బాబు, కిరణ్‌లను నిలదీయండి
-
పార్టీ నేతలకు, ప్రజలకు జగన్ పిలుపు
-
వారిద్దరూ విభజనకు సహకరిస్తున్నారని ధ్వజం
-
ఎన్నికల సమరానికి సిద్ధం కావాలి... గడపగడపకూ పార్టీని తీసుకెళ్లాలి
-
వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో కీలకోపన్యాసం
-
రాజకీయ వ్యవస్థలో నిజాయతీ లోపించింది
-
ఓట్లు, సీట్ల కోసం ఏ గడ్డి కరిచేందుకైనా పార్టీలు వెనకాడటం లేదు
-
సమైక్యమంటే రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు తెలంగాణ కూడా
-
సైనికుల్లా పని చేయాలంటూ పార్టీ శ్రేణులకు విజయమ్మ పిలుపు
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులను ప్రజల్లోకి వచ్చినప్పుడు కచ్చితంగా నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. విభజన విషయంలో వారిద్దరూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. విభజన చేయాలంటూ ఇచ్చిన లేఖను ఎందుకు వెనక్కు తీసుకోవడం లేదంటూ బాబును సూటిగా ప్రశ్నించారు. ‘విభజనపై ఇప్పుడు డొంకతిరుగుడుగా మాట్లాడుతూ చంద్రబాబు గింజుకుంటున్నారెందుకు? సమైక్యంగా ఉంచాలంటూ లేఖ ఇవ్వడం లేదెందుకు? ఇలాంటి వారు ప్రజల్లోకి వచ్చినప్పుడు కచ్చితంగా నిలదీయాల్సిందే’’ అన్నారు. సోమవారం ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశంలో జగన్ కీలకోపన్యాసం చేశారు.
రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో రాజకీయ వ్యవస్థలో నిజాయతీ పూర్తిగా లోపించిందని, ఓట్లు, సీట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఏ గడ్డి కరవడానికైనా వెనుకాడటం లేదని ధ్వజమెత్తారు. దేశంలో హిందీ మాట్లాడే వారి తర్వాత అతి పెద్ద సంఖ్యలో తెలుగు జాతి ఉందని గుర్తు చేశారు. రూ.1.75 లక్షల కోట్ల అతి పెద్ద బడ్జెట్‌తో బలంగా ఉన్న రాష్ట్రాన్ని ఓట్లు, సీట్ల కోసం బలహీనపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘17కన్నా ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రాలు 12 ఉన్నాయి. 25 స్థానాలున్నవి 8 ఉన్నాయి. విభజన జరిగితే జాబితాలో మన రాష్ట్రం 9, లేదా 14వ స్థానానికి దిగజారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమైక్యం కోసం పోరాడుతున్నది వైఎస్సార్‌సీపీ, సీపీఎం మాత్రమే. విభజనను అడ్డుకోవాల్సిన బాబు, కిరణ్ ప్రజలను మోసం చేస్తున్నారు. కేంద్రం చెప్పినట్టల్లా చేస్తూ, విభజనకు పూర్తి సహకరిస్తూనే మరోవైపు ప్రజలను గందరగోళపరుస్తూ మోసపుచ్చుతున్నారు. వారి మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. సమైక్యం కోసం ఇకపై కూడా ముందుండి పోరాడాలి’’ అని నిర్దేశించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అంటే మనకు తెలంగాణ కావాలి, రాయలసీమ కావాలి, కోస్తాంధ్ర కావాలని అర్థమని విడమరిచి చెప్పారు. మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని, అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయాలన్నదే పార్టీ అభిమతమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయా గ్రామాలకు సర్పంచ్‌లు, ఎమ్మెల్యేలు వెళ్లి, ‘మీ గ్రామంలో ఇళ్లు నిర్మించాం. పెన్షన్లిచ్చాం, స్కాలర్‌షిప్ వల్ల ఇంతమంది విద్యార్థులు చదువుకున్నారు, ఆరోగ్యశ్రీ వల్ల ఫలానా వాళ్లు చికిత్స చేయించుకున్నారు’ అని చెబుతూ గర్వంగా ఓట్లడిగేవారని జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం ఎప్పుడో మూడేళ్ల కిందట ఇచ్చిన దరఖాస్తులకు ఇళ్లు, రేషన్‌కార్డులు ఇవ్వజూస్తున్నారని దుయ్యబట్టారు. ఇది ఎన్నికల స్టంటే తప్ప మరోటి కాదని విమర్శించారు.
ఎన్నికలకు సిద్ధం కండి
సాధారణ ఎన్నికల కోసం సర్వసన్నద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు జగన్ పిలుపునిచ్చారు. ‘‘ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి 100 రోజులే ఉంది. పార్టీని విజయపథంలో నడిపించడానికి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు తమ పరిధిలోని ప్రతి గ్రామానికీ, వాటిల్లోని గడపగడపకూ వెళ్లాలి. మన పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల నమోదు కార్యక్రమంపై కూడా ప్రజల్లో చైతన్యం తేవాలి. నిత్యం వారి మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలి. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయండి. ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయండి. 20 మందితో బూత్ కమిటీలు వేయండి’’ అని దిశానిర్దేశం చేశారు. ఇకనుంచి ప్రతి కోఆర్డినేటర్ పనితీరునూ పర్యవేక్షిస్తామని, జిల్లా స్థాయిలో ఒక యూనిట్‌గా, రాష్ట్రమంతా ఒక యూనిట్‌గా ఈ పర్యవేక్షణ జరుగుతుందని చెప్పారు. ‘మీరంతా నాతో పాటుగా భుజం భుజం కలిపి అడుగులో అడుగు వేసి నడిచారు. నాకు తోడుగా నిలబడ్డారు. నా ప్రతి పోరాటంలోనూ వెంట నడిచారు. మనమంతా కలిసికట్టుగా పోరాటం చేశాం. కానీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో కొన్ని విషయాలు కచ్చితంగా మీతో చెప్పదలిచాను. ఇది మనకు చాలా కీలకమైన సమయం. 2014 మే 20 నాటికి ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. కనుక ఇప్పటిదాకా మనం ఏమేం పనులు చేశాం, ఇక ఎన్నికల షెడ్యూలుకు మిగిలి ఉన్న ఈ 100 రోజుల్లో చేయాల్సినవేమిటనే దానిపై ప్రణాళిక మేరకు పని చేసుకోవాలి’ అని చెప్పారు.
వైఎస్ మాదిరిగానే జగన్ భరోసా: విజయమ్మ
వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాగైతే తన హయాంలో రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చేవారో జగన్ కూడా అలాగే చేస్తారని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. పార్టీ సమైక్య నినాదంతో వెళ్తుందని, ప్రతి కార్యక్రమాన్నీ అందుకు అనుగుణంగా చేసుకోవాలని కోరారు. ‘‘రాష్ట్రాన్నెవరూ విడదీయలేరని నా మనస్సాక్షి చెబుతోంది. వైఎస్ కూడా ఇదే చెప్పేవారు. రాష్ట్రం బలంగా ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి సాధ్యమనేవారు. మనమంతా కలిసుంటామని తెలంగాణ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, మిగులు జలాలపై కట్టిన ప్రాజెక్టులు, పరిశ్రమలను జగన్ తీసుకొస్తారు.నన్ను నల్లగొండలో నిన్నఆపగలిగారు గానీ ఎప్పుడూ ఆపుతారా? ప్రజలు కష్టాల్లో ఉంటే నేను, జగన్ తప్పకుండా వస్తాం. అండగా ఉంటాం. వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఈ నాలుగేళ్లూ ప్రజల పక్షాన మనం చేసిన పోరాటాలు గానీ, దీక్షలు గానీ ఏ పార్టీ కూడా చేయలేదు. జగన్ ఉన్నప్పుడు కూడా ఓదార్పు యాత్రలు చేస్తూ అనేక రకమైన దీక్షలు చేశారు. ఆయన లేనప్పుడు నేను, షర్మిల, మీరంతా కలిసి పార్టీని నిలబెట్టుకున్నాం. 2009 ఎన్నికల్లో 180 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని వైఎస్ భావించారు. 156 మాత్రమే గెలిచామని చాలా బాధపడ్డారు. మనం ఈ నాలుగేళ్లు చేసింది ఒకెత్తు. ఇప్పుడు చేయబోయేది ఒకెత్తు. ఇప్పుడు అంతిమ సమయానికి వచ్చేశాం. కాబట్టి మరింత ఎక్కువ బాధ్యతతో ఎన్నికలొచ్చే దాకా సైనికులుగా పని చేయండి. మీకిచ్చిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చాలి. మహిళా, యువజన వంటి అనుబంధ విభాగాలన్నీ బాగా చేయాలి’’ అని నేతలకు విజయమ్మ సూచించారు.
