శ్రీకాళహస్తి ఎక్సైజ్ పోలీసులతో బొజ్జల సుధీర్ వాగ్వాదం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రశాంతంగా సాగుతున్న స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ, జనసేన నేతలు పథకం వేశారు. అందులో భాగంగా మూడు రోజులుగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల నామినేషన్ చివరి రోజు బుధవారం పుంగనూరు, చంద్రగిరి, గంగాధరనెల్లూరు పరిధిలో టీడీపీ, జనసేన నాయకులు నానా హంగామా చేశారు. పుంగనూరు మండలం కుమ్మరనత్తం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు టీడీపీ, జనసేన నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రెడ్డెప్ప నామినేషన్ దాఖలు చేశారు. జనసేన నాయకుడు హరిరాయల్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రెడ్డెప్ప చిన్నాన్న కుమారుడు హరితో నామినేషన్ వేయించేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న రెడ్డప్ప తన తమ్ముడు హరిని బలవంతంగా లాక్కురావటంపై గొడవకు దిగారు. అదే సమయంలో వారి చేత ఉన్న పత్రాలు బంధువులైన ఇద్దరు చించుకున్నారు. ఆ తర్వాత హరి నామినేషన్ వెయ్యకుండా నివాసానికి చేరుకున్నారు.
చంద్రగిరి నియోజకవర్గం పాకాల–2 ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. ఆ స్థానానికి టీడీపీకి అభ్యర్థి దొరకలేదు. ఎస్సీ వర్గానికి చెందినడేవిడ్ రవి భార్య ప్రియాంకతో నామినేషన్ వేయించేందుకు సిద్ధమయ్యారు. వీరి అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న రవి దౌర్జన్యం చేస్తున్నారంటూ కేకలు వేశారు. అందుబాటులో ఉన్న పోలీసులు కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ వేయించారు. అప్పటికి కూడా నామినేషన్ పత్రాన్ని బలపరిచే వ్యక్తులు ఎవ్వరూ ముందుకు రాలేదు. వాస్తవాన్ని మరుగుపరిచేందుకు టీడీపీ శ్రేణులు నానా హంగామా చేస్తూ గొడవ పడుతున్నట్లు సృష్టించారు. దీన్ని వారి అనుకూలురు పెద్దగా ప్రచారం చెయ్యడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే కార్వేటినగరం డైట్ కళాశాల ఎస్టీ కాలనీకి చెందిన వారు మండల కేంద్రానికి చేరుకున్నారు. వ్యక్తిగత విషయాలపై ఇరువురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో వారి వద్ద ఉన్న నివాస పత్రాలు కిందపడ్డాయి. కిందపడ్డ పత్రాలను తీసుకునేందుకు ఇరువురు వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో ఆ పత్రాలు చిరిగిపోయాయి. అయితే ఈ విషయంపై టీడీపీ శ్రేణులు అసత్య ప్రచారానికి దిగాయి. అలాగే టీడీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్ ఇంట్లో ఎక్సైజ్ పో లీసులు 10 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి ఎక్సైజ్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై దౌర్జన్యానికి దిగాడు. అదేవిధంగా రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో బొజ్జల సుధీర్‌రెడ్డి వీరంగం సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment