ఉలుకు, పలుకు లేని వి'భజన' బాబులు!
రాష్ట్రాన్నివిభజించాలంటూ కేంద్రం అడ్డగోలుగా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య దీక్ష మూడో రోజుకు చేరుకుంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ఎడారిగా మారుతుందని వైఎస్ జగన్ ఆవేదనకు అధికార, ప్రతిపక్షాలు స్పందించకపోవడం శోచనీయం.
రాష్ట్ర విభజనను వ్యతిరేకించడానికి ఎజెండాలను పక్కన పెట్టి జెండాలతో కలిసి రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అయినా సీమాంధ్ర ప్రజలపై ప్రధాన పార్టీల నుంచి ఉలుకు పలుకు లేకపోవడం ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
రాష్ట్ర రెండు రెండు ముక్కలైతే.. సీమాంధ్ర ప్రజలకు ఉప్పు నీరు తప్ప.. మంచి నీరు దొరకని పరిస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉందని వైఎస్ జగన్ చేసిన హెచ్చరికలపై కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి కాని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించకపోవడం వారి దగాకోరు రాజకీయాలకు దర్పణంగా నిలుస్తోంది.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీమాంధ్ర ప్రజలు వీధుల్లోకి వచ్చి విభజనకు సహకరించిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దాడులకు కూడా భయపడకుండా.. స్వచ్చందంగా ఆందోళనలో పాల్గొంటున్నారు.
సీమాంధ్రలో గత 70 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమం కారణంగా తీవ్ర స్థాయిలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. సీమాంధ్రలోని అనేక ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి.. విద్యాసంస్థలు మూతపడి.. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. అయినా రాజకీయ నేతల్లో సీమాంధ్ర ప్రయోజనాలకు సానుకూలంగా ఉండే నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి ఉద్యమించాల్సిన సమయంలో సీట్లు, ఓట్ల ప్రతిపాదికన రాజకీయాలు చేయడం ఎంత వరకు సబబు అని సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
భవిష్యత్ లో సీమాంధ్ర ప్రజల కష్టాలను నిలువరించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి ప్రధాన పార్టీల నేతలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతోనే ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఇప్పటికైనా వైఎస్ జగన్ పిలుపుకు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.