
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలలోజిల్లాకు పెద్దపీట
విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీల నియామకంలో జిల్లా నేతలకు కీలక పదవులు దక్కా యి. విజయవాడలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో ఇక్కడి నేతలకు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యతగల పదవులు లభించాయి. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న పలువురు నాయకులను అనుబంధ సంఘాలకు అధ్యక్షులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో నలుగురు నేతలకు అత్యంత ప్రాధాన్యతగల విభాగాలను అప్పగిం చారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కార్యదర్శిగా గొల్లపూడికి చెందిన తలశిల రఘురాం నియమితులయ్యారు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణను నియమించారు.
దివంగత వంగవీటి రంగా కుమరుడు రాధాకృష్ణకు యువతను ఉత్సాహంగా పార్టీ వైపు నడిపించే బాధ్యతలు అప్పగించారు. రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా గుడివాడకు చెందిన ఎం వీఎస్. నాగిరెడ్డి నియమితులయ్యారు. కొన్నేళ్లుగా ఆయన రైతుల సమస్యలపై పోరాడుతున్నారు.
ఇందుకోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. రైతు సమస్యలపై ఆయనకు మంచి అవగాహన ఉండటంతో కీలక బాధ్యతలను అప్పగించారు. నగరంలో మరోముఖ్యనేత పి.గౌతమ్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత గల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు విజయవాడ, ఎంపీ స్థానాల పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు.
మచిలీపట్నం ఎంపీ పరిశీలకులుగా గుంటూరు జిల్లాకు చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి రమణ, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నియమితులయ్యారు. అలాగే పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మోపిదేవి వెంకటరమణకు కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియమకాల పట్ల పార్టీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.