
ఈ సారి క్లీన్ స్వీప్ చేస్తాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
♦ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు తథ్యం
♦ చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
♦ మార్కాపురం ప్లీనరీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని
మార్కాపురం/మార్కాపురం టౌన్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబునాయుడి ప్రజావ్యతిరేక విధానాలతో జనం విసిగి వేసారిపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజ లు వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడం ఖాయమన్నారు. గురువారం మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో నిర్వహించిన పార్టీ ప్లీనరీలకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యా రు.
మార్కాపురం పట్టణ సమీపంలోని రాయవరం జీఎస్ కల్యాణ మండపంలో స్థానిక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాలినేని మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు, పక్కా గృహాలు ఇచ్చారన్నారు. మూడేళ్ల నుంచి బాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అర్హులను పక్కన పెట్టి టీడీపీ కార్యకర్తలకు పథకాలు కట్టబెడుతున్నారన్నారు. దీంతో పేదలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు.
ప్రజాక్షేత్రంలో గెలిచిన నేత జగన్..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలో గెలిచారని, ఆయన పార్టీ పెట్టి ప్రజల హృదయాల్లో ఉండగా, లోకేష్ తండ్రిని అడ్డం పెట్టుకొని పరోక్షంగా ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవిని అనుభవిస్తున్నాడని బాలినేని ఎద్దేవా చేశారు. లోకేష్ తాను ఏం మాట్లాడుతాడో తనకే తెలియదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కల అని, అందుకే ఆయన వేల కోట్ల నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులు చేయించారని చెప్పారు. వైఎస్ మృతి చెందగానే ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే తన బాధ్యత అని బాలినేని పేర్కొన్నారు.
అదరం..బెదరం..: ఎమ్మెల్యే జంకే
నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు, బెదరింపులు ఎక్కువైపోయాయని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అధోగతి పాలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించి సంతోషంగా ఉంచగా, బాబు పాలనలో కరువు వచ్చి పంటలు పండక, ధరలు లేక, ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజల హృదయాల్లో రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోగా.. బాబు పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు దక్కాయని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేల అధికారాలను హరిస్తూ అనర్హులకు పథకాలను వర్తింప చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, తాము బెదిరేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కె.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, పరిశీలకులు వై.వెంకటేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి మాట్లాడారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తిప్పి కొడదాం : బాలినేని
యర్రగొండపాలెం: ప్రజా వ్యతిరేక విధానాలను అవలభిస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని త్రిప్పి కొట్టే సమయం ఆసన్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం స్థానిక డీసీఆర్ (ముద్ర)స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వమించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో బాలినేని మాట్లాడుతూ ప్రతిపేదోడు తమవాడేనని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు.
బాబు పాలనంతా అవినీతి మయంగా మారిందని, డబ్బు సంపాదనకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మాతో గెలిచిన డేవిడ్‌రాజు కేవలం డబ్బులకు అమ్ముడుబోయాడని, పేదోడని టికెట్టిప్పించి, ఆర్థికంగా అన్నివిధాల ఆదుకుంటే పార్టీ ఫిరాయించి మోసం చేశాడని విమర్శించారు. ముందుగా స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిధిగృహం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ విగ్రహానికి బాలినేని పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్లీనరీలో నియోజకవర్గ అబ్జర్వర్, మాజీ ఎమ్మెల్యే కె.పి.కొండారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు వరికూటి కొండారెడ్డి, ఎస్ రవణమ్మలు పాల్గొన్నారు.