
కోస్తాంధ్రలోనూ జగన్ హవానే..
* 123 అసెంబ్లీ స్థానాల్లో 87-95 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే
* మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో 12 నుంచి 16 సీట్లు ఫ్యాన్‌వే
* జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న 48% మంది ప్రజలు
* సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న కాంగ్రెస్
* టీడీపీకి 23 నుంచి 27 అసెంబ్లీ స్థానాలే
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ తరహాలోనే కోస్తాంధ్రలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం ఉందని ఎన్టీవీ - నీల్సన్ సర్వేలో వెల్లడైంది. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలతో పాటు అన్నింటా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హవా కొనసాగింది. వచ్చే సాధారణ ఎన్నికల తరువాత జగన్ ముఖ్యమంత్రి కావాలని కోస్తాంధ్ర ప్రజలు 48 శాతం మంది కోరుకున్నట్లు వెల్లడైంది. కోస్తాంధ్రలోని 123 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 87 నుంచి 95 స్థానాలు కైవసం చేసుకోనుందని సర్వే తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయపార్టీల స్థితిగతులపై నిర్వహించిన తాజా సర్వేలో భాగంగా శుక్రవారం కోస్తాంధ్రకు సంబంధించిన నీల్సన్ సర్వే ఫలితాలను ఎన్టీవీ ప్రసారం చేసింది.
కోస్తాంధ్రలోని ఓటర్లు జగనే సీఎం కావాలని అత్యధికంగా 48 శాతం మంది కోరుకుంటుండగా... అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబును 38 శాతం మంది ప్రజలు భావిస్తున్నట్లు వెల్లడైంది. ఇద్దరి మధ్య పది శాతం తేడా ఉన్నట్లు స్పష్టంగా తేలింది. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే కోస్తాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 87 నుంచి 95 స్థానాలు దక్కించుకొని పెద్దన్న పాత్ర పోషించనుంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్న టీడీపీని ఈసారి కూడా ఓటర్లు దూరంపెట్టారు. ఆ పార్టీకి 23 నుంచి 27 స్థానాలు మాత్రమే దక్కనున్నట్లు సర్వే పేర్కొంది. అయితే రాయలసీమతో పోల్చితే టీడీపీ కాస్త మెరుగైన స్థానాలు దక్కించుకుంది.
ఇక కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కేవలం 4 నుంచి 7 స్థానాలతో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విభజిస్తుందనే భావన ప్రజల్లో బలంగా ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కోస్తాలో నామమాత్రంగా ఉన్న బీజేపీకి 0 నుంచి ఒక్కస్థానం దక్కే అవకాశముంది. ఇతరులు 0 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశమున్నట్లు పేర్కొంది.
లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ హవా
కోస్తాంధ్రలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో కూడా వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. ఆ పార్టీకి 12 నుంచి 16 స్థానాల దాకా గెలుచుకొని స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. అదే విధంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 0 నుంచి 2 స్థానాలకే పరిమితమైంది. రెండు స్థానాలు కూడా టీడీపీకి దక్కని పరిస్థితి ఉన్నట్టు సర్వే వెల్లడించింది. ఇక కాంగ్రెస్‌కు 0 నుంచి 2 స్థానాలు దక్కవచ్చనుకున్నా.. ఖాతా తెరవడమే ఆపార్టీకి కష్టంగా ఉన్నట్లు పేర్కొంది.
గతంలో 2009లో 17 స్థానాలకు గాను 14 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి పరిస్థితి దయనీయంగా మారింది. ఓట్లశాతం విషయంలో కూడా వైఎస్సార్‌సీపీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. 45 శాతం ఓట్లతో మొట్ట మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండోస్థానంలో టీడీపీకి 38 శాతం ఓట్లు దక్కగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 13 శాతం మాత్రమే ఓట్లు రానున్నట్లు సర్వే స్పష్టంచేసింది.
రాయలసీమ, కోస్తాంధ్రల్లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 126-139 స్థానాలు కైవసం చేసుకుని అగ్రస్థానంలో ఉంటుందని సర్వేలో వెల్లడైంది. టీడీపీ 30-47 స్థానాలు దక్కించుకుంటుందని, కాంగ్రెస్ కేవలం 6-11 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని తెలుస్తోంది. ఇక మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో 19-24 స్థానాలు వైఎస్సార్‌సీపీ దక్కించుకుంటుందని కాంగ్రెస్, టీడీపీలు 0-3 స్థానాలకే పరిమితమవుతాయని సర్వే స్పష్టంచేస్తోంది.