ఇంటింటికీ వెళ్లండి
నియోజకవర్గంలోని ప్రతి ఇంటిలోనూ పరిచయాలు పెంచుకునే విధంగా పని చేయాలని వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ కో-ఆర్డినేటర్లకు జగన్ పిలుపునిచ్చారు. ‘‘నేను రాజకీయ కుటుంబంలో పుట్టాను. నా చిన్నప్పటి నుంచీ ఎన్నికలను చూస్తూనే ఉన్నాను. నాన్నను చూశాను. చిన్నాన్నను చూశాను. 30 ఏళ్లుగా ఎన్నికలు చూస్తూనే వస్తున్నాను. నాన్న కోసం ప్రచారం చేసేవాడిని, గ్రామాల్లో తిరిగే వాడిని. నేను గమనించిందేమిటంటే.. ఎన్నికల్లో అతి ముఖ్యమైనది ఎన్నికల యంత్రాంగం. ప్రజల దగ్గరకు వెళ్లి గడప గడపకూ వెళ్లి ప్రచారం చేయాలి. గతంలో అయితే చివరి నిమిషంలో టికెట్లొచ్చేవి. నాకింకా బాగా గుర్తుంది. నాన్న ఢిల్లీకి వెళ్లేవారు. వీలైనంత వరకూ టికెట్లు ఇప్పించడానికి గట్టిగా ప్రయత్నం చేసేవారు. వాళ్లు ఇస్తారో, ఇవ్వరో తెలియదు, కానీ చివరి నిమిషంలో టికెట్లు వచ్చేవి. రాగానే అభ్యర్థులు పరుగెత్తేవారు. అప్పటికి కేవలం 14 రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉండేది. అంత తక్కువ సమయంలో ఒక్కో అసెంబ్లీ స్థానంలో 100 పంచాయతీలు తిరగాల్సి వచ్చేది. అభ్యర్థుల భార్య, కుమారులు, తమ్ముళ్లు అందరూ తలో వైపు నుంచి సాధ్యమైనన్ని ఊళ్లు తిరిగి గడప గడపకూ వెళ్లి ఓట్లడిగే వారు. కానీ మనకిప్పుడు సమయం ఉంది. అందుకే ఎన్నికల షెడ్యూలుకు 100 రోజులే ఉందని గుర్తు చేస్తున్నా. కో-ఆర్డినేటర్లు రోజుకో పంచాయతీకి వెళ్లాలి. గడప గడపనూ తడమాలి. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజలకు దగ్గరవాలంటే తిరగక తప్పదు. ఇలా వంద శాతం గడప గడపనూ తొక్కిన వారికే టికెట్లిస్తాం’’ అన్నారు.
మా ఎమ్మెల్యేలు గర్వకారణం
‘‘మనది కొత్త పార్టీ. చాలామందికి అంతగా ఎన్నికల అనుభవం లేదు. మన పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు కూడా తక్కువే. మన ఎమ్మెల్యేల గురించి గర్వంగా చెప్పుకోవాలి. పదవులు పోతాయని, అనర్హులం అవుతామని తెలిసినా అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసి మన వెంట నిలిచారు. వారి గురించి గొప్పగా చెబుతూ ఉంటాను. మన పార్టీలో కొత్తవాళ్లు, గట్టివాళ్లని నమ్మిన వాళ్లకే బాధ్యతలు అప్పగించాం. వారంతా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. ఎన్నికల నిర్వహణ (ఎలక్షనీరింగ్) చాలా ముఖ్యం. ప్రతి బూత్‌కు 20 మందితో కమిటీలు వేసుకోకపోతే, ఆ కమిటీలో పదిమందినైనా పేర్లు పెట్టి పిలవలేకపోతే ఎన్నికలు చేసుకోలేరు. అందుకే గ్రామాలకు తరలండి. ప్రజలు ఏ మేరకు అభిమానం చూపిస్తున్నారో అప్పుడే అర్థమవుతుంది. వంద శాతం బూత్ కమిటీలు వేసిన వారికే టికెట్లిస్తాం’’ అని జగన్ అన్నారు.