గర్జించిన యువజనం | YSR congress party supporters protest against state division | Sakshi
Sakshi News home page

గర్జించిన యువజనం

Published Wed, Dec 11 2013 3:00 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

గర్జించిన యువజనం - Sakshi

గర్జించిన యువజనం

 వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ర్యాలీలు
 సీమాంధ్ర వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు.. మార్మోగిన సమైక్య నినాదాలు


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు నిర్విరామపోరు సాగిస్తున్న ఆ పార్టీ శ్రేణులు మంగళవారంనాడు సీమాంధ్ర జిల్లాల వ్యాప్తంగా భారీర్యాలీలు, మానవహారాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిం చాయి. పార్టీ నేతల సారథ్యంలో వేలాదిగా యువకులు, విద్యార్థులు కదం తొక్కారు. ఎక్కడికక్కడ ద్విచక్రవాహనాలతో ప్రదర్శనలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన భారీర్యాలీలో వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో, తాడిపత్రిలో పార్టీ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు.

పార్టీ మహిళా విభాగం, ఎస్కేయూ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఇంటిని ముట్టడించి అవిశ్వాసానికి మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. చిత్తూరులో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి నాయకత్వంలో విద్యార్థులు భారీ ప్రదర్శన, మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో మానవహారం, కుప్పంలో నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి నాయకత్వంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రగిరిలో పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో  రాస్తారోకో చేపట్టారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
 కర్నూలు-రాయచూరు రహదారి దిగ్బంధం
 కర్నూలు జిల్లా మంత్రాలయంలో పార్టీ కార్యకర్తలు కర్నూలు - రాయచూరు రహదారిని దిగ్బంధించారు. పార్టీ  జిల్లా  కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కర్నూలులో ఎస్.వి.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కిరణ్,  కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జిల్లా మంత్రుల ఫొటోలతో రూపొందించిన ఫ్లెక్సీపై పెట్రోల్ పోసి తగలబెట్టారు.   వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా పులివెందులలో, కడపలో విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. రాజంపేటలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు.

పార్టీ శ్రేణుల పాదయాత్ర: విశాఖలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్  భారీ పాదయాత్ర నిర్వహించారు. పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి మీదుగా నాతయ్యపాలెం వరకు భారీ ర్యాలీ  నిర్వహించారు.  తూర్పుగోదావరి జిల్లా  జగ్గంపేటలో పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో, రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి.  కాకినాడలో పార్టీ కార్యకర్తలు సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్, బొత్స, కిరణ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు.  పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబాయి ఆధ్వర్యంలో  విద్యార్థులు అమలాపురంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.


 జాతీయరహదారిపై రాస్తారోకో: పిఠాపురం కోటగుమ్మం సెంటర్ నుంచి వందలాది మంది విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.  పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో పార్టీ  జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏలూరులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం పేరిట భారీ బహిరంగసభ నిర్వహించారు. శ్రీకాకుళంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు ధర్నాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్.కోట, గజపతినగరం, సాలూరు, కురుపాం మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ర్యాలీలు చేపట్టాయి.


 మానవహారాలు: విజయవాడలో వన్‌టౌన్‌లో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.  సత్యనారాయణపురంలో పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన  ర్యాలీలో ఎస్సీ సెల్ రాష్ట్ర విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్, ప్రచార కమిటీ కన్వీనర్ విజయచందర్ పాల్గొన్నారు. జగ్యయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా  దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు, కనిగిరిలో,  మార్కాపురంలో, గిద్దలూరులో, సంతనూతలపాడులో బైక్ ర్యాలీలు జరిగాయి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు  జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో విద్యార్థులతో ర్యాలీలు, రాస్తారోకోలు జరిగాయి. ఈ ఆందోళనలకు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు నేతృత్వం వహించారు. గుంటూరు జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో, గుంటూరులో పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, సమన్వయకర్తలు నసీర్ అహ్మద్, షేక్‌షౌకత్ ఆధ్వర్యంలోనూ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు.


 నేడు ట్రాక్టర్లతో రైతుల ర్యాలీలు


సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని చోట్లా రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు చేపట్టనున్నారు.


 రేపు రహదారుల దిగ్బంధం


 సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12వ తేదీ గురువారం సీమాంధ్ర జిల్లాల్లో రహదారుల దిగ్బంధనానికి పార్టీ శ్రేణులు భారీగా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా రోడ్లపైనే వంటావార్పులు చేపట్టనున్నట్టు పార్టీ వెల్లడించింది. ఆందోళనలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement