
సాక్షి, చిత్తూరు: కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మంగళవారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ఈ రోజు దేశం మొత్తం ప్రశంసిస్తోందన్నారు. కోవిడ్-19 టేస్టులలో కానీ, రేషన్ పంపిణీలో కానీ సీఎం జగన్‌ను అందరు అభినందిస్తున్నారన్నారు. అంతేగాక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆయనను అభినందించారని తెలిపారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హైదరాబాద్‌లో దాక్కున్న బాబు సలహాలు తమకు అవసరం లేదని, ముందు ఆయన కొడుకు లోకేష్‌కు సలహాలు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
‘బాబు కుప్పంలో కేజీ పప్పు కూడా ఇవ్వలేదు’
ఇక ఇంట్లో కుర్చుని బాగా తింటూ సైక్లింగ్ చేస్తున్న చంద్రబాబు.. కరోనా నియంత్రణకు నిరంతనరం కృషి చేస్తున్న సీఎం జగన్‌ను విమర్శించడం సరికాదని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు తిన్నది అరక్క సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు సహాయం చేస్తున్న తనపై తప్పుడు ప్రచారం చేస్తూ.. బురద చల్లాలని చూస్తే తాను భయపడనన్నారు. అయిదేళ్ల టీడీపీ పాలనలో పుత్తూరులో తాగు నీరు ఇవ్వలేదని... కానీ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక అక్కడి ప్రజలకు మంచినీరు ఇచ్చిన రోజు మహిళలు ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. అయితే దానిని కూడా టీడీపీ నేతలు రాజకీయం చేస్తూ.. దుష్పచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.కాగా తాను సీఎం జగన్ స్ఫూర్తితో పేదలకు అండగా ఉంటున్నానని.. టీడీపీ నేతలు చేసే దుష్పచారాలకు రాజీపడనని రోజా పేర్కొన్నారు. ('ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించండి')