
2న వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ
ఇడుపులపాయలో ‘ప్రజాప్రస్థానా’నికి ఏర్పాట్లు
ఫిబ్రవరి 1న సీజీసీ భేటీ.. 2న అధ్యక్ష ఎన్నిక, విస్తృత సమావేశం: ఉమ్మారెడ్డి, పీఎన్‌వీ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్లీనరీని (ప్రజాప్రస్థానం) ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఈ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికతో పాటు ఇతర సంస్థాగత కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటిన పార్టీ పాలక మండలి (సీజీసీ) సమావేశమై అధ్యక్ష ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తుంది. రెండో తేదీన ఫలితాల ప్రకటనతో పాటు ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్లీనరీ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశం ఓ వైపు జరుగుతుండగానే అవసరమైతే మరోవైపు అధ్యక్ష ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. సంస్థాగత ఎన్నికల కన్వీనర్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నియమించారని ప్రసాద్ వివరించారు.
ప్రతి ఏటా వైఎస్సార్ జయంతి రోజున ప్లీనరీ జరపాలని భావించినప్పటికీ ఈ దఫా మాత్రం సంస్థాగత ఎన్నికల రీత్యా ఫిబ్రవరి 1, 2 తేదీల్లోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్లీనరీ రెండో రోజున విస్తృత సమావేశం ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతున్నందున ప్రతినిధులు ఉదయం 8.30 గంటలకే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కాగా, రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ అభ్యర్థి ఎన్నిక కావటానికి అవసరమైన 40 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం తమ పార్టీకి లేదు కనుకనే పోటీ చేయటం లేదని ఉమ్మారెడ్డి చెప్పారు.
ప్లీనరీ వివరాలివీ...
ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు సీజీసీ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూలును విడుదల చేస్తారు. 3 నుంచి 4 గంటల వరకు అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 5 గంటలకు నామినేషన్ల వివరాలను ప్రకటిస్తారు.
ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 11.30 నుంచి 12.30 వరకు ఓట్ల లెక్కింపు పూర్తిచేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు.
ప్లీనరీ ఎజెండా ఇదీ..: మొదట దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మృతి చెందిన నేతలకు సంతాప ప్రకటన. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రారంభోపన్యాసం. తర్వాత సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల ప్రసంగం. ప్లీనరీ ముగింపుగా పార్టీ అధ్యక్షుడి సందేశం.
ప్లీనరీకి ఆహ్వానితులు వీరు..: ఫిబ్రవరి 2న ప్లీనరీలో జరిగే విసృ్తత స్థాయి సమావేశానికి పార్టీలో 27 రకాల హోదాలున్న వారిని ఆహ్వానించారు. పార్టీ సలహాదారులు, సీజీసీ, సీఈసీ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకులు, శాసనసభా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి కమిటీల కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లు, వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి కమిటీల సభ్యులు, జిల్లా, సిటీల పార్టీ కన్వీనర్లు, రాష్ట్ర అనుబంధ కమిటీల కన్వీనర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మాజీ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లాల పరిశీలకులు, జిల్లాల అధికార ప్రతినిధులు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మునిసిపల్ పరిశీలకులు, కార్పొరేషన్ మాజీ మేయర్లు, పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లాల అధికారులు, జిల్లాల స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల, మునిసిపల్, నగర డివిజన్ కన్వీనర్లు, రాష్ట్ర అనుబంధ కమిటీల సభ్యులు, మునిసిపల్ మాజీ చైర్మన్లు, మాజీ జడ్‌పీటీసీ, ఎంపీటీసీలు, జిల్లాల అనుబంధ విభాగాల కన్వీనర్లను ఆహ్వానించారు.