State Committee
-
కేంద్ర శాఖల కార్యదర్శులతో ఏపీ బృందం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పెండింగ్ సమస్యలపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం సోమవారం భేటీ అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వం వహిస్తున్న ఈ బృందంలో ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సహా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని రాష్ట్ర ప్రతినిధుల బృందం కేంద్ర కార్యదర్శుల బృందాన్ని కోరింది. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని, విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థలన్నింటికీ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం కోరింది. కేంద్ర కార్యదర్శుల బృందం దృష్టికి తీసుకెళ్లిన వివరాలివే.. ►కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేస్తే.. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల, తాగునీటి వ్యయాలను ఒక్కటిగానే పరిగణించి నిధులివ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను త్వరితగతిన మంజూరు చేసి, ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా చూడాలి. ►రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇదే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చడానికి సహకరించాలి. ►2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్ధారించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కాబట్టి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.18,830.87 కోట్లను చెల్లించి ఆదుకోవాలి. ►విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకు రూ.6,284 కోట్లను విద్యుత్ చార్జీల రూపంలో తెలంగాణ ఏపీకి చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ బిల్లులను చెల్లించేలా తెలంగాణ సర్కార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ►జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దీని వల్ల రాష్ట్రంలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. దీని వల్ల అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన చేసి, ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి. ►కరోనా మహమ్మారి ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి. ►భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్‌ను రెన్యువల్ చేయాలి. వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. కాగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. అనంతరం సమస్యల పరిష్కారానికి కార్యదర్శులతో ప్రధాని మోదీ కమిటీ ఏర్పాటు చేశారు. -
టీఆర్ఎస్కు త్వరలో కొత్త ‘టీమ్’.. కసరత్తు ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని నాలుగైదు రోజుల్లో ప్రకటిం చడానికి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. గతంలో రద్దుచేసిన జిల్లా కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలకు అధ్యక్షులు లేదా కన్వీనర్ల నియామకంపై దృష్టి సారించారు. దీంతో పార్టీ పదవులు ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఆరంభంలో సభ్యత్వ నమోదుతో ప్రారంభమైన టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ వివిధ కార ణాలతో తరచూ వాయిదా పడుతూ వస్తోంది. గత అక్టోబర్‌లో జరిగిన ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గం మాత్రం ఏర్పాటు కాలేదు. అధినేతకు ఆశావహుల జాబితాలు జిల్లా కమిటీ అధ్యక్షుడు లేదా కన్వీనర్ పదవిని ఆశిస్తున్న నేతల జాబితాలను, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న రా ష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇప్పటికే కేసీఆర్‌కు అందజేశారు. ఆయా జాబితాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కన్వీనర్ల నియామకంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూర్పుపై అధినేత కసరత్తు చేస్తున్నారు. చదవండి: ఆ 5 రాష్ట్రాల్లో ఎన్నికలైతే, ఢిల్లీలో పార్టీల ప్రచారమెందుకు? కారణం ఇదే.. పదవుల్లో లేనివారికి బాధ్యతలు జిల్లా కన్వీనర్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో అధికార పదవుల్లో లేని వారికి బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నా రు. మరోవైపు అధికార పదవులు దక్కవనే అంచనాతో కొందరు, పార్టీలో ఏదో ఒక పదవి ఆశిస్తున్న మరికొందరు కమిటీల్లో తమకు అవకాశమివ్వాలని కేసీఆర్‌కు, కేటీఆర్‌కు వినతులు అందజేస్తున్నారు. కేసీఆర్ మాత్రం మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సమర్ధులైన నేతలకే కమిటీల్లో చోటివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. జిల్లా కమిటీలను పూర్తిస్థాయిలోనా లేదా కన్వీనర్ల నియామకంతోనే సరిపెడతా రా? అనేది వేచిచూడాల్సి ఉంది. మండల, పట్టణ కమిటీలు పూర్తి ఈ ఏడాది అక్టోబర్‌లోగా రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు మండల, పట్టణ స్థాయి కమిటీలే ఏర్పాటయ్యాయి. 2017 అక్టోబర్‌లో 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సహాయ కార్యద ర్శులతో ఏర్పాటైన రాష్ట్ర కార్యవర్గం ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ నోచుకోలేదు. రాష్ట్ర కార్యవర్గంలోని సత్యవతి రాథోడ్, సం తోష్కుమార్, బస్వరాజు సారయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, బండా ప్రకాశ్, పి.రాములు, మైనంపల్లి హన్మంతరావు, భా నుప్రసాద్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వంటి వారికి వివిధ పదవులు దక్కాయి. పార్టీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న కేకే రాజ్యసభ సభ్యుడి గా, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభా ష్‌రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చదవండి: ఐదేళ్లుగా ఈ హాస్పిటల్లో రోజూ 37 మంది శిశువుల మృతి.. అసలేం జరుగుతోందక్కడ? అనుబంధ కమిటీల పునర్వ్యవస్థీకరణ టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీకి అనుబంధంగా మరో పది కమిటీలు పనిచేస్తుండగా మహిళా, యువజన విభాగాల అధ్యక్షులకు అధికార పదవులు దక్కాయి. మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి వరంగల్ మేయర్‌గా, ఇంకా ఇతర నాయకులకు వివిధ పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో ఆయా కమిటీల్లో నిబద్ధత కలిగిన చురుకైన నేతలు, సీనియర్లకు చోటు కల్పించేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ సంస్థాగత నిర్మాణం, దళితబంధు పథకంపై పార్టీ కార్యాచరణ, హుజూ రాబాద్ ఉప ఎన్నిక తదితర అంశాలపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట్ర కమి టీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంగళవా రం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణంపై.. ఈ ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో మార్చి నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్‌లో పార్టీ అ«ధ్యక్షుడి ఎన్నిక ప్లీనరీ ఉంటుందని ప్రకటించారు. కానీ కోవిడ్ రెండో దశ, లాక్డౌన్ నేపథ్యంలో జాప్యం జరిగింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తిచేసి, పుస్తకాలను తెలంగాణ భవన్లో అందజేయాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆదేశించింది. సభ్యత్వ నమోదు దాదాపు కొలిక్కి రావడంతో సంస్థాగత కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఈ మేరకు షె డ్యూల్ తేదీలను మంగళవారం జరిగే సమావేశంలో కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. అన్ని కమిటీల ను ప్రక్షాళన చేయాలని.. వివిధ కారణాల తో అధికార పదవులు దక్కనివారు, చురుకైన నేతలు, కార్యకర్తలతో సామాజిక సమతూకం పాటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. దళితబంధు పథకంపై కార్యాచరణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకం ఉద్దేశాలు, లక్ష్యాలను పార్టీ యంత్రాంగం ద్వారా బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక, రాష్ట్ర రాజకీయాల్లో విపక్షాల దూకుడు, కొత్త రాజకీయ శక్తుల ప్రభావంపైనా తన మనోగతాన్ని వెల్లడించే అవకాశముంది. ఇక జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి, ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యకర్తలకు శిక్షణ, ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తదితర అంశాలపైనా కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. -
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లకై ఉద్యమించాలి
హైదరాబాద్: బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని పార్టీలకతీతంగా బీసీలందరూ పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో ఆంధ్రపదేశ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీల సమావేశం ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకానమ్మ అధ్యక్షతన జరిగింది. ఆర్.కృష్ణ య్య మాట్లాడుతూ.. 71 ఏళ్ల స్వతంత్ర భార తంలో పాలకులు బీసీలను అభివృద్ధి చేయకుండా గొర్రెలు, బర్రెలు ఇచ్చి, అడుక్కుతినే బిక్షగాళ్లను చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రంలోగానీ ఇప్పటివరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీలేడని ఆవేదన వ్యక్తం చేశా రు. 545 మంది లోక్‌సభ సభ్యుల్లో 96 మంది మాత్రమే బీసీలు ఉన్నారని, తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు కేవలం 22 మందే ఉన్నారన్నారు. తెలంగాణలో 112 బీసీ కులాలు ఉండగా ఇంతవరకు 104 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, జి.శ్రీనివాసులు, రమ్యశ్రీ (సినీ నటీ) తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా, బద్వేల్‌కు చెందిన జి.శ్రీనివాసులుకు నియమాక పత్రాన్ని ఆర్.కృష్ణయ్య అందజేశారు. తెలంగాణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా అల్లి లక్ష్మి, సభ్యులుగా సుమన్‌బాబు, దేవి మంజిరాలను ఎన్నుకుంది. -
బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ బుధవారం ప్రకటించారు. 10 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 10 మంది కార్యదర్శులు, కోశాధికారి, 10 మంది అధికార ప్రతినిధులతో కూడిన జాబితాను ఆయన ప్రకటించారు. -
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీలోకి ముగ్గురు
అనంతపురం టౌన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు లభించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన డీఎస్ కేశవరెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా, పి.విజయభాస్కర్‌రెడ్డి, వై.శ్రీధర్‌రెడ్డిలను రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా నియమించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్రకమిటీలో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీలో పలు నియామకాలు జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బోయినపల్లి శ్రీనివాస్‌రావు (కరీం నగర్), గుండెరెడ్డి రాంభూపాల్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సంయుక్త కార్యదర్శిగా పారిపెల్లి వేణుగోపాల్‌రెడ్డి (కరీంనగర్) నియమితులయ్యారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కె.విశ్వనాథ్‌చారి (రంగారెడ్డి), సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా సందమల్ల నరేశ్(కరీంనగర్)లను నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నియామకాలు చేసినట్లు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
దద్దరిల్లిన కలెక్టరేట్
వైఎస్ఆర్ సీపీ ధర్నాతో గురువారం కలెక్టరేట్ దద్దరిల్లింది. రైతులు, పార్టీ నేతలు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులతో ఆ పరిసరాలు నిండిపోయాయి. నేతల ప్రసంగాలకు జనం నుంచి మంచి స్పందన లభించింది. జై..జగన్ నినాదాలు మిన్నంటాయి. చంద్రబాబు పేరు ఎత్తగానే రైతులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. - వైఎస్ఆర్ సీపీ ధర్నాకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనం - నేతల ప్రసంగాలకు అపూర్వ స్పందన - జై జగన్ నినాదాలతో మార్మోగిన కలెక్టరేట్ ప్రాంగణం - బాబు పేరు ఎత్తగానే అసహనం వ్యక్తం చేసిన అన్నదాతలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు ఏడాది పాలన, మోసాలను ఎండగడుతూ ఆ పార్టీనేతలు గురువారం చేపట్టిన చిత్తూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి రైతులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధర్నానుద్దేశించి నేతలు చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నిరసన కార్యక్రమం జరిగిన తీరును ఇంటెలిజెన్స్ వర్గాలు ఆసక్తిగా ఆరా తీశాయి. సభ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆధ్వర్యంలో సాగింది. అందరి నేతలను సమన్వయం చేసుకుంటూ సభను చక్కగా నడిపారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగం సభికుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఆయన ప్రసంగం మొదలు పెట్టగానే వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఈలలు, కేకలు వేస్తూ తమ మద్దతు తెలిపారు. ఆయన చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తనదైన శైలిలో భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఆ పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపింది. బాబు మోసాలను తనదైన శైలిలో ఎండగట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన ప్రసంగం సభికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. బాబుపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల మన్ననలను పొందారు. ఈయన ప్రసంగం ధర్నాకు వచ్చిన ప్రజల్లో కొత్త ఊపునిచ్చింది. మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి బాబు పాలనలో రైతుల పరిస్థితి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పూసగుచ్చినట్లు వివరించారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి టీడీపీలో అబద్ధాలు ఎలా చెప్పాలో తర్ఫీదు ఇస్తారని, గతంలో తాను ఆ పార్టీలో ఉన్నందున అనుభవపూర్వంకగా చెబుతున్నప్పుడు ‘అవును... అవును’ అంటూ ప్రజలు తమ మద్దతును తెలిపారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ చంద్రన్న ఏడాది పాలనలో ప్రజలు ఏవిధంగా నష్టపోయారో కూలంకషంగా వివరించారు. మైనారిటీ అధ్యక్షుడు ఖాద్రీ చేసిన ప్రసంగం సైతం ముస్లిం సోదరులను ఆకట్టుకుంది. సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్తలు ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి తమదైన శైలిలో స్థానిక అంశాలపై ప్రసంగాలు చేసి ఆకట్టుకున్నారు. సభ ఉదయం10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటవరకు సాగింది. అయినా కూర్చున్నవారు కూర్చున్నట్లే కదలకుండా ఆసక్తిగా నేతల ప్రసంగాలను విన్నారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. కలెక్టరేట్ పరిసరాల్లో సభ జరిగిన తీరును చూసి ఉద్యోగులు, సామాన్య ప్రజలు సైతం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చర్చించుకోవడం కన్పించింది. -
కమిటీలేవీ... అధ్యక్షా !
రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో నియామకాలు ఎప్పుడు ⇒ జిల్లాల్లోనూ ఏర్పాటుకాని కార్యవర్గాలు ⇒నామినేటెడ్ పదవులు ఎలాగూ లేవు.. పార్టీ పదవులన్నా ఇవ్వరా.. ⇒పదవుల కోసం టీఆర్ఎస్ నేతల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ నేతలను కదిలిస్తే చాలు నిర్వేదం ప్రకటిస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీకి ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఏడాది. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు కూడా భర్తీ కాలేదన్న అసంతృప్తి వారిలో తీవ్రంగా ఉంది. చివరకు పార్టీ ప్లీనరీ జరిగి మరో రోజు గడిస్తే సరిగ్గా నెల రోజులు. కానీ, ఇప్పటికీ పార్టీ కమిటీల నియామకాలు పూర్తి కాలేదు. ‘నామినేటెడ్ పదవులు ఎలా గూ లేవు, అవి ఎప్పుడు భర్తీ అవుతాయో ఏమో .. కనీసం పార్టీ పదవులన్నా ఇవ్వారా..’ అంటూ ఆవేదన వెల్లగక్కుతున్నారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేయలేదు. పార్టీ అనుంబంధ విద్యార్ధి, యువజన, మహిళ, కార్మిక సంఘాల కమిటీలదీ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనూ అదే పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షున్ని గత నెల 24వ తేదీన జరిగిన పార్టీ ప్లీనరీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం కె. చంద్రశేఖర్‌రావు మరో మారు పార్టీ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత ఆయనే రాష్ట్ర కమిటీని ప్రకటించాలి. దీంతోపాటు పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయాలి. ఇలా ఈ నియామకాల్లోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవుల కోసం ఎదురు చూపులు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, కేబినెట్లో స్థానం పొందిన మంత్రులు మినహాయిస్తే పార్టీ కోసం పనిచేసిన వారెవరికీ ఎలాంటి పదవుల్లేకుండా పోయాయి. ఈ నిరాశ పార్టీ శ్రేణు ల్లో బాగా పేరుకుంది. నామినేటెడ్ పదవులు భర్తీపై ఊరడింపులు మినహా అమలు కాలేదు. వాటిపై ఆశలు ఆవిరైన వారు, కనీసం పార్టీసంస్థాగత పదవులైనా భర్తీ అవుతాయని ఎదురు చూశారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరుల పేర్లతో ప్రతిపాదనలు ఇస్తే కానీ కమిటీలను భర్తీ చేయలేని నిస్సహాయ స్థితిలో జిల్లా అధ్యక్షులు ఉన్నారని చెబుతున్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల గొడవలు ఉన్నాయి. గ్రామ, మం డల, నియోజకవర్గ స్థాయి ఎన్నికల్లో అవి స్పష్టంగా కనిపించాయి. జిల్లా కమిటీలను భర్తీ చేయాలన్నా అదే పరిస్థితి తలెత్తవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రస్థాయిలో పార్టీ పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్యా ఎక్కువగానే ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలోచన ఉండడంతో, రాష్ట్ర కమిటీ భర్తీని ఆలస్యం చేస్తున్నారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఇక, పార్టీ అత్యున్నత విభాగమైన పొలిట్‌బ్యూరో నియామకం కూడా అందుకే ఆలస్యమవుతోందని సమాచారం. పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ సభ తర్వాత పార్టీ శిక్షణ కార్యక్రమం ఉండడంతో ఆలస్యమైందని చెబుతున్నా, అసలు కారణం తెలియడం లేదంటున్నవారే ఎక్కువ. సాహసించి ఎవరూ నోరు మెదపడం లేదు కానీ, పార్టీ పదవులన్నా భర్తీ చేసి అవకాశం కల్పించాలన్న డిమాండ్ బలంగా వ్యక్తం అవుతోంది. -
YSRCP తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం
-
పార్టీ పదవుల్లో సమతుల్యత
సాక్షి ప్రతినిధి, కాకినాడ :సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీని పునర్వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేసే దిశగా జిల్లా నేతలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల నేతలకు పార్టీలో సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మెట్ట ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు, అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం రాత్రి ప్రకటించిన జాబితాలో జిల్లా నుంచి వివిధ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతలకు పార్టీ అత్యున్నత స్థాయి పదవులు కట్టబెట్టారు. ఇంతవరకు పార్టీ సీఈసీ సభ్యుడిగా ఉన్న మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోకి తీసుకున్నారు. మరో ముఖ్యనేత, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ను పీఏసీ సభ్యుడిగా నియమించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావును పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడిగా నియమించారు. ఈ నియామకాల్లో ప్రాంతాలు, సామాజిక సమీకరణల్లో సమతుల్యత పాటించారు. జిల్లా పార్టీ పగ్గాలు మెట్ట ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి అప్పగించగా, కోనసీమకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. తాజా నియామకాల్లో అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌కు పీఏసీ సభ్యుడిగా తీసుకోవడంతో ఆ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించినట్టయింది. సెంట్రల్ డెల్టా పరిధిలో బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సుభాష్‌చంద్రబోస్‌కు రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఆ వర్గానికి పెద్దపీట వేశారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావును పార్టీ కేంద్రపాలక మండలిలోకి తీసుకోవడం ద్వారా కమ్మ సామాజిక వర్గానికి పార్టీలో సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు నెహ్రూకు ఇటు రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు పార్టీ అధికార ప్రతినిధిగా కూడా తీసుకున్నారు. నీటి పారుదల సహా పలు అంశాలపై విశ్లేషణాత్మకమైన వివరణలతో నెహ్రూకు మంచి వాగ్ధాటి కలిగి ఉండడంతో.. అధికార ప్రతినిధిగా కూడా తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల నియామకాల్లో మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు రాజాకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తీసుకోవడం ద్వారా ఆ సామాజికవర్గ ప్రాతినిధ్యాన్ని పెంచినట్టయింది. ఈ రకంగా అటు కోనసీమ, ఇటు మెట్ట ప్రాంతంతో పాటు సెంట్రల్, ఈస్ట్రన్ డెల్టాలు, రాజమండ్రి ప్రాంతాలకు, సామాజికంగా అన్ని వర్గాల నేతలను తీసుకుని పదవుల పంపకాల్లో సమతుల్యత పాటించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు ముఖ్య పదవులు లభించాయి. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా చిన వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు. ఎస్సీ సెల్ అధ్యక్షునిగా మేరుగ నాగార్జున, ప్రధాన కార్యదర్శులుగా కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి బాధ్యతలతోపాటు ప్రకాశం జిల్లా వ్యవహారాలను, మోపిదేవి వెంకట రమణ కృష్ణా, గుంటూరు జిల్లాలు.. జంగా కృష్ణమూర్తి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల పార్టీ వ్యవహారాలను చూస్తారు. ఇదిలా ఉండగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి నియమితులయ్యారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలలోజిల్లాకు పెద్దపీట
విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీల నియామకంలో జిల్లా నేతలకు కీలక పదవులు దక్కా యి. విజయవాడలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో ఇక్కడి నేతలకు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యతగల పదవులు లభించాయి. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న పలువురు నాయకులను అనుబంధ సంఘాలకు అధ్యక్షులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో నలుగురు నేతలకు అత్యంత ప్రాధాన్యతగల విభాగాలను అప్పగిం చారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కార్యదర్శిగా గొల్లపూడికి చెందిన తలశిల రఘురాం నియమితులయ్యారు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణను నియమించారు. దివంగత వంగవీటి రంగా కుమరుడు రాధాకృష్ణకు యువతను ఉత్సాహంగా పార్టీ వైపు నడిపించే బాధ్యతలు అప్పగించారు. రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా గుడివాడకు చెందిన ఎం వీఎస్. నాగిరెడ్డి నియమితులయ్యారు. కొన్నేళ్లుగా ఆయన రైతుల సమస్యలపై పోరాడుతున్నారు. ఇందుకోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. రైతు సమస్యలపై ఆయనకు మంచి అవగాహన ఉండటంతో కీలక బాధ్యతలను అప్పగించారు. నగరంలో మరోముఖ్యనేత పి.గౌతమ్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత గల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు విజయవాడ, ఎంపీ స్థానాల పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు. మచిలీపట్నం ఎంపీ పరిశీలకులుగా గుంటూరు జిల్లాకు చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి రమణ, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నియమితులయ్యారు. అలాగే పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మోపిదేవి వెంకటరమణకు కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియమకాల పట్ల పార్టీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రేపటి నుంచి వైఎస్సార్ సీపీ సమీక్షలు
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వచ్చిన ఫలితాలపై జూన్ 1,2,3 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. త్రిసభ్య కమిటీ సభ్యులు భూమా నాగిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి రాజమండ్రి, కాకినాడ, రావులపాలెంలలో జరిగే ఈ సమీక్ష సమావేశాలకు హాజరవుతారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపోటములకు దారితీసిన పరిస్థితులపై వారు లోతైన అధ్యయనం, విశ్లేషణ చేస్తారన్నారు. రాజమండ్రి జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణమండపంలో ఆదివారం ఉదయం 9 గంటలకు రాజమండ్రి రూరల్, 10 గంటలకు రాజానగరం, 11 గంటలకు అనపర్తి, మధ్యాహ్నం 2 గంటలకు రంపచోడవరం, 3 గంటలకు మండపేట, 4 గంటలకు రామచంద్రపురం, 5.30కు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాలపై సమీక్షిస్తారన్నారు. జూన్ 2న కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు కాకినాడ రూరల్, 10.30కు పెద్దాపురం, 11.30కు ప్రత్తిపాడు, 12.30కు జగ్గంపేట, 3 గంటలకు పిఠాపురం, 4 గంటలకు తుని, 5గంటలకు కాకినాడ సిటీ నియోజకవర్గాలపై సమీక్షిస్తామని చెప్పారు. 3వ తేదీన రావులపాలెం సీఆర్సీలో జరిగే సమీక్షసమావేశంలో ఉదయం 9గంటలకు కొత్తపేట, 10 గంటలకు పి.గన్నవరం, 11కు అమలాపురం, 12కు రాజోలు, 1.30గంటలకు ముమ్మిడివరం నియోజకవర్గాలపై సమీక్షలు జరుగుతాయన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో పాల్గొంటారని చిట్టబ్బాయి తెలిపారు. -
సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా నెల్లూరీయుడు
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్ : సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడు వాసి పెనుబల్లి మధు ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయనను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి దశ నుంచే మధు వామపక్ష భావాలు కలిగి ఉండేవారు. 1970లో ఎస్ఎఫ్ఐని స్థాపించడంలో కీలక పాత్ర వహించేవారిలో ఒకరిగా పనిచేశారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో పదోతరగతి , అదే కళాశాలలో డిగ్రీ వరకు చదివారు. 1968లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. అప్పట నుంచి డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, రైతు సంఘాలతో పాటు పలుసంఘాల్లో కీలక భూమిక పోషించారు. హైదరాబాద్‌లో ట్రేడ్ యూనియన్ నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అక్కడే పాతబస్తీలో ఎంఐఎం సభ్యులను ఎదుర్కొని ధైర్యంగా ఉద్యమాన్ని నిర్మించారు. ఈ క్రమం లో ఆయనపై ఎంఐఎం సభ్యుల దాడి కూడా జరిగింది. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. గతంలో రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సీపీఎం జిల్లా ఇన్చార్జి, కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు వహిస్తూ రాష్ట్ర కార్యదర్శిగాఎన్నికయ్యారు. దీంతో జిల్లా వాసులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. -
పొత్తులపై నిర్ణయం కేంద్ర కమిటీదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల పొత్తు ఖరారు వ్యవహారాన్ని పార్టీ కేంద్ర కమిటీకి అప్పగిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ తీర్మానించింది. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో ఎన్నికల ఎత్తుగడలు, సర్దుబాట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కమిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కేంద్ర కమిటీని కోరినట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇప్పటిదాకా తమ ముందు మూడు మార్గాలుండేవన్నారు. అయితే టీడీపీ.. బీజేపీ వైపు వెళుతుండటంతో ఒకటి మూసుకుపోయిందని వ్యాఖ్యానించారు. మిగతా రెండింటిలో ఒకటి స్వతంత్రంగా వెళ్లటం మరొకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సీపీఐతో కలసి పని చేయాలన్నదన్నదే తమ చర్చల్లో మొదటి అంశమన్నారు. సీపీఐతో మాట్లాడాకే తమ నిర్ణయం ఉంటుందన్నారు. పొత్తులతో అనూహ్య ఫలితాలు: వైఎస్సార్ సీపీతో పొత్తుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ గతంలో దీనిపై చర్చించలేదని, ఇప్పుడు మాత్రం చర్చించామని రాఘవులు వివరించారు. వివిధ అంశాలపై భిన్నాభిప్రాయలున్నా సీపీఐతో కలసి పని చేయడానికి, సర్దుబాట్లకు ఆటంకమేమీ ఉండబోదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్తో సర్దుబాట్లు ఉంటాయనేదాన్ని ఇప్పుడు చెప్పలేమన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే రెండు కమిటీలుంటాయని, అవి చర్చించి నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. గతానికి భిన్నంగా మున్ముందు పొత్తులు, సర్దుబాట్ల ప్రాధాన్యత పెరుగుతుందని, ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 41 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ (4 తెలంగాణ, 2 సీమాంధ్ర) సీట్లలో పోటీ పడాలనుకుంటున్నట్టు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయదగిన అభ్యర్ధి లేకపోవడం, రెబెల్ లేదా ఇతరులకు ఓటేయాలనుకోకపోవడం వల్లే దూరంగా ఉండాలని నిర్ణయించామన్నారు. వామపక్షాల సమైక్య పోరాటంలో ఇటీవలి కొంత స్తబ్ధత నెలకొన్నా విద్యుత్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ లాంటి సమస్యలపై కలిసే ఆందోళనలు నిర్వహించామన్నారు. విద్యుత్తు చార్జీలపై రేపు హైదరాబాద్‌లో ధర్నా: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మంగళవారం హైదరాబాద్‌లోని సెంట్రల్ డిస్కం వద్ద ధర్నా చేయాలని రాఘవులు ప్రజలకు పిలుపునిచ్చారు. 6 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మూడు రోజులకే కుదించకుండా ప్రజాసమస్యలపై చర్చించేందుకు వీలుగా పొడిగించాలని డిమాండ్ చేశారు. 8 నుంచి జరిగే మున్సిపల్ సిబ్బంది సమ్మెకు మద్దతు ప్రకటించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ తీర్మానాలు: హోంగార్డుల వేతనాలు పెంచాలి; కాంట్రాక్ట్, క్యాజువల్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి; విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి; అంగన్వాడీల వేతనాలు పెంచాలి.