
రాజీనామా చేసి పడేయాల్సింది: వైఎస్ జగన్
చిత్తూరు: అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు తిరగబడడంతో, ఉనికి కోసం కొత్త పార్టీ వైపు సీఎం కిరణ్ ఆలోచిస్తున్నారని నెల్లూరులో చెప్పారు. సమైక్యమే తన ఏకైక డిమాండ్ అని.. సమైక్యానికి జై కొట్టిన వారికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు ఉంటుందని ఎన్డీటీవీతో వైఎస్ జగన్ చెప్పారు.
సమైక్యానికి మద్దతు ఇచ్చే అన్ని పార్టీలను కలుస్తామన్నారు. బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకు అందర్నీ కలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించడం న్యాయం కాదన్నారు. విభజనతో 70 శాతం మందికి నీళ్లు రావని అన్నారు. హైదరాబాద్ లేకుండా కొత్త రాష్ట్రం జీతాలు కూడా ఇవ్వలేదని చెప్పారు.
సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడు సీఎం ఏం చేశారని ప్రశ్నించారు. అప్పుడే రాజీనామా చేసి సోనియా మొహం మీద పడేయాల్సిందన్నారు. రాజ్యంగ సంక్షోభం సృష్టిస్తే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ఏపీఎన్జీవో సమ్మెకు కూడా సీఎం తూట్లు పొడిచారని ఆరోపించారు. వీలైనంత కాలం సీఎంగా ఉండాలన్నదే కిరణ్ లక్ష్యమని అన్నారు. సమైక్యమే తన ఏకైక అజెండా అని జగన్ పునరుద్ఘాటించారు.