అధికారపక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి
నరసరావుపేటవెస్ట్: అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అధికారపక్షం పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ వారి హక్కులను కాలరాస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ , నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు విమర్శించారు. ఆదివారం నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ చివరి వరకు తెలుగుదేశం ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తుందన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శాసనసభలోకి రోజాను రానీయకపోవడం దారుణమని, కోర్టులో కంటెప్ట్ పిటిషన్ వేశామన్నారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరుగుతుందన్నారు.
అసెంబ్లీలో ఆర్టికల్ 340 ప్రకారం రోజాను సస్పెండ్ చేసి కోర్టులో మాత్రం 212 ప్రకారం సస్పెండ్ చేశామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయన్నారు. స్పీకర్‌పై అవిశ్వాసంలో నోటీసు విషయంలోనూ అప్రజాస్వామికంగానే వ్యవహరించారన్నారు.
అసెంబ్లీ జరుగుతున్న తీరు దారుణం: మర్రి
మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అసెంబ్లీ జరుగుతున్న తీరు దారుణమన్నారు. ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో సమస్యలపై దృష్టిసారించకుండా ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. బొండా ఉమామహేశ్వరరావు, బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు, అనిత, దేవినేని ఉమామహేశ్వరరావు ధూళ్ళిపాళ్ళ నరేంద్రలు ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహనరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్న తీరు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు.
న్యాయస్థానాలపై అపారమైన గొరవం ఉన్నట్లుగా చంద్రబాబునాయుడు మాట్లాడతారని, తనకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడితే చట్టసభలపై కోర్టులకు అధికారం లేదంటాడన్నారు. జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, నరసరావుపేట మండల కన్వీనర్ కొమ్మనబోయిన శంకరయాదవ్, ఎమ్మెల్యే అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు పాల్గొన్నారు.