కిరణ్, బాబు సోనియా కోవర్టులు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీకి కోవర్టులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర విభజనకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. తమ పార్టీ నిర్వహించిన సమైక్య శంఖారావం సభ విజయవంతం కావడంతో దిక్కుతోచక కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన సోమవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయిన విషయం ప్రజలందరికీ తెలిసిందేనని చెప్పారు. సీఎం పదవిని తీసుకునేటపుడే విభజనకు సహకరిస్తానని కిరణ్ హామీ ఇచ్చారనేది ఈరోజు ఆయన వ్యవహారశైలిని బట్టి స్పష్టమవుతోందన్నారు. నిత్యం వందలాది ఫైళ్లను ఆమోదిస్తూ సీఎం ఒక కలెక్షన్ ఏజెంట్‌లా తయారయ్యారని ఆరోపించారు.
తాను సమైక్యవాదినని గొప్పలు చెప్పుకుంటూ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చిన ఘనత కిరణ్‌దేనని విమర్శించారు. కిరణ్ నిజంగా సమైక్యవాది అయితే, సిగ్గూ, చీమూ, నెత్తురూ ఉంటే నవంబర్ 1 లోపుగా అసెంబ్లీని సమావేశపర్చి సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబు రాష్ట్ర విభజన కు సంబంధించి ఒక వైఖరి వెల్లడించకుండా ఆత్మగౌరవయాత్ర చేసి, ఆ తర్వాత ఢిల్లీలో దీక్ష చేశారని తప్పుబట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కు కావడమే కాకుండా... ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా విపక్షనేత చంద్రబాబు విప్ జారీ చేసి మరీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడారని గుర్తుచేశారు. జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే జేసీ దివాకర్‌రెడ్డి, లగడపాటి, ఇతర టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
మోడీ-సోనియా కుమ్మక్కయ్యారా?
శంఖారావానికి కాంగ్రెస్ ప్రత్యేక రైళ్లను ఇచ్చి కాంగ్రెస్ కుమ్మక్కయిందని జేసీ చేసిన ఆరోపణలపై శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. పాట్నాలో నరేంద్రమోడీ సభలకు కేంద్రం 20 రైళ్లను ఏర్పాటు చేసిందని, మరి మోడీ-సోనియా కుమ్మక్కయ్యారని అనుకోవాలా? అని ప్రశ్నించారు. జేసీ దివాకర్‌రెడ్డి తమ్ముడికి అనంతపురం లోక్‌సభ టికెట్ ఇవ్వాలని టీడీపీతో ఒప్పందం కుదుర్చుకోలేదా? అని నిలదీశారు. తాము నిబంధనల ప్రకారమే డబ్బు చెల్లించి రైళ్లు, బస్సులు తీసుకున్నామన్నారు. లగడపాటి సర్కస్‌లో జోకర్‌లా మధ్యమధ్యలో వచ్చిపోతుంటారని ఎద్దేవాచేశారు. ఢిల్లీలో తనకు కావాల్సిన పైరవీలు చేసుకుంటూ, రాష్ట్రంలో సీఎం వద్ద తన పనులు చేయించుకుంటూ సమైక్యవాదాన్ని నీరుగార్చుతున్న విషయం అందరికీ తెలుసునన్నారు. విద్యుత్ జేఏసీ ఉద్యోగులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమ్మె చేస్తే... లగడపాటి అదే సమయంలో తన విద్యుత్ ప్లాంటు నుంచి అధిక విద్యుత్‌ను సరఫరా చేసి వారి ఉద్యమాన్ని నీరుగార్చారని విమర్శించారు. విలేకరులను ఉద్దేశించి లగడపాటి వాడిన భాష సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉందన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతున్న జగన్‌పై ఓర్వలేక చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకే వదలిపెడుతున్నామని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.