆధ్వర్యంలో వందలాది మోటార్ సైకిళ్లతో దాదాపు 25 కిలోమీటర్ల మేర ర్యాలీని నిర్వహించారు. బొబ్బిలి కోట నుంచి బయలుదేరిన ర్యాలీ పట్టణంలోని పలు వీధులతో పాటు రామభద్రపురం మండల కేంద్రం వైపు సాగింది. బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మోటారు సైకిళ్లతో తరలివచ్చారు. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా వైఎస్‌ఆర్‌సీపీ పతాకాలే రెపరెపలాడాయి. సమైక్యనినాదాలు మిన్నంటాయి.
కోట నుంచి పోలీస్‌స్టేషను రోడ్డు, రైల్వే స్టేషను రోడ్డు, కాంప్లెక్స్ జంక్షన్ మీదుగా రామభద్రపురం వైపు వెళ్లి తిరిగి మళ్లీ అదే రూటులో కోటకు చేరుకున్నారు. వీరికి సమ్య్యైవాదులు, ప్రజలు సంఘీభావం తెలిపారు. సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ జరిగింది. బోసుబొమ్మ, శివాజీ బొమ్మ, ఎన్టీఆర్ జంక్షన్, సూర్యమహాల్, పెదకోమటిపేట, డబ్బీవీధిల మీదుగా సాగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు గరుడబిల్లి ప్రశాంత్, ఇతర నేతలు జర్జాపు ఈశ్వరరావు, సూరిబాబు, గొర్లె మధుసూధనరావులతో పాటు వందలాది మంది పాల్గొన్నారు. పాచిపెంట మండలంలో డోల బాబ్జీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. పార్వతీపురం నియోజకవర్గంలో వందలాది మోటారు సైకిళ్లతో సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభానుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.
వైఎస్ సర్కిల్ నుంచి పాత బస్టాండు వరకూ వెళ్లి అక్కడ నుంచి నర్సిపురం వెళ్లారు. తిరిగి పార్వతీపురం వచ్చారు. ర్యాలీలో ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కాపారపు సత్యనారాయణ, మజ్జి వెంకటేష్, ఆర్వీఎస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో సమన్వయకర్త బోకం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్.కోట నుంచి ఈ ర్యాలీ మొదలై ఎల్.కోట, కొత్తవలసల్లో సాగింది. డాక్టరు గేదెల తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎల్.కోట, వేపాడల్లో నిర్వహించగా, వేచలపు చినరామినాయుడు ఆధ్వర్యంలో వేపాడలో ర్యాలీ నిర్వహించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్త మీసాల వరహాలనాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. మూడు వందల బైక్‌లతో నియోజకవర్గంలోని చీపురుపల్లి, మెరకమొడిదాం, గరివిడి, గుర్ల మండలాల్లో ర్యాలీ నిర్వహించారు.
Advertisement
Advertisement