రైల్వే జోన్ కోసం చాన్నాళ్ల నుంచి ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ ఆందోళనను తీవ్రతరం చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విశాఖలో ఈ నెల 14 నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నారు. అమర్‌నాథ్ దీక్షకు ఆ పార్టీ అధిష్టానం కూడా మద్దతు తెలిపింది. అలాగే ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని సంఘీభావం తెలపనున్నారు.
దీనిపై అమర్‌నాథ్ అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు నగరంలోని జిల్లాపరిషత్ వద్ద ఉన్న అంకోసా హాలులో అఖి లపక్ష నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ ఆవశ్యకతను ఈ సమావేశంలో వివరించనున్నారు. జోన్ కోసం ఇంకేమి చేయాలన్న దానిపై చర్చించనున్నారు. రైల్వేజోన్ కోసం ఈ తరహా సమావేశం జరగడం ఇదే తొలిసారి.