కాకినాడ: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్టీ నేతలకు సూచించారు. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక హెలికాన్ టైమ్స్‌లో పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లతో సోమవారం పార్టీ కార్యకలాపాలపై సమీక్షించారు. ధర్మాన మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న భరోసాను ఇవ్వాలన్నారు. జాతీయ ప్లీనరీలో ప్రకటించిన నవరత్న పథకాలను కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.
నియోజకవర్గాల వారీ సమీక్ష
ఇంటింటికీ వైఎస్సార్‌తో పాటు పోలింగ్‌బూత్ స్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం, ఇతర అంశాలపై నియోజకవర్గాల వారీగా ధర్మాన సమీక్షించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి పార్టీని, పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, మోషేన్‌రాజు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, కాకినాడ పార్లమెంట్ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, అమలాపురం పరిశీలకులు వలవల బాబ్జి, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, ముత్తా శశిధర్, తోట సుబ్బారావునాయుడు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, అనంత ఉదయభాస్కర్, కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, అల్లూరి కృష్ణంరాజు, పితాని బాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment