
3,10,000+ లైక్స్.. సోషల్ మీడియాలో వైఎస్‌ఆర్‌సీపీ టాప్
సోషల్ మీడియాలో వైఎస్‌ఆర్‌సీపీ టాప్
సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ రికార్డు స్థాయిలో 3 లక్షల లైక్స్‌ను దాటింది. పార్టీ ఫేస్‌బుక్ లైక్స్(ఇష్టపడే వారి సంఖ్య) విషయంలో దేశంలోనే ప్రాంతీయ పార్టీలన్నిటిలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అగ్రగామిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, వైఎస్‌ఆర్‌సీపీ ఆన్‌లైన్ కమ్యూనిటీ పోర్టల్‌లకు సంబంధించిన బృందం సభ్యులు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను గురువారం ఉదయం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోషల్ మీడియాలో మంచి కృషిని సాగిస్తున్నారంటూ బృందం సభ్యులను విజయమ్మ అభినందించారు. పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ ప్రారంభించిన 10 నెలల్లోనే 3 లక్షల లైక్స్ (ఇష్టపడే వారి సంఖ్య) దాటడం నెటిజన్లలో జగన్‌పైన ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాల గురించి మరింత విస్తృతంగా ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా విజయమ్మ వారికి సూచించారు.
వైఎస్ మరణానంతరం సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడాన్ని నెటిజన్లకు అర్థమయ్యేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నారు. ప్రత్యర్థులను విమర్శించడం కంటే వైఎస్‌ఆర్ చేసిన మంచి పనులు, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు. పార్టీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజునే అంటే మార్చి 12వ తేదీనే పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ (www.facebook.com/ ysrcpofficial) 3 లక్షల లైక్స్‌ను పూర్తి చేసుకుంది. గురువారం ఉదయానికి ఈ సంఖ్య 3,10,000 వద్ద ఉంది. నెటిజన్లు విశేషంగా ఆదరిస్తుండడంతో ఇది క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.