
విభజనలా వ్యవహరించారు!
ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన తీరుగానే రాజధాని ప్రకటన కూడా ఉందని వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం ధ్వజమెత్తింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామో.. పాకిస్థాన్‌లో ఉన్నామో.. అర్థం కాలేదని దుయ్యబట్టింది. రెండున్నర లక్షల మందికి ప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోకుండా, కనీసం సభలో చర్చించనీయకుండా మేం రాసిందే శాసనం.. చెప్పిందే వేదం.. అన్నట్లుగా టీడీపీ సభ్యుల వ్యవహారం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో గురువారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పి.రవీంద్రనాధ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్, చాంద్‌బాషా, అంజాద్ బాషా, ఐజయ్య, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వరుపుల సుబ్బారావు, విశ్వేశ్వరరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు, పీడిక రాజన్నదొర, దేశాయి తిప్పారెడ్డి, జి.ఈశ్వరి, పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతిలు వేర్వేరుగా మాట్లాడారు.
వైఎస్సార్ సీపీ శాసనసభ పక్షం సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ... స్పీకర్ ఛైర్ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని, రాజధాని ప్రకటన అంశంలో స్పీకర్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగులుతుందని విమర్శించారు. సామాన్యుడి రాజధాని నిర్మిస్తారా? రియల్‌ఎస్టేట్ రాజధాని నిర్మిస్తారా? అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత చర్చలు జరపండనే విధంగా అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు ఉందని ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు.
కార్పొరేట్ లాబీకి మేలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుందని మరో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ ఆరోపించారు. చర్చ జరిపేందుకు అవసరమైతే అసెంబ్లీని ఈ నెల 15 వరకు పొడిగించాలని ఎమ్మెల్యేలు ఐజయ్య, వరుపుల సుబ్బారావులు డిమాండ్ చేశారు. రాజధానిని ఎక్కడ పెట్టినా తాము స్వాగతిస్తామని, 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న చోట పెట్టాలనేది తామ డిమాండని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. విజయవాడ-గుంటూరుకు తాము వ్యతిరేకం కాదని, చర్చ లేకుండా ప్రకటన చేయడం దారుణమని ఎమ్మెల్యేలు చాంద్‌బాషా, దేశాయి తిప్పారెడ్డిలు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామో.. నియంతృత్వంలో ఉన్నామో అర్థం కావట్లేదని ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, కిడారి సర్వేశ్వరరావులు విమర్శించారు.
కేంద్ర కమిటీ నివేదికను ఇవ్వకుండానే చర్చా?
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని ఎంపికపై ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటన చేయడంతో గురువారం శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలతో గందరగోళం తలెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ శాసన మండలిలో రాజధాని స్థల ఎంపికపై ప్రకటన చేశారు. మంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత చర్చ ప్రారంభించే ముందు పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని ఎంపికపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రతులను సభ్యులకు ఇచ్చిన తర్వాతే సభలో చర్చ ప్రారంభిస్తామని ఇదివరకు మంత్రి పి.నారాయణ సభకు హామీ ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య గుర్తుచేశారు. సభలో తీసుకున్న నిర్ణయాలకే దిక్కులేకుండా పోతే ఎలా అంటూ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.
‘‘అధికారం తమ చేతుల్లోఉందనే రీతిలో ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఏపక్షంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్తే.. మేము సభ నుంచి వెళ్లిపోతాం.. మీరొక్కరే తీర్మానాలు చేసుకోండి’’ అని మంత్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన సందర్భంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యకే ప్యాకేజీ ఇస్తామని చెప్పినా ఏమాత్రం ప్రస్తావించలేదన్నారు. సభలో సమగ్రంగా చర్చ జరిగిన తర్వాతే రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు సభ్యులు బడ్జెట్‌పై మాట్లాడకుండా కేవలం రాజధాని ఎంపికపైనే ఎందుకు రాద్ధాంతో చేస్తున్నారో అర్థం కావడం లేదని జూపూడి ప్రభాకరరావు కాంగ్రెస్‌వారిను ద్దేశించి వ్యాఖ్యానించారు. వారు దాన్ని తీవ్ర దూషణలతో తిప్పికొట్టారు. చైర్మన్ ఎ.చక్రపాణి జోక్యం చేసుకున్నా ఫలితంలేక సభ వాయిదా పడింది.