పోరుబాటలో వైఎస్‌ఆర్ సీపీ
Published Wed, Oct 2 2013 1:54 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే లక్ష్యంగా.. విభజన నిర్ణయంపై రెండు నెలలుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష సమరానికి సిద్ధమైంది. పార్టీ అధినేత జగన్ నిర్దేశించిన పోరు ప్రణాళికను ఆచరణలో పెట్టేందుకు జిల్లాలో పార్టీ ఉత్సాహంతో కదం తొక్కుతోంది. నియోజకవర్గ సమన్వయకర్తలు ఆయా కేంద్రాల్లో నిరవధిక దీక్షలో కూర్చోవడంతో పోరుబాటలో తొలి అంకానికి తెర లేస్తుంది. అక్కడినుంచి నెల రోజులపాటు ఏ రాజకీయ పార్టీ చేయ సాహసించలేని రీతిలో నిర్విరామ నిరసన కార్యక్రమాలు చేపట్టనుండటం సమైక్య ఉద్యమానికి ఖచ్చితంగా కొత్త ఊపునిస్తుంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్‌ఆర్‌సీపీ పూర్తిస్థాయి సమరానికి సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా జిల్లాలో సమరశీల కార్యక్రమాలకు మంగళవారం శ్రీకారం చుట్టనుంది. నెలరోజుల నిరసన కార్యక్రమాలను పార్టీ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. జాతిపిత గాంధీ జయంతి అయిన మంగళవారం నుంచి ప్రారంభమయ్యే నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆయన నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు రిలే దీక్షలు చేస్తుండగా, నిరవధిక దీక్షలతో నిరసన కార్యక్రమాలు మరింత ఉద్ధృతం కానున్నాయి.
సమన్వయకర్తలకు మద్దతుగా వందల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు రిలేదీక్షల్లో కూర్చోనున్నారు. శ్రీకాకుళంలో వరుదు కల్యాణి, ఎచ్చెర్లలో గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నంలో కలమట వెంకటరమణ, రాజాంలో పీఎంజే బాబు, పాలకొండలో విశ్వసరాయికళావతి, ఆమదాలవలసలో కిల్లి రామ్మోహనరావు, బొడ్డేపల్లి మాధురి, పలాసలో కణితి విశ్వనాథం, వజ్జ బాబూరావు, ఇచ్ఛాపురంలో తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ సతీమణి విజయ, నరసన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌లు నిరవధిక దీక్షలో కూర్చోనున్నారు. ధర్మాన కృష్ణదాస్, కలమట వెంకటరమణలు 48 గంటల దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. శ్రీకాకుళంలో జరిగే దీక్షలో పార్టీ మరో సమన్వయకర్త వైవీ సూర్యనారాయణ రిలే దీక్షలో పాల్గొంటారు. శ్రీకాకుళంలో జరిగే దీక్షలో తాను కూడా పాల్గొంటానని పిరియా సాయిరాజ్ చెప్పారు.
నెల రోజులూ నిరసనలే
నిరవధిక దీక్షలతో మొదలయ్యే పోరాటం వివిధ రకాల నిరసన కార్యక్రమాలతో నెల రోజులపాటు కొనసాగుతుంది. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని నాయకులు చెప్పారు. గాంధీ జయంతి రోజు నుంచి శాంతియుత వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రధాన సెంటర్లలో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు. శిబిరాల వద్ద సమైక్య గీతాలు ఆలపించడంతో పాటు కళారూపాలు ప్రదర్శించే విధంగా కార్యాచరణ రూపొందించారు. వర్షాకాలం కావడంతో దీక్షా శిబిరాల్లో కూర్చునే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు జిల్లా పార్టీ కార్యాలయం ప్రకటించింది. ఏ పార్టీ సాహసించని రీతిలో తమ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి దూకుతోందని, తద్వార ప్రజల ఆకాంక్షను గౌరవిస్తోందని నాయకులు పేర్కొంటున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
దీక్షలు కొనసాగుతుండగానే ఏడో తేదీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాప్రతినిధులు ఆ ప్రజలను కాదని, స్వార్థపూర్తి నిర్ణయాలతో ముందుకు సాగుతున్నందున వారిని నిలువ రించేందుకు ముట్టడి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